శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 27 డిశెంబరు 2021 (17:26 IST)

విజయవాడ-గూడూరు ట్రిప్లింగ్ ... మూడో రైల్వే లైన్ ప్రారంభం

దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన విజయవాడ - గూడూరు గ్రాండ్‌ ట్రంక్‌ మార్గం దేశంలోని దక్షిణ ప్రాంతంతో ఉత్తర, తూర్పు ప్రాంతాలను అనుసంధానించే రైలు మార్గంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ నిరంతరం రైళ్ల రాకపోకలతో రద్దీ పెరగడంతో ఈ సెక్షనపై ఒత్తిడి పెరిగింది.  ప్రధానమైన ఈ రైల్వే లైన్‌లో రద్దీని నివారించడానికి ఈ మార్గంలో విద్యుదీకరణతో సహా మూడవ రైల్వే లైను పనులు న‌డుస్తున్నాయి. తలమంచి, వెంకటేశ్వరపాలెం మధ్య 24.8 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. 
 
 
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ`గూడూరు సెక్షన్‌లో ప్రయాణికుల సరుకు రవాణా రైళ్ల రాకపోకలు క్రమంగా పెరుగుతుండడంతో ఇక్కడ రద్దీ పెరిగింది. కీలకమైన ఈ సెక్షన్‌లో రద్దీని తగ్గించడానికి విజయవాడ - గూడూరు మధ్య 288 కి.మీల మేర రూ.3246 కోట్ల అంచనా వ్యయంతో మూడవ లైన్‌ ప్రాజెక్టు 2015`16 సంవత్సరంలో మంజూరైంది. ఈ పనులను ఆర్‌విఎన్‌ఎల్‌ వారిచే మూడు ప్యాకేజీలలో నిర్వహిస్తున్నారు. గూడురు -బిట్రగుంట మ‌ధ్య‌ 75 కి.మీలు, బిట్రగుంట-కరవది  89 కి.మీలు, కరవది`కృష్ణా కెనాల్‌ (విజయవాడ) `124 కి.మీలు. మొత్తం మూడు ప్యాకేజీలలోని పనులు ఏకకాలంలో సాగుతున్నాయి. 
 
 
రెండవ ప్యాకేజీలో ఉలవపాడు`కావలి సెక్షన్‌ మధ్య 30 కి.మీలు మేర పనులు మార్చి 2021లో  పూర్తయ్యాయి. ఇప్పుడు తలమంచి`బిట్రగుంట`వెంకటేశ్వరాపాలెం మధ్య 24.8 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. దీంతో కీలకమైన ఈ ప్రాజెక్టులో మొత్తం 54.8 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. 
 
 
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ట్రిప్లింగ్‌, విద్యుదీకరణ పనులను పూర్తి చేసిన విజయవాడ డివిజన్‌, ఆర్‌విఎన్‌ఎల్‌ సిబ్బందిని అభినందించారు. విజయవాడ ` గూడూరు ట్రిప్లింగ్‌ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ మార్గంలో రద్దీని అధిగమించవచ్చని, ఈ మార్గంలో మరిన్ని రైళ్ల రాకపోకలను కొనసాగించేందుకు మరింత వీలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రాండ్‌ ట్రంక్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు మూడవ రైల్వే లైన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చి పనులు చేపడుతున్నట్లు, అవి వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.