శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (09:01 IST)

స్వర్ణప్యాలెస్ ఘటనలో రమేశ్ బాబు ఒక్కడిదే తప్పా?: టీడీపీ

గుణం లేనివాడు కులం గురించి ఆలోచిస్తాడని, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడన్న గుర్రం జాషువా వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి అతికినట్లుగా సరిపోతాయని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. 

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.  స్వర్ణప్యాలెస్ ఘటనకు డాక్టర్ రమేశ్ ఒక్కడినే బాధ్యుడిని చేసి, ఆయన్ని వేటాడటం ప్రభుత్వానికి తగదని, స్వర్ణప్యాలెస్ హోటల్ ను, రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ ఆసుపత్రిగా తీసుకుందని, అంతకు ముందు అది క్వారంటైన్ కేంద్రంగా ఉందన్నారు.

విజయవాడ విమానాశ్రయంలో దిగిన వారందరినీ 14రోజుల క్వారంటైన్లో ఉంచడం కోసం, ప్రభుత్వం నగరంలోని 15 హోటళ్లను ఎంపిక చేసిందని, వాటిలో స్వర్ణ ప్యాలెస్ ఒకటని రామయ్య తెలిపారు.  హోటళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చినప్పుడు, ఆనాడు వాటన్నింటిలో  ఫైర్, ఇతర వసతులున్నాయో లేదో ప్రభుత్వం ఎందుకు పరిశీలించలేదన్నారు.

ఆనాడు అవిఅన్నీ లేనప్పుడు జిల్లా యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు? ఇప్పుడు జరిగిన దురదృష్టకర సంఘటన ఆనాడే జరిగుంటే, ప్రభుత్వం ఏం చేసేదని, తమ వైఫల్యాన్ని ఎవరిపై మోపేదని వర్ల నిలదీశారు. ఆప్రాణాలకు విలువ తక్కువ, ఇప్పుడు పోయిన ప్రాణాలు విలువైనవి, అవన్నీ  రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోందా అని రామయ్య మండిపడ్డారు.

విజయవాడలో దాదాపు 15 హోటళ్లను గుర్తించి, ఎయిర్ పోర్ట్  అథారిటీకి లేఖ ఇచ్చారని, విదేశాల నుంచి వచ్చే వారందరూ వాటిలో దిగి, 14రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని నెగటివ్ వచ్చాకే వెళ్లాలని చెప్పింది నిజం కాదా అని వర్ల ప్రశ్నించారు.

అన్ని పరిశీలించాకే ఆనాడు స్వర్ణప్యాలెస్ కు, మిగిలిన హోటళ్లకు అనుమతులు ఇచ్చారోలేదో అధికారులు, జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు అన్ని హోటళ్లలో అన్ని సౌకర్యాలు, వసతులున్నాయని, ఒక్క స్వర్ణ ప్యాలెస్ లోనే ఏవీ లేవని నిర్ధారించారా అని వర్ల నిగ్గదీశారు. జరిగిన ఘటనలో అధికారులను వదిలేసిన ప్రభుత్వం, రమేశ్ బాబు అలియాస్ రమేశ్ చౌదరినే అరెస్ట్ చేయడానికి ఉబలాటపడుతోందన్నారు.

చౌదరి అనే పదంపై ప్రభుత్వానికి అంతటి ఉబలాటం, అంతటి ఉక్రోషం, ఆవేశం ఎందుకో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు. స్వర్ణప్యాలెస్ లో లేనివి రాష్ట్రంలోని మిగతా హోటళ్లన్నింటిలో ఉన్నాయా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గొప్ప హృద్రోగ నిపుణిడిగా పేరు ప్రఖ్యాతులు పొంది, వేలాదిమందిని రక్షించిన డాక్టర్ రమేశ్ బాబు గురించి రాష్ట్రమంతా తెలుసునని, ఈ ప్రభుత్వం మాత్రం అతనిగొప్పతనాన్ని చూడకుండా, అతనికులాన్ని మాత్రమే చూసి, అతని వెంటపడుతోందన్నారు. దేశప్రథమపౌరుడు అతని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారన్నారు.

విజయవాడలో జరిగిన ప్రమాదంలో రమేశ్ బాబు, సదరు ఆసుపత్రి ప్రమేయం ఎంతుందో, మిగిలిన అధికారుల, ప్రభుత్వపాత్ర ఏమిటో విచారించకుండా, నిజానిజాలు తేల్చకుండా, ఒక వ్యక్తినే లక్ష్యంగా చేసుకోవడం ఏమిటని నిలదీశారు.