జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌లోనే...
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార బలంతో పెట్రేగిపోయిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా, జగన్‌తో పాటు అధికారం అండ చూసుకుని ఇష్టానుసారంగా, అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఒక్కొక్కరుగా జైలులోకి వెళుతున్నారు. ఇలాంటి వారిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, రాజ్ కెసిరెడ్డి తదితరులు ఉన్నారు. వీరంతా విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌లో జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయ సిబ్బందిని కిడ్నాప్ చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కెసిరెడ్డి, ముంబై నటి కాందంబరి జైత్వానీని లైంగికంగా, శారీరకంగా వేధించిన కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ పోలీసులు అరెస్టు చేయగా, వీరందరినీ విజయవాడ జైలులోని ఒకే బ్యారక్‌లో వేర్వేరు గదుల్లో రిమాండ్‌లో ఉంచారు.
కాగా, విజయవాడ జైలులో మొత్తం మూడు బ్యారక్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటో నంబరు బ్యారక్‌లో 11 గదులు ఉండంగా, ప్రముఖులు, ప్రత్యేక కేసుల్లోని వారిని సాధారణంగా రెండు, మూడు నంబర్ బ్లాక్‌లలో ఉంచుతారు. అయితే, వల్లభనేని వంశీని ఒకటో నంబర్ బ్యారక్‌లోని ఒక సెల్‍లో ఉంచారు. తాజాగా జైలుకు వచ్చిన రాజ్ కెసిరెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా ఇదే బ్యారక్‌లోని వేర్వేరు సెల్స్‌కు కేటాయించినట్టు జైలు వర్గాల సమాచారం.
ఈ ముగ్గురు ప్రముఖులు ఒకే బ్యారక్‌లో ఉండటంతో జైలు అధికారులు కూడా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వారి కదలికలపై నిఘా వేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురు సెల్స్‌లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వేర్వేరు కేసుల్లో అరెస్టు అయిన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే బ్యారక్‌లో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.