విజయవాడకు వంగవీటి రంగా జిల్లాగా పేరు పెట్టాలి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదన పెట్టేసరికి, ఇపుడు దాని గురించి పెద్ద హాట్ టాపిక్ మొదలైంది. కొత్త జిల్లాలకు పేర్లు చాలా మంది సూచిస్తూ, ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నారు. కృష్ణా జిల్లాను రెండుగా చేస్తున్నారని తెలిసి, జిల్లా ప్రజలు కొందరు సంబరపడుతుండగా, కొందరు దానిని వ్యతిరేకిస్తున్నారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం ఇంకో జిల్లాగా విడిపోతోంది. దీనిలో మచిలీపట్టంకు కృష్ణా జిల్లాగా నామకరం చేస్తారని, విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ జిల్లాగా పేరు పెడతారని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది.
కానీ, విజయవాడకు ఎన్టీయార్ పేరు కన్నా... వేరే పేర్లు కూడా పరిశీలించాలని డిమాండులు వస్తున్నాయి. విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధ రంగా మిత్ర మండలి నాయకుడు చెన్నుపాటి శ్రీను డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పునర్విభజన చేస్తూ 26 జిల్లాలు చేస్తోంది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా నామకరణం చేసింది. కృష్ణా జిల్లాలో రెండో భాగానికి వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలని కోరుతున్నట్లు, చెన్నుపాటి చెప్పారు. ఇది రాధ రంగ మిత్ర మండలి కోరిక మాత్రమే కాదు, ప్రజల ఆకాంక్ష కూడా అని చెప్పుకొచ్చారు. రాధ రంగ మిత్ర మండలి తరపున ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు.
కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టిన విధంగా , కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని అన్నారు. తూర్పు, పశ్చిమ, ప్రకాశం జిల్లాలో కూడా ఆయా జిల్లాలకు రంగా పేరు పెట్టాలని కోరుతున్నారని, కానీ రంగా పుట్టి పెరిగిన జిల్లా కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరుతున్నామన్నారు.