వైసీపీ ఎమ్మెల్యే ఆస్తులు వేలం వేయనున్న కెనరా బ్యాంకు.. ఎందుకో తెలుసా?
రుణాల ఎగవేత వ్యవహారంలో శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గ శాసన సభ్యుడు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను కెనరా బ్యాంకు వేలం వేయనుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. మెసర్స్ సాయిసుధీర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. వాటిని సకాలంలో చెల్లించలేదు.
అయితే ఆ కంపెనీకి శాసన సభ్యుడు శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీతో పాటు హామీదారైన శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18వ తేదీన వేలం వేస్తున్నట్టు ఆ బ్యాంకు ప్రకటించింది.
కాగా ఆ కంపెనీ తీసుకున్న లోన్ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.908 కోట్లు అయ్యాయి. వాటిని చెల్లించకపోవడంతో ఆ కంపెనీ, అలాగే హామీదారు ఆస్తులను వేలం వేయాల్సి వస్తోందని కెనరా బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది.