గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 29 డిశెంబరు 2021 (11:30 IST)

వంగ‌వీటి రాధా భ‌ద్ర‌త‌పై అంద‌రి శ్ర‌ద్ధ! రెక్కీ కేసు ఎవ‌రి మెడ‌కు?

బెజ‌వాడ రాజ‌కీయాలు నిరంతరం సెగ‌లు పుట్టిస్తుంటాయి... వేర్వేరు పార్టీల్లో ఉన్న పాత మిత్రుల కలయిక బెజవాడ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలకు దారితీసినట్లయింది. దివంగత వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర మంత్రి కొడాలి నాని, టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కలుసుకోవడం ఒక హ‌ఠాత్ ప‌రిణామం. దీనికి తోడు తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా ఆరోపించడంతో హైడ్రామాకు తెరలేచింది. తన హత్యకు రెక్కీ జరిగిందని ఆరోపించిన రాధాకృష్ణ, రెక్కీ ఎవరు నిర్వహించారనే విషయాన్ని బయటపెట్టలేదు. 
 
 
తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లు బహిరంగ వేదికపై ఆరోపించిన రాధాకృష్ణ, రెక్కీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఒక అంశం. ఇక ఆయ‌న భ‌ద్ర‌త‌పై గ‌తంలోనూ చ‌ర్చ‌, ప్ర‌స్తావ‌న న‌డిచాయి. రెండు నెలల క్రితం ఖమ్మం జిల్లా కొత్తపాలెం గ్రామంలో జరిగిన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాధా మాట్లాడుతూ, "ఐకమత్యమే మన బలం, ఉన్నవాళ్లనైనా ఆవేశంతో కాక‌ ఆలోచనతో కాపాడుకోవాలి" అని పిలుపునిచ్చారు. నాడు చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగానే, తన హత్యకు కుట్ర జరుగుతోందని రంగా వర్ధంతి సందర్భంగా చేసిన తాజా ఆరోపణలున్నాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో జనాభా పరంగానే కాకుండా అతిపెద్ద ఓటుబ్యాంకుగా ఉన్న కాపు సామాజికవర్గానికి నాయకత్వం వహించేందుకు రాధాకృష్ణ సిద్ధమయ్యారని, ఆ వ్యూహంలో భాగంగానే సెంటిమెంటును తట్టిలేపేందుకు రెక్కీ అంశాన్ని సంధించారని చర్చ జరుగుతోంది.
 
 
బెజవాడ రాజకీయాల్లో వంగవీటి, దేవినేని ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలుగా పేరుబ‌డ్డాయి. వంగవీటి వారసుడి హత్యకు రెక్కీ జరిగిందనే ఆరోపణలు వెలువడటంతోనే, దేవినేని క్యాంపుపైకి అంద‌రి దృష్టి మళ్లింది. రాధా హత్యకు రెక్కీ ఆరోపణల నేపథ్యంలో, వైసీపీ నేత దేవినేని అవినాష్ లక్ష్యంగా టీడీపీ-జనసేన నేతలు తమ వ్యూహాలకు పదునుపెట్టారు. దేవినేని కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, వంగవీటి రాధాను హత్య కావించేందుకు రెక్కీ నిర్వహించినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. రెక్కీ వ్యవహారంలో సత్యాన్ని ఇరికించడం ద్వారా అవినాష్ ను ఇరుకునపెట్టాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. రెక్కీ ఆరోపణల మేరకు వెంకట సత్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తుండగా సత్యం అపస్మారకస్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చేరారనే ప్రచారంతో బెజవాడలో కలకలం రేగింది. కాపు సామాజికవర్గానికి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో తొలుత వైరల్ అయిన ఈ కథనాలు, మంగళవారం సాయంత్రానికి అన్ని గ్రూపుల్లోనూ విస్తృతంగా ప్రచారం కావడమే కాకుండా, వైసీపీ వ్యతిరేక మీడియాలోనూ ప్రసారమయ్యాయి.
 
 
అయితే త‌న తండ్రి, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ సోమవారం ఉదయం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నార‌ని, అనంత‌రం అనారోగ్యంతో ఆసుప‌త్రికి చేరార‌ని ఆయ‌న కుమారుడు వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం తన ఇంటికి వెళ్లిన సత్యం,  అనారోగ్య సమస్యలతో ఆంధ్రా హాస్పిటల్లో చేరార‌ని, మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వెంకట సత్యనారాయణ ఐసీయూలో చికిత్స పొందుతున్నార‌ని స్ప‌ష్ం చేశారు. చివ‌రికి ఈ రెక్కీ ఎపిసోడ్ ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటుందో అనే ఆందోళ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది.