గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (14:19 IST)

మైక్రోసాఫ్ట్‌లో 10,000 ఉద్యోగాల కోత, ఈ ప్రభావం ఇతర టాప్ టెక్ కంపెనీల మీద ఉంటుందా?

microsoft
మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా 10,000 ఉద్యోగాల కోత ప్రకటించింది. ఈ తాజా నిర్ణయం మొత్తంగా టెక్ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిపై ఈ కోత ప్రభావం ఉంటుంది. ఉద్యోగుల తొలగింపు, పునర్వ్యవస్థీకరణల కోసం ఈసంస్థ 120 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టనుంది.
 
కరోనా సమయంలో వినియోగదారుల ఖర్చులు బాగా పెరిగాయని, అయితే ప్రజలు కొనుగోళ్ళ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల అన్నారు. అయితే, కీలక రంగాల్లో మాత్రం ఉద్యోగ నియామకాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఉద్యోగాల కోత గురించి సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించిన సత్య నాదెళ్ల, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు ప్రస్తుతం మాంద్యంలో లేదా మాంద్యం అంచున ఉన్నాయన్నారు. ఇదే సమయంలో, ఏఐ వృద్ధి చెందడంతో కొత్త తరం కంప్యూటింగ్ వ్యవస్థలు వేగంగా ముందుకు వస్తున్నాయని నాదెళ్ళ వివరించారు.
 
చాట్‌జీపీటీ(జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్)ని అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఓపెన్ఏఐలో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోందని ఫైనాన్సియల్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. 2023 ప్రారంభంలోనే వేలాది మంది ఉద్యోగులు కంపెనీ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. టెక్ రంగంలోని అమెజాన్, ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ సంస్థ మెటా వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇటీవలే లేఆఫ్స్‌ను ప్రకటించాయి.
 
ఈ ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ 18 వేలకు పైగా ఉద్యోగాలను తీసేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితికర పరిస్థితులు, కరోనా సమయంలో పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాలతో తాజాగా ఈ ఉద్యోగాల కోతను చేపడుతున్నట్లు అమెజాన్ తెలిపింది. మెటా కంపెనీ కూడా నవంబర్‌లో తన ఉద్యోగుల్లో 13 శాతం మంది అంటే మొత్తంగా 11 వేల మంది ఉద్యోగులను తీసేయనున్నట్టు తెలిపింది. కంపెనీల్లో ఉద్యోగాల కోతను అనాలసిస్ చేసిన కన్సల్టెంట్స్ గార్ట్నర్ టెక్ ఇండస్ట్రీ నిపుణుడు జాన్సన్ వాంగ్, పూర్తిగా అడ్వర్‌టైజింగ్‌ రెవెన్యూలపై ఆధారపడ్డ ట్విటర్ కంపెనీ దాని నుంచి బయటికి వచ్చేస్తోందని అన్నారు. అలాగే, ఫేస్‌బుక్ సంస్థ మెటావర్స్‌లో మునిగి తేలుతుందన్నారు.
 
కరోనా సమయంలో పుంజుకున్న వ్యాపారాలు
ఇతర టెక్ సంస్థల మాదిరిగానే మైక్రోసాఫ్ట్ వ్యాపారాలు కూడా మహమ్మారి సమయంలో పుంజుకున్నాయి. రిమోట్ వర్క్ పెరగడం, ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాలు ఈ కంపెనీ వృద్ధికి సహకరించాయి. జూన్ 2021 నుంచి జూన్ 2022 మధ్య కాలంలో ఈ కంపెనీ 40 వేల మంది ఉద్యోగులను పెంచుకుంది. దీంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,21,000కి చేరుకున్నట్లు ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ తెలిపింది. వారిలో 99 వేల మంది అమెరికా వెలుపల పని చేస్తున్నారని చెప్పింది.
 
గత ఏడాది నుంచి కంపెనీకి వ్యాపారాలు నెమ్మదించాయి.  దీంతో, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగాల కోతలు ప్రకటిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం ముగిసేనాటికల్లా 10 వేల మంది ఉద్యోగులను తీసేస్తామని తెలిపింది. కొందరు ఉద్యోగులకు ఈ లేఆఫ్ వెంటనే వర్తిస్తుందని మెమోలో పేర్కొంది. ‘‘మేము మా ఉద్యోగులకు గౌరవ మర్యాదలు ఇస్తాం. పారదర్శకంగా వ్యవహరిస్తాం’’ అని నాదెళ్ల హామీ ఇచ్చారు. కేవలం 2022 ఆర్థిక సంవత్సరంలోనే 1000కి పైగా టెక్ సంస్థలు 1,54,336 మంది ఉద్యోగులను తీసేసినట్టు లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ చెప్పింది. ఇది కంపెనీలు చేపట్టే లేఆఫ్స్‌ను పరిశీలిస్తుంది.
 
కొత్త ఏడాది ప్రారంభమైన తర్వాత మైక్రోసాఫ్ట్ ప్రకటనతో, మొత్తంగా టెక్ రంగంలో పనిచేసే 26,061 మందికి ఉద్యోగాలు పోయాయి. సరైన నైపుణ్యాలు కలిగిన ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెప్పారు. ముఖ్యంగా ఏఐ, డేటా సైన్స్‌లో నిపుణులైన ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ ఉద్యోగాల కోతతో ప్రభావితమైన ఉద్యోగులు, ఇప్పటికే లేఆఫ్స్ ప్రకటించిన మెటా, అమెజాన్, సేల్స్‌ఫోర్స్ వంటి ఇతర ప్రత్యామ్నాయ సంస్థలలో ఉద్యోగాలు  పొందేందుకు కూడా కష్టమవుతుందని లా సంస్థ ఫ్రీత్స్ ఎంప్లాయిమెంట్ లాయర్ కెవిన్ పౌల్టర్ చెప్పారు.
 
విశ్లేషణ:
జోయ్ క్లైన్‌మాన్, బీబీసీ టెక్నాలజీ ఎడిటర్
 
మైక్రోసాఫ్ట్ తాజాగా ఈ ఉద్యోగాల కోత ప్రభావం ఇతర పెద్ద టెక్ కంపెనీల మీద కూడా పడే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి సమయంలో టెక్ పరిశ్రమ బాగా పుంజుకున్న తర్వాత, ప్రస్తుతం కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. దీంతో ప్రజలు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, డివైజ్‌లపై ఎక్కువగా ఖర్చు చేశారు. ఇది టెక్నాలజీ కంపెనీలకు కలిసి వచ్చేలా చేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ చాట్‌జీపీటీ తయారీ కంపెనీలో 1,000 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఈ చాట్‌బోట్‌‌ను ప్రయత్నించి ఇప్పటికే లక్షలాది మంది దానికి ఆకర్షితులయ్యారు. అంతేకాదు, ఇది భవిష్యత్‌ సెర్చ్‌గా మారుతుందని కూడా కొందరు నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌కు ఇప్పటికే బింగ్ అనే సెర్చింజన్ ఉంది. మరోవైపు గేమ్స్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజ్జార్డ్‌ను కొనుగోలు చేసేందుకు కూడా మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పెద్ద పెద్ద గేమింగ్ టైటిల్స్ అన్నింటిని ఒక కొత్త పోర్టుఫోలియోగా ఏర్పాటు  చేసి, వాటిని ఒక గొడుగు కిందకి తీసుకురాబోతోంది.