సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (13:06 IST)

నా తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర : చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్

nara lokesh
తన తండ్రి చంద్రబాబు నాయుడుకు స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర పన్నారని, అందువల్ల ఆయన ఆరోగ్యంపై తనకు ఆందోళనగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో ఉన్న తన తండ్రి ప్రాణాలకు తక్షణ ముప్పు పొంచివుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే సైకో జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. డీ హైడ్రేషన్‌తో పాటు అలెర్జీకి కూడా గురయ్యారు. దీంతో తమ పార్టీ అధినేత ఆరోగ్యంపై టీడీపీ నేతలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు ఆందోళన వ్యక్తం చేయగా, తాజాగా కుమారుడు లోకేశ్ కూడా ఆందోళన చెందుతూ ట్విట్టర్ వేదికగా ఆవేదన పంచుకున్నారు. 
 
చంద్రబాబు భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆయనకు హాని తలపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తక్షణ ముప్పు పొంచివుందన్నారు. జైలు గదిలో దోమలు, కలుషిత నీరు ఉన్నాయన్నారు. బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలతో ఆయన బాధపడుతున్నారన్నారు. సకాలంలో వైద్యసాయం కూడా అందడం లేదని ఆయన పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, అధికార యంత్రాంగం ఏం దాచేందుకు ప్రయత్నిస్తుందని లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే అందుకు సైకో జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.