1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (13:48 IST)

ఆ తల్లి కన్నీళ్లు తుడిచేదెవరు? ఈ బిడ్డ సమస్య తీర్చేదెవరు?

విజయవాడ అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్ లోని ఆంధ్ర బ్యాంక్ సెంటర్లో అద్దెకు ఉంటున్న ఓ మాతృమూర్తి అర‌ణ్య రోద‌న ఇది. అచేతన స్థితిలో పడి ఉన్న తన బిడ్డను వదిలి రాలేక... మీడియా ద్వారా ఈ సమస్యను సీఎం జగన్ కి,  సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి తెలియజేయాల‌ని వేడుకుంటోంది ఆమె. నా బిడ్డ పరిస్థితి చూసి మమ్మల్ని అద్దె ఇంట్లో ఉండనివ్వటం లేదు. మాకు దయ చేసి సొంత ఇల్లు ఇప్పించండి సారూ...అని ఆమె ప‌డుతున్న ఆవేద‌న వ‌ర్ణానా తీతం.
 
23 సంవత్సరాలుగా ఆ బిడ్డ మంచానికే పరిమితం. వయసు ఎదిగింది కానీ దానికి తగినట్లుగా శరీరం ఎదగలేదు. మనసు ఎదగలేదు, ఏమి మాట్లాడ లేడు. శరీరాన్ని ఒక్క అంగుళం కూడా కదపలేడు. అన్ని మంచంలోనే.. కాళ్లు చేతులు పడిపోయిన ఆచేతన స్థితిలో పడి ఉన్న తన బిడ్డను సాక లేక, చంపుకోలేక ఆ తల్లి పడుతున్న వేదన వర్ణనాతీతం. బిడ్డను బతికించుకుందాం అని వారి స్థోమతకు మించి.. ఖర్చు పెట్టినా కూడా ఫలితం శూన్యం. ఆ బిడ్డకు వచ్చిన వ్యాధికి ఎప్పుడు ఏసీ లోనే ఉండాలి. ఒక్క 2 గంటలు కరెంటు పోతే, ఒళ్లంతా మంటలతో నరకయాతన అనుభవిస్తాడు. వారికి ఒక సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటూ, రోజంతా ఏసి వేసుకుంటే వచ్చే కరెంటు బిల్లు చూసి భయపడి ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు. 
 
మా బిడ్డకు వైద్యానికి డబ్బులు అడగటం లేదు.. నాయకులు దయ చూపించి మాకు ఒక సొంత ఇల్లు ఇప్పించమని వేడుకుంటున్నాం అంటున్నారు ఆ మాతృమూర్తి. విజయవాడ అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్ లోని ఆంధ్ర బ్యాంక్ సెంటర్లో అద్దెకు ఉంటున్న దాసరి శ్రీనివాస రావు,సుహాసిని దంపతులకు ఇద్దరు పిల్లలు.పెద్ద బాబుకు పుట్టిన కొద్ది రోజులకే కామోర్లు వ్యాధి సోకడంతో ఆ బాబు గత 23 సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయ్యాడు. శ్రీనివాసరావు బట్టల షాపులో గుమ్మస్తాగా జీవనం కోనసాగిస్తూ, అద్దె ఇంటిలో ఉంటూ అటు అద్దె కట్టలేక, ఇటు పిల్ల‌వాడికి మందులు తీసుకోవడానికి అనేక భాధలు పడుతున్నారు.మంచానికే పరిమితం అయిన పిల్లవాడికి కృష్ణా జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ వారి చొరవతో పెన్షన్ రావడంతో కొంత ఊరట నిచ్చింది. వారి కుమారునికి ఉన్న వ్యాధిని బట్టి ఎవరు కూడా అద్దె ఇంట్లో ఎక్కువ రోజులు ఉండనివ్వటం లేదు. ఇప్పటి వరకు 30 ఇల్లు మారారంటే,    వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం అవుతుంది.  నాయకులు స్పందించి ప్రభుత్వం ద్వారా కట్టించిన ఇల్లు ఇప్పించమంటూ వేడుకుంటున్న ఆ తల్లి కన్నీళ్లు తుడిచే వారు ఎవరు?.
 
విశాఖపట్నంలో రోడ్డుమీద సీఎం కాన్వాయ్ దూసుకుపోతుంటే, తమ స్నేహితుడి సహాయం కోసం హెల్ప్ అని బోర్డు పట్టుకుని నిలబడిన స్టూడెంట్స్ ని చూసి, సీఎం జగన్ కాన్వాయ్ ఆపి, వారి సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడే వారికి సహాయం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ సమస్య సీఎం జగన్ కి కానీ, సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కానీ తెలియ‌జేస్తే, పరిష్కారం అవుతుంద‌ని పేర్కొంటున్నారు.