బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (13:53 IST)

అబార్షన్: బొప్పాయి పండుతో గర్భస్రావం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు...

జర్మనీలో గత కొన్నేళ్లుగా గర్భస్రావం చేసే వైద్య నిపుణుల సంఖ్య తగ్గుతోంది. దీంతో కొత్తగా చాలామంది విద్యార్థులు, యువ వైద్యులు ఈ పని నేర్చుకుంటున్నారు. జెస్సికా బేట్మన్ అలాంటివారిని కలిసి మాట్లాడుతున్నారు. థెరెసా బౌవెర్ ఆమె స్నేహితురాలితో కలిసి అబార్షన్ కోసం ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్‌కి వెళ్లారు. డాక్టర్ ఆమెను.. "ఏం చదువుతున్నావు" అని అడిగారు. "కల్చరల్ స్టడీస్" అని ఆమె బదులిచ్చారు.

 
"మొత్తానికి కలర్‌ఫుల్‌గా జీవిస్తున్నావన్నమాట" అని డాక్టర్ సెటైర్ వేశారు. థెరెసా కోపాన్ని కనిపించనీయకుండా మౌనంగా కూర్చున్నారు. అనుకోకుండా గర్భం దాల్చడంతో థెరెసా బౌవెర్ అబార్షన్ కోసం క్లినిక్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇది ఆమె ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు. జర్మనీలో చాలామందికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది.

 
అబార్షన్‌కు ముందు ఆమె కౌన్సెలింగ్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి. 'గర్భస్థ శిశువు సంరక్షణ' కోసం జర్మన్ చట్టాలు ఈ ఏర్పాటు చేశాయి. మహిళలు అబార్షన్ చేయించుకోకుండా ఆపడానికి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇలాంటి సేవలు అందించి కొన్ని క్లినిక్‌లలో ఈ పనిని చర్చి పెద్దలు నిర్వహిస్తుంటారు. వారు తమతో ఏకపక్షంగా వ్యవహరిస్తారని థోరెసా బౌవెర్ ఆ ప్రక్రియను జాగ్రత్తగా దాటవేశారు.

 
వైద్యపరంగా అబార్షన్ చేయగలిగే డాక్టర్ కోసం ఆమె వెతుక్కోవాల్సి వచ్చింది. జర్మనీలో డాక్లర్లు అబార్షన్లు చేస్తామని బహిరంగంగా చెప్పుకోవడానికి చట్టం గత ఏడాది నుంచి అవకాశం ఇచ్చింది. కానీ, వారందించే సేవలను మాత్రం బయటకు చెప్పడానికి వీలు లేదు. బెర్లిన్‌లో అయితే స్వేచ్ఛగా చేయించుకోవచ్చని థెరెసా భావించారు.

 
"మేం అబార్షన్ పిల్ తీసుకోవడానికి వెళ్లిన తరువాత కూడా డాక్టర్ దగ్గర ఉండే సహాయకులు పదేపదే నా నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఇదే మీ తుది నిర్ణయమా అని అని అడగటం మొదలు పెట్టారు." ఇదంతా చూసిన తరువాత దీనిపై ఏదైనా చేయాలనేంత కోపం వచ్చింది, అని థెరెసా స్నేహితురాలు చెప్పారు. థెరెసా అప్పటికే మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె యూనివర్సిటీ విద్యార్థులు నడుపుతున్న ‘ఛాయిస్ బెర్లిన్’ గ్రూపులో స్వచ్చందంగా సేవలు అందించాలని అనుకుంటున్నట్లు ఒక ఈ- మెయిల్ పంపించారు.

 
ఆమె ఇప్పుడు వైద్య విద్యార్థులకు అబార్షన్ ప్రక్రియ గురించి శిక్షణ ఇచ్చేందుకు, అబార్షన్ చేయించుకోవడంలో ఎదురయ్యే అవాంతరాల గురించి అవగాహన కలిపించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జర్మనీ స్వేచ్ఛా దేశమే అయినప్పటికీ, ఆ దేశంలో పునరుత్పత్తికి సంబంధించిన చట్టాలు మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఆ దేశంలో గర్భస్రావం చేయించుకోవడం పూర్తిగా చట్టబద్ధం కాదు. మినహాయింపులకు సంబంధించి గట్టి నిబంధనలున్నాయి.

 
గర్భం దాల్చిన మహిళ 12 వారాల లోపు కౌన్సెలింగ్‌కు హాజరై.. అక్కడికి మూడు రోజుల తరువాత గర్భ స్రావం చేయించుకుంటే దానికి శిక్ష ఉండదు. అందుకే వైద్య విద్యలో భాగంగా గర్భస్రావ ప్రక్రియను అక్కడ నేర్పించరు. దీంతో ఆ దేశంలో గర్భస్రావం చేసే డాక్టర్ల సంఖ్య తగ్గుతోంది. జర్మనీలో కొన్ని ప్రాంతాలలో క్లినిక్‌కి వెళ్లాలంటే మహిళలు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. 2018లో అబార్షన్ కోసం కనీసం 1000 మంది నెదర్లాండ్స్ వెళ్లినట్లు అంచనా. నెథర్లాండ్స్‌లో 22 వారాల లోపు గర్భం తొలగించుకోవచ్చు. అబార్షన్లు చేయడానికి కొందరు వైద్యులు బెల్జియం, నెదర్లాండ్స్ నుంచి జర్మనీ వెళ్తారు.

 
‘ఛాయిస్ బెర్లిన్’ వైద్య విద్యార్థులు బొప్పాయి(పపయా వర్క్‌షాపుల) పేరుతో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బొప్పాయి పండు స్త్రీ అండాశయాన్ని పోలి ఉండటంతో అందులో ఉండే విత్తనాలను తీసే విధానంలోనే అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. అబార్షన్ ప్రక్రియను వైద్య విద్యార్థులకు నేర్పడమే ఈ వర్క్ షాపులు నిర్వహించడం వెనకనున్న ఉద్దేశం.

 
ఈ గ్రూపును 2015లో అలీషియా బెయిర్ స్థాపించారు. “ప్రస్తుతం జర్మనీలో అబార్షన్లు చేసే డాక్టర్లలో అత్యధికులు 60, 70 ఏళ్ల వయసువారే.. వీరంతా రిటైర్ అయ్యే దశలో ఉన్నారు. మహిళల హక్కుల కోసం పోరాటాలను చూసిన తరం వారు" అని అలీషియా అన్నారు. ప్రస్తుత తరం ఈ ప్రక్రియను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయ పడ్డారు.

 
ఇవి నేర్పించడానికి బొప్పాయి వాడొచ్చని ఆమె ఒక అమెరికాకి చెందిన గ్రూప్‌కి వివరించారు. ఆ తరువాత అబార్షన్ కోసం వాడాల్సిన పరికరాలు గురించి సలహాలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. ఆ తరువాత వర్క్ షాపులు నిర్వహించేందుకు కొంత మంది గైనకాలజిస్టుల సహాయంతో వర్క్ షాపులు కూడా నిర్వహించినట్లు ఆమె తెలిపారు. బవేరియా దిగువన ఉండే ప్రాంతాలలో అయిదేళ్ల క్రితమే అక్కడ పని చేసిన చివరి గైనకాలజిస్టు రిటైరయ్యారు. 80 శాతం క్యాథలిక్‌లు ఉన్న ఇక్కడ అబార్షన్ ప్రక్రియ నేర్చుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదు.

 
ఈ ప్రాంతంలో చాలా మంది శరణార్థ మహిళలూ నివసిస్తున్నారు. అలాంటి వారి కోసం అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందటం చాలా కష్టంగా మారుతోంది. జర్మనీలో గర్భిణులకు ముప్పు వాటిల్లి నప్పుడు సహాయం, సలహాలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని జర్మన్ అసోసియేషన్ అఫ్ గైనకాలజిస్ట్స్ బీబీసీకి చెప్పింది. గర్భిణి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మాత్రమే గర్భస్రావం చేయాలని జర్మనీ చట్టాలు చెబుతున్నాయి.

 
“జర్మనీలో డాక్టర్లు, వైద్య సిబ్బంది వారి మత ధర్మాన్ని అనుసరించి అబార్షన్లు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఎవరినీ గర్భస్రావం చేయమని ఒత్తిడి చేయడానికి లేదు" అని తెలిపారు. జర్మనీలో అబార్షన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. నాజీల పరిపాలనా కాలంలో జర్మనీలో శ్వేత జాతి మహిళకు గర్భస్రావం చేస్తే దానిని నేరంగా పరిగణించి మరణ శిక్ష విధించేవారు. కానీ, ఈ నియమం ఇతర జాతులకు చెందిన ప్రజలకు వర్తించేది కాదు.

 
తరువాత కాలంలో తూర్పు జర్మనీ చట్టాలను సవరించింది. కానీ, తూర్పు, పశ్చిమ జర్మనీలు ఐక్యమైన తరువాత మళ్లీ పశ్చిమ దేశాల విధానాలే ప్రామాణికాలుగా మారాయి. అబార్షన్లు చట్ట విరుద్ధమని చెప్పే నాజీల కాలం నాటి చట్టాన్ని ఆధారంగా చేసుకుని అబార్షన్ వ్యతిరేకులు డాక్టర్లకు వ్యతిరేకంగా కేసులు కూడా వేశారు. చాలా సార్లు డాక్టర్లకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తాయని తోరాల్ఫ్ ఫ్రిక్ అనే డాక్టర్ చెప్పారు. కొందరు మహిళలు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత భయంతో క్లినిక్‌కి రారని చెప్పారు.

 
అయితే, ఇటీవల కాలంలో అబార్షన్లను సమర్థించే ఉద్యమాలు కూడా ఎక్కువవుతున్నాయి. దీంతో జర్మనీ లో ఛారిటీ యూనివర్సిటీ, ముంస్టర్ యూనివర్సిటీలు తొలి సారి తమ పాఠ్యాంశాలలో అబార్షన్ ప్రక్రియను కూడా చేర్చాయి. అలీషియా తన చదువు పూర్తి చేసుకుని వైద్య సేవలు అందించడం మొదలు పెట్టారు. ఆమె క్లినిక్‌లో అబార్షన్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే చాలా మంది విద్యార్థులు ఈ ప్రక్రియను నేర్చుకుంటున్నప్పటికీ, ఈ సేవలు అందించేవారు తగినంతమందైతే ఉండరని అలీషియా అంటారు. ఇప్పుడు ఈ సేవలు అందించే డాక్టర్లు రిటైర్ అయితే, భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.