శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 జులై 2019 (21:07 IST)

వరలక్ష్మీ వ్రతం గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9న జ‌రుగ‌నున్న వరలక్ష్మీ వ్రతం గోడ‌ప‌త్రిక‌ల‌ను శ‌నివారం టిటిడి తిరుప‌తి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో మాట్లాడుతూ... తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం జ‌రుగ‌నుంద‌ని తెలిపారు.

రూ.500 టికెట్ కొనుగోలు చేసి గృహ‌స్తులు(ఇద్ద‌రు) వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తంలో పాల్గొన‌వ‌చ్చ‌న్నారు. గృహ‌స్తులు సంప్ర‌దాయ వ‌స్త్రాలు ధ‌రించి పాల్గొనాల‌ని కోరారు. అదేరోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. వరలక్ష్మీ వ్రతం కారణంగా ఆగ‌స్టు 9న‌ ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలతోపాటు ఉద‌యం, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను రద్దు చేశామ‌ని, భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని జెఈవో కోరారు.

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్ల‌ను భ‌క్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా ఆగ‌స్టు 2న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. వ్ర‌తానికి ఒకరోజు ముందు ఆల‌యం వ‌ద్ద గ‌ల కౌంట‌ర్‌లో టికెట్లు విక్ర‌యిస్తారు. కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, సూప‌రింటెండెంట్ ఈశ్వ‌ర‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.