శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (20:11 IST)

అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధనకు కృషి చేస్తా: ఆదిత్యానాధ్ దాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాకు సిఎస్ కార్యాలయంలో నీలం సాహ్నినుండి ఆయన సిఎస్ గా బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటి వరకూ సిఎస్ గా పనిచేసిన నీలం సాహ్ని గురువారం పదవీ విరమణ పొందారు.కాగా నీలం సాహ్ని సియం ప్రిన్సిపల్ అడ్వయిజర్ గా ఇప్పటికే నియమితులు కాగా ఆమె త్వరలో ఆబాధ్యతలు చేపట్టనున్నారు.సిఎస్ గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యానాధ్ దాస్ అంతర రాష్ట్ర బదిలీలకు సంబంధించిన దస్త్రంపై తన తొలి సంతకాన్ని చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముందు కృతజ్ణతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా తన వంతు ప్రయత్నం చేస్తానని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత కష్టించి పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మెరుగైన రీతిలో అభివృద్ధి సాధించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

తనతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాధిపతులు సమన్వయంతో మెరుగైన రీతిలో పనిచేసి నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేసేలా ప్రయత్నం చేస్తానని సిఎస్ ఆదిత్యానాధ్ పేర్కొన్నారు.

అంతకు ముందు సిఎస్ గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యానాధ్ దాస్ కు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్,సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశి భుషణ్ కుమార్,టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి యంటి కృష్ణబాబు,ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,మరో ముఖ్య కార్యదర్శి ఉదయ లక్ష్మి,సమాచారశాఖ కమీషనర్ మరియు ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి టి.విజయ కుమార్ రెడ్డి,ముఖేష్ కుమార్ మీనా,ప్రవీణ్ కుమార్,స్టాఫ్ ఆఫీసర్ టు సిఎస్ విజయకృష్టణ్,ఇంకా పలువురు ఉన్నతాధికారులు సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు పూలగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.