శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 20 జులై 2020 (21:17 IST)

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనవచ్చు, ఎలా సాధ్యం?

సిరుల తల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం ఏకాంతంగా నిర్వహించనుంది టిటిడి. ఈ విషయాన్ని స్వయంగా టిటిడి జెఈఓ వెల్లడించారు. దీనిపై ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
అయితే ప్రతి యేడాది పవిత్రమైన శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని భక్తుల కోరిక మేరకు ఆన్ లైన్ లో చేయాలని టిటిడి నిర్ణయించింది. గత ధర్మకర్తలి మండలి సమావేశంలో వీలైనన్ని ఆర్జిత సేవలను ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం మేరకు వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు జెఈఓ తెలిపారు.
 
ఇందులో భాగంగా దేశ విదేశాలలోని భక్తులు అమ్మవారి ఆలయంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని తమ తమ నివాస ప్రాంతాల నుంచి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి పాల్గొనే అవకాశం టిటిడి కల్పిస్తోందన్నారు. వరలక్ష్మీ వ్రతం టిక్కెట్లు జూలై 22వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి జూలై 30వతేదీ సాయంత్రం 5గంటల వరకు గృహస్తులు టిటిడి వెబ్ సైట్ ద్వారా పొందవచ్చునన్నారు. 
 
టిక్కెట్లు కావాల్సిన వారు టిటిడి వెబ్ సైట్ ద్వారా పొందవచ్చునన్నారు. టిటిడి వెబ్ సైట్ లో తమ వివరాలు పొందుపర్చి టిటిడి నియమ నిబంధనలకు లోబడి గేట్ వే ద్వారా వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్ లైన్ రసీదు పొందవచ్చునన్నారు. ఇందులో గృహస్తులకు ప్రసాదాలు అందించేందుకు పోస్టల్ సేవలు కలిపి రుసుం నిర్ణయించడం జరిగిందన్నారు.
 
వరలక్ష్మీ వ్రతం వ్రతంగా పూర్తిగా ఆన్ లైన్ (వర్చువల్) సేవ అయినందున ఈ వ్రతం కొరకు పేర్లు నమోదుచేసుకుని టిక్కెట్లు పొందిన భక్తులకు తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ప్రత్యక్షంగా వ్రతంలో పాల్గొనే అవకాశం లేదని తెలిపారు. విదేశాలలోఉన్న భక్తులు ఆన్ లైన్ టిక్కెట్లు పొంది ఆన్ లైన్ ద్వారా ఈ వ్రతంలో పాల్గొనవచ్చని చెప్పారు. అలాంటి వారికి ప్రసాదాలు పంపడం సాధ్యం కాదని తెలిపారు.