బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (14:10 IST)

న్యాయం కోసం పోరాడుతున్నాం.. షర్మిలను గెలిపించండి : సునీత

sunitha
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని వారిని దోషులుగా నిలబెట్టాలని, మా తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా తెలిపారు. పైగా, కడప లోక్‌సభ బరిలో నిలిచిన వైఎస్ షర్మిలను గెలిపించాలని ఆమె కడప జిల్లా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆమె స్పందించారు. దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. 'న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైకాపా అడ్డుపడుతోంది. పులివెందులలో నేను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారు. వివేకా హత్య అంశంపై వైకాపా నేతలు చాలాసార్లు మాట్లాడారు. మీ ఇళ్ల వద్దకు నేను రాలేకపోతే మన్నించండి. ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యత ప్రజలదే' అని ఆమె పేర్కొన్నారు. 
 
వివేకా హత్యకేసు అంశంపై వైఎస్‌ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, పురంధేశ్వరి, పవన్‌ కల్యాణ్‌, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైఎస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కడప కోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రతివాదులు, వారి అనుచరులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఈ కేసులో అవినాష్‌రెడ్డిని హంతకుడిగానూ, సీఎం జగన్‌ ఆయన్ను కాపాడుతున్నట్లుగానూ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఇలా వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేవి, వ్యాఖ్యలు చేయరాదని కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.