శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 ఆగస్టు 2022 (22:26 IST)

అర్హులైన ప్రతి ఒక్కరికీ నేతన్ననేస్తం: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్

Thalashila Raghuram
ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ నేతన్ననేస్తం పధకాన్ని వర్తింపచేస్తుందని శాసన పరిషత్తు సభ్యుడు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ అన్నారు. ఆదివారం విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన తలశిల మాట్లాడుతూ చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగం అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తుందని, దేశంలోని మొత్తం వస్త్ర ఉత్పత్తిలో 19శాతం చేనేత రంగం ద్వారా ఉత్పత్తి జరుగుతుందన్నారు.

 
కేవలం తమ ఉనికి కోసమే ప్రతిపక్షాలు ప్రభుత్వ పధకాలపై అసత్య ప్రచారం చేస్తున్నాయని తలశిల విమర్శించారు. విజయవాడ మధ్య శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ  స్వతంత్ర సమరంలో చేనేత ప్రముఖ పాత్ర పోషించిందని, 2015 సంవత్సరము నుండి భారత ప్రభుత్వం గ్రామీణ ఉపాధికి తోడ్పడుతున్న చేనేతరంగాన్ని గుర్తించి ఆగష్టు7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తుందన్నారు. భారత దేశ వారసత్వ సంపదగా ఉన్న చేనేత రంగంపై అవగాహన కల్పించి, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంపొందించటమే ధ్యేయంగా జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.

 
విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 1,28,662 మంది చేనేత కార్మికులుగా, మరో 49,785 మంది అనుబంధ కార్యకలాపాలలో ఉపాధి పొందుతున్నారన్నారు. నేతన్నలు తయారుచేసిన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఆప్కో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. చేనేత కార్మికుల ఆర్ధిక పరిస్థితులను దృష్ట్యా వారికి నిరంతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24000 రూపాయలు నేతన్న నేస్తం పథకం ద్వారా విడుదల చేస్తున్నారన్నారు.

 
ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు మాట్లాడుతూ చేనేత వస్త్రాలు అందరికి అందుబాటులో ఉండాలన్న ధ్యేయంతో ఈ కామర్స్ దిగ్గజాలైన అమేజాన్, ప్లిప్ కార్ట్, మింత్రా తదితర ఆన్ లైన్ విక్రయ సంస్ధలతో ఒప్పందం చేసుకుని, ప్రపంచ వ్యాప్తంగా ఆప్కో చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు పోటీగా విజయవాడ, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, కడప పట్టణాలలో మెగా షోరూమ్ లు, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలలో నూతన హంగులతో షోరూంలను ప్రారంభించామన్నారు. మరోవైపు హైదరాబాద్ మెహిదీపట్నంలో సైతం ఆప్కో నూతన మెగా షోరూంను ప్రారంభించామన్నారు. 

 
యువతను చేనేత వస్త్రాలవైపు ఆకర్షింపచేసేలా ఉత్పత్తులలో నూతన ఒరవడి సృష్టించి, మార్కెట్లో ఆప్కో బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే క్రమంలో సరికొత్త డిజైన్ల తయారీకి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజి, నేషనల్ డిజైన్ సంస్థల సహకారం తీసుకుంటున్నామని చిల్లపల్లి వివరించారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో 100 కోట్ల వ్యాపారం చేయాలనే లక్ష్యంతో ఆప్కో కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తుందన్నారు. వీవర్స్ సర్వీస్ సెంటర్ ఆఫీసర్ ఇన్ చార్జి పిఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ చేనేత వస్త్రాలు పర్యావరణ నేస్తాలని, హుందాతనాని ప్రతిరూపంలో నిలిచే వీటిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు.

 
జాతీయ చేతి వృత్తుల అభివృద్ది సంస్ధ రీజనల్ మేనేజర్ సకోడియా మాట్లాడుతూ వారానికి ఒక్కసారి తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించటం ద్వారా కార్మికులకు నిరంతరం పనికల్పించగలుగుతామన్నారు. చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు మైసూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పురాతన సాంప్రదాయ చేనేత కళను కాపాడుకోవలసిన బాధ్యత యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్కెటింగ్ అధికారి లేళ్ల రమేష్ బాబు, ప్రాంతీయ మార్కెటింగ్ అధికారి బివి రమణ పాల్గొన్నారు. ధర్మవరంకు చెందిన చేనేత డిజైనర్ నాగరాజును ఈ సందర్భంగా సత్కరించారు.