గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (13:26 IST)

సీఎం గారూ.. మా గోడు వినండి... లేకుంటే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు గురువారం చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయంతమైందని చెప్పొచ్చు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు తీసుకున్న అనేక చర్యలు, విధించిన ఆంక్షలను ఛేదించుకుంటూ వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ ఛలో విజయవాడ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో విజయవాడ నగరం జన సందోహంగా మారిపోయింది. మా గోడు వినండి ముఖ్యమంత్రి గారూ అంటూ వారు నినాదాలు చేశారు. 
 
ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక కూడా చేశారు. పిల్లలకు పాఠాలే కాదు.. ప్రభుత్వానికి గుణపాఠం కూడా చెపుతామంటూ హెచ్చరించారు. ఏపీ ఎన్జీవో భవన్ నుంచి వేలాది మంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డు వైపు కదం తొక్కారు. న్యాయబద్ధమైన తమ హక్కులను కాలరాయొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకోలేక చేతులెత్తేశారు. 
 
అదేసమయంలో ప్రభుత్వ తీరును మహిళా ఉద్యోగుల సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు. సలహాదారుల మాట వినకుండా, తమ గోడు వినాలని వారు పాటల రూపంలో ముఖ్యమంత్రికి విన్నవించారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని వారు తేల్చి చెప్పారు. పిల్లలకు పాఠాలు చెబుతాం.. ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్రవాదుల కంటే దారుణంగా ఉందని వారు అక్రోషించారు.