1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: మంగళవారం, 11 జనవరి 2022 (18:57 IST)

సామాన్య భక్తులను తిరుమలేశుని పాదాల చెంతకు చేర్చే కొత్త పథకం?!! ఏంటది?

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైయున్న దివ్యధామం తిరుమల క్షేత్రం. కలియుగంలో భక్తులను రక్షించేందుకు వైకుంఠంను వదిలి భూలోకానికి వచ్చిన శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామి వారి క్షణకాల దర్శనం కోసం భక్తులు పరితపించి పోతుంటారు. స్వామి వారి దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే వేల కిలోమీటర్ల సైతం లెక్క చేయకుండా గోవిందుని నామస్మరణతో తిరుమలకు చేరుకుంటారు కొందరు భక్తులు.

 
ఇలా తమతో పాటు తెచ్చుకున్న ముడుపును భక్తిశ్రద్ధలతో స్వామి వారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాకుండా దేశ విదేశాల నుండి భక్తులు స్వామివారి చెంతకు చేరుకుని స్వామి దర్శనం భాగ్యం పొందుతుంటారు. ఇలా తిరుమలకు చేరుకున్న భక్తుల కోసం టిటిడి అనేక సౌకర్యాలు చేస్తుంది. కోవిడ్ మునుపు వరకు రోజు లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని పునీతులు అయ్యేవారు.

 
కోవిడ్ తర్వాత పరిమిత సంఖ్యలోనే స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తోంది టీటీడీ. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలోనే ఆన్లైన్లో సామాన్య భక్తుల కోసం సర్వదర్శనం టికెట్లు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది టిటిడి. దీనితో పాటుగా సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలు వివిధ ట్రస్టులకు విరాళాలు అందించిన దాతలకు కల్పించే బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రోటోకాల్ దర్శనం, ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన వివిధ సేవా టిక్కెట్ల ద్వారా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తూ వస్తోంది టిటిడి.

 
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కనులారా తరించాలని భక్తులు పరితపించి పోతుంటారు. ఇందు కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు సిఫార్సు లేఖలతో స్వామి వారిని అతి దగ్గరగా చూడాలని భక్తులు తాపత్రయపడతారు.. ఇలా సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి స్వామి వారి దర్శనం కోసం భక్తులను(ఆలయంలోని మొదటి గడప) కులశేఖరపడి వరకు అనుమతిస్తుంది టిటిడి.

 
అయితే తాము బ్రతికున్న జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామి వారిని అతి దగ్గరగా కనులారా వీక్షించాలని చాలామంది భక్తులు కోరిక. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సుల కోసం భారీగా ప్రయత్నాలు చేస్తుంటారు భక్తులు. దీంతో సిఫార్సు లేఖలకు భారీగా డిమాండ్ ఉండడంతో సిఫార్సు లేఖలు సామాన్య భక్తులకు లభించడం కష్టతరం.

 
దర్శన టికెట్ల కోసం దళారులకు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు భక్తులు సిద్ధపడతారు. దీనిని అవకాశంగా తీసుకునే కొందరు దళారులు భక్తులను నిలువు దోపిడీ చేసి మోసగిస్తూ ఉంటారు. కేవలం 500 రూపాయల ధర కలిగిన విఐపి బ్రేక్ దర్శనం ఒక్కో టికెట్ దళారులు 5,000 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకునేవారు. రోజు రోజుకి కొండపై దళారుల సంఖ్య పెరగడంతో పాటుగా, వారి ఆగడాలు ఎక్కువ అవుతున్న తరుణంలో టిటిడి అదనపు ఏవి.ధర్మారెడ్డి దళారుల ఏరివేతకు చర్యలు చేపట్టారు.

 
భక్తులను మోసగించే దళారులను కఠిన చర్యలు తీసుకుని కొండపై దళారుల వ్యవస్థను లేకుండా చేశారు. అయితే భక్తుల కోసం శ్రీవాణి ట్రస్టును ముందుకు తీసుకొచ్చారు. పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందించిన వారికి ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తూ వస్తుంది టిటిడి. అయితే మధ్యతరగతి భక్తులను దృష్టిలో తీసుకొన్న టీటీడీ.. సులభతరంగా మధ్యతరగతి భక్తులు విఐపి బ్రేక్ దర్శనం పొందే విధంగా శ్రీవాణి ట్రస్టులో, మిని శ్రీవాణి ట్రస్టు తీసుకొస్తుంది.

 
అయితే ఈ విషయంపై గత ఐదు నెలలుగా టీటీడీ ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నట్లు సమాచారం.. మినీ శ్రీవాణి ప్రవేశపెడితే మధ్యతరగతి భక్తులు సైతం నేరుగా స్వామి వారిని అతి దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది.. మిని శ్రీవాణి ట్రస్ట్ ధర నిర్ణయంపై టీటీడీ తర్జనభర్జన పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 3500 నుండి ఐదు వేల వరకు విరాళం ఇస్తే మినీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు విఐపి దర్శనం కల్పించనుంది.

 
ప్రస్తుతం శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళం అందించి ప్రోటోకాల్ దర్శనం పొందుతున్నారు భక్తులు. మినీ శ్రీవాణి కింద మధ్యతరగతి భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం కల్పించాలన్న టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి యోచన. ఈ నిర్ణయాన్ని భక్తులు సంతోషంగా స్వాగతిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మినీ శ్రీవాణి ట్రస్టును వ్యతిరేకించడంతో టిటిడి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి భక్తులు కొనగలిగే స్థాయిలో మినీ శ్రీవాణి టికెట్లు అందుబాటులోకి తీసుకు వస్తే ప్రతి ఒక్కరు శ్రీ వేంకటేశ్వరుని అతి దగ్గరగా దర్శించుకుని భాగ్యం లభించినట్లే... మిని శ్రీవాణి ట్రస్టును ఎప్పటికి‌ అందుబాటులోకి‌ తీసుకువస్తారో వేచి చూడాలి మరి.