శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (07:59 IST)

కోత భయమే వైకాపా ఫ్యాను ప్రభంజనానికి కారణమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార వైకాపా విజయభేరీ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలికి సుడిగాలిలా వీచింది. దీంతో పోటీ చేసిన అన్ని చోట్లా విజయదుందుభి మోగించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అదేసమయంలో ఈ ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి షాక్‌ కలిగించాయి. ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ పార్టీ నేతలు మౌనందాల్చారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. 
 
ఈ ఎన్నికల్లో అధికార పక్షం ఇంత స్థాయిలో స్వీప్‌ చేస్తుందని టీడీపీ నేతలు ముందుగా ఊహించలేదు. అధికార పక్షానికి కొంత పైచేయి ఉంటుందని అనుకొన్నా, మరీ ఇంతగా వెనుకబడి పోతామని అనుకోలేదని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సంక్షేమ పథకాల్లో కోత పడుతుందని లబ్ధిదారుల్లో నెలకొన్న భయమే ఈ ఎన్నికలను అమితంగా ప్రభావితం చేసిందని, అందువల్లే రాష్ట్రం అంతటా ఏకపక్షంగా అధికారపక్షానికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 
 
‘‘గ్రామాల్లో వర్గ రాజకీయాల వల్ల ఈ భయాన్ని అధిగమించి కొంత నిలబడగలిగాం. అందువల్లే పంచాయతీ ఎన్నికల్లో మరీ ఇంత ఏకపక్షం లేదు. పట్టణాలు, నగరాల్లో గ్రామాల మాదిరిగా వర్గాల పట్టు, ప్రభావం ఉండవు. ఎక్కువ భాగం పేద వర్గాలు ఉంటాయి. తమకు ఓటు వేయకపోతే పథకాలు అందబోవని, వాటిని కోత కోస్తామని వలంటీర్ల ద్వారా అధికారపక్షం ప్రచారం చేయించింది. ఇదే ప్రభుత్వం ఇంకా మూడేళ్లు అధికారంలో ఉండనున్న దరిమిలా ఎందుకొచ్చిన తలనొప్పని లబ్ధిదారులు వారివైపు మొగ్గారు. రాష్ట్రం అంతటా ఇదే అభిప్రాయం ప్రబలింది. అందుకే వైసీపీకి ఏకపక్ష విజయం లభించింది’’ అని ఒక సీనియర్‌ ఎమ్మెల్యే పేర్కొన్నారు.