శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (14:54 IST)

ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అంబేద్క‌ర్ ని అవ‌మానించార‌ట‌... వీడియో సీడీ కూడా!

వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే జోగి రమేష్ భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని తేదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిజిపికి పిర్యాదు చేశారు. రాజ్యాంగం పై నేడు మన సమాజంలోని కొన్ని విభజన శక్తులు దాడి చేస్తున్నాయ‌ని వివ‌రించారు.

బాబా సాహెబ్ డా. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని షెడ్యూల్డ్ కులాలు, తెగల కోసం మాత్రమే రాసారని ఎమ్మెల్యే జోగి రమేష్ అంటున్నార‌ని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా జ‌త చేశారు. ఇలాంటి ప్రకటన భారత రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే కాకుండా డా. అంబేద్కర్‌పై దాడి చేయడం కూడా అని వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు.

ఈ వ్యాఖ్య ప్రత్యేకంగా షెడ్యూల్ కులాలను కించపరచడం, అవమానించడం తప్ప మరొకటి కాద‌న్నారు. వర్గ విద్వేషాన్నిరెచ్చగొట్టే ఇలాంటి ప్రకటన చట్టంలోని నిర్దిష్ట సెక్షన్ల కింద శిక్షార్హమైనద‌ని, భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికీ సంబంధించినద‌ని చెప్పారు. వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలు డాక్టర్ అంబేద్కర్ కు, భారత రాజ్యాంగానికి వర్గతత్వాన్ని ఆపాదిస్తూ చేశార‌ని, జోగి రమేష్ అహంకారపూరిత వ్యాఖ్యలు సెక్షన్ 2, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టూ నేషనల్ హానర్ యాక్ట్, 1971; సెక్షన్ 3, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీల నిరోధం చట్టం, 1989; SC మరియు ST ల పరువుకు భంగం కలుగజేసినందుకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500, వర్గ విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు సెక్షన్ 153A ఐ. పి.సి కింద శిక్షార్హమైనవ‌ని పేర్కొన్నారు.

చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం వెంటనే కేసు నమోదు చేసి జోగి రమేష్‌పై చర్యలు వెంటనే ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని వ‌ర్ల రామ‌య్య కోరారు.