గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 10 జూన్ 2020 (20:15 IST)

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు: విద్యార్థులకు ప‌రీక్ష‌లు పెట్టే విధానం క‌నిపెట్టింది ఎవ‌రు?

క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌ల‌ మధ్య విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌కంటించారు. తమిళనాడులోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారు.

 
నిజానికి.. "విద్యాభ్యాసానికి మ‌న ప‌రీక్షల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ ఒక‌ శాపం లాంటిది" అని జాకీర్ హుస్సేన్ క‌మిటీ 1939 లోనే వ్యాఖ్యానించింది. అప్ప‌టి విద్యా వ్య‌వ‌స్థ‌పై చేసిన ఈ వ్యాఖ్య‌లు నేటికీ స‌రిపోతాయా? అస‌లు మ‌న విద్యా వ్య‌వ‌స్థ స్వ‌రూపం, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ విధానం ఎంత‌వ‌ర‌కు మారింది. ప్ర‌స్తుతం ఎలాంటి సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం? అస‌లు ఈ ప‌రీక్ష‌లు, వాటిని నిర్వ‌హించే బోర్డులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఆధునిక పాఠాలు బోధించే స్కూళ్ల‌ను ఎవ‌రు మ‌న‌కు ప‌రిచ‌యం చేశారు?

 
‘విద్యార్థులను వడపోయటానికే...’
ప్ర‌స్తుతం మ‌నం రాస్తున్న‌, చూస్తున్న ఆధునిక‌ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది ఇండియానా యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసిన హెన్రీ ఏ ఫిషెల్ అంటూ ఆన్‌లైన్‌లో అప్ప‌టిక‌ప్పుడే పోస్ట్‌లు, మీమ్‌లు వ‌స్తుంటాయి. వీటిలో వాస్త‌వాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. మ‌న దేశంలో ఆధునిక విద్య‌ను బ్రిటిష్‌ వారే ప్ర‌వేశపెట్టార‌ని నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ ఎడ్యుకేష‌న్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) మాజీ డైరెక్ట‌ర్ కృష్ణ కుమార్ వివ‌రించారు.

 
"ఈ ప‌రీక్ష‌లు భార‌త్‌ ఆధునిక విద్యా విధానం తొలినాళ్ల‌లో ప‌డిన అడుగుల‌ను గుర్తుచేస్తాయి. 19వ శ‌తాబ్దంలో చివ‌ర్లో ఉన్న‌త విద్య అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉండేవి. మ‌రోవైపు దిగువ స్థాయి ఉద్యోగాలూ అంతంత మాత్రంగానే ఉండేవి. దీంతో విద్యార్థుల‌ను వ‌డ‌పోయ‌డం త‌ప్ప‌ని‌స‌రైంది. అందుకే దీనికి ఎవ‌రూ ఎదురు ప్ర‌శ్న‌లు వేసేవారు కాదు" అని ‘వాట్ ఈస్ వ‌ర్త్ టీచింగ్’ పుస్త‌కంలో ఆయ‌న పేర్కొన్నారు.

 
1929లో ఏర్పాటైన‌ ద ఉత్త‌రప్ర‌దేశ్ బోర్డ్ ఆఫ్ హైస్కూల్ అండ్ ఇంట‌ర్మీడియ‌ట్ ఎడ్యుకేష‌న్ (యూపీబీహెచ్ఎస్ఐఈ) ఈ ప‌రీక్ష‌ల విధాన‌మే కొన‌సాగించింది. ఇది సంస్థానాల్లో ఏర్పాటైన తొలి మాధ్య‌మిక విద్యా బోర్డు (ఎస్ఎస్‌సీ). ఆంధ్ర‌ప్ర‌దేశ్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (బీఎస్ఈఏపీ) 1953లో ఏర్పాటైంది. ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల్లో పాఠ్య ప్ర‌ణాళిక‌, పాఠ్య పుస్త‌కాలు, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను 2014 వ‌ర‌కు ఈ బోర్డే చూసుకునేది. తెలంగాణ అవ‌త‌ర‌ణ‌ అనంత‌రం ఈ బోర్డును రెండుగా విభ‌జించారు.

 
కొత్త ప్రణాళిక, పాత పరీక్షలు...
2005లో నేష‌న‌ల్ క‌రికుల‌మ్ ఫ్రేమ్‌వ‌ర్క్‌ ఆధారంగా ఈ బోర్డు కొత్త పాఠ్య ప్ర‌ణాళిక‌ను రూపొందించింది. ద‌శ‌ల వారీగా ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు కొత్త పాఠ్య‌పుస్త‌కాలూ ప్ర‌వేశ‌పెట్టింది. అనంత‌రం తీసుకొచ్చిన విద్యా హ‌క్కు చ‌ట్టం-2009తో పాఠ‌శాల విద్యా విధానంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఏడాది చివ‌ర్లో వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించే బ‌దులు ఏడాది మొత్తం నిరంత‌రం విద్యార్థుల‌ను ప‌రిశీలిస్తూ గ్రేడ్‌ల‌ను ఇచ్చే కంటిన్యూ‌య‌స్‌ కాంప్రెహెన్సివ్ ఇవాల్యుయేష‌న్‌ (సీసీఈ) ప‌ద్ధ‌తిని ఆర్‌టీఈతో ప్ర‌వేశ‌పెట్టారు. దీన్ని 2012 నుంచీ తెలుగు రాష్ట్రాలు అనుస‌రిస్తున్నాయి.

 
ఈ విధానంలో ప‌రీక్ష‌ల‌తోపాటు నాలుగు ప్రాజెక్టులు ఉంటాయి. అయితే ప్రాజెక్టులకే విద్యార్థుల స‌మ‌యం ఎక్కువ వెచ్చిస్తున్నార‌ని వీటిని రెండింటికి తెలంగాణ ప్ర‌భుత్వం కుదించింది. ఇవ‌న్నీ ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్‌లో భాగ‌మే. ఈ ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్‌కు తెలంగాణ‌లో 20 శాతం వెయిటేజీ ఉంది. ప్ర‌స్తుతం వీటి ఆధారంగానే మిగ‌తా 80 శాతం మార్కులూ ఇచ్చి ప్ర‌మోట్ చేస్తామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం తెలిపింది.

 
‘ఉపాధ్యాయులు సిద్ధంగా లేరు’
ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్‌కు త‌గిన శిక్ష‌ణ‌ ఉపాధ్యాయులకు లేద‌ని సెంట‌ర్ ఫ‌ర్ ఎడ్యుకేష‌న్ అండ్ సోష‌ల్ స్ట‌డీస్ (సీఈఎస్ఎస్‌) మాజీ అధిప‌తి, విద్యా హ‌క్కుల నిపుణుడు నారాయ‌ణ వ్యాఖ్యానించారు. "సీసీఈను అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల నుంచి తీసుకున్నారు. అయితే దీన్ని అమ‌లు చేసేందుకు ఇక్క‌డ‌ ఉపాధ్యాయులు సిద్ధంగాలేరు" అని ఆయ‌న అన్నారు.

 
"పరీక్ష‌ల విధానాన్ని పూర్తిగా మార్చాల్సి ఉంది. పాశ్చాత్య దేశాల్లో విశ్లేష‌ణ త‌ర‌హా ప‌రీక్ష‌ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అక్క‌డ ఓపెన్ బుక్ విధాన‌మూ ఉంటుంది. అంటే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబుల కోసం పుస్త‌కంలో స‌మాచారం చూసి విద్యార్థులు విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ త‌ర‌హా ప‌రిజ్ఞానం విద్యార్థుల్లో విశ్లేష‌ణా సామ‌ర్థ్యం పెంచుతుంది. అంతేకాదు.. ఏడాది చివ‌ర్లో నిర్వ‌హించే ప‌రీక్ష‌ల కోసం విద్యార్థులు బ‌ట్టీప‌ట్టే స‌మ‌స్యా త‌గ్గుతుంది" అని పేర్కొన్నారు.

 
"విద్యా హ‌క్కు చ‌ట్టంలో నో-డిటెన్ష‌న్ కూడా ఒక భాగం. అంటే ఎవ‌రినీ పైత‌ర‌గ‌తుల‌కు పంప‌కుండా ఉంచ‌కూడ‌దు. అయితే 1968 నుంచే రెండు తెలుగు రాష్ట్రాలు దీన్ని అమ‌లు చేశాయి. కొన్ని రాష్ట్రాలు ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తుల్లో డిటెన్ష‌న్ చేస్తున్నాయి. దీన్ని రెండు తెలుగు రాష్ట్రాలు మొద‌ట్నుంచీ వ్య‌తిరేకిస్తూనే ఉన్నాయి. డిటెన్ష‌న్ వ‌ల్ల‌.. వార్షిక ప‌రీక్ష‌ల‌పై విద్యార్థులు ఎక్కువ దృష్టిపెట్టి మ‌ళ్లీ బ‌ట్టీ ప‌ట్ట‌డం ఎక్కువ‌వుతుంది" అని చెప్పారు.

 
అన్నింటినీ లెక్క‌ల్లో చూడ‌కూడ‌దు
ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న వార్షిక ప‌రీక్ష‌ల విధానాల‌తో విద్యార్థులు మాన‌సికంగా ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని ‌విద్యావేత్త‌, సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ స‌భ్యుడు ర‌మేశ్ ప‌ట్నాయ‌క్ వివ‌రించారు. "విద్యా బోధ‌న‌, అభ్యాసాల్లో నాణ్య‌త మెరుగుపై మొద‌ట దృష్టి పెట్టాలి. విద్యార్థుల సామ‌ర్థ్యాన్ని త‌ప్ప‌కుండా ప‌రీక్షించాలి. అయితే ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానాల్లో కాదు" అని చెప్పారు.

 
"పిల్ల‌ల‌కు ఎక్కువ మార్కులు వ‌చ్చేలా చూసేందుకు ఇప్పుడు స్కూళ్ల‌లో బ‌ట్టీ ప‌ట్టిస్తున్నారు. త‌మ స్కూళ్ల‌లో ఎక్కువ మంది పిల్ల‌లు చేరాలంటే ప్ర‌స్తుత‌ విద్యార్థుల‌కు మంచి గ్రేడ్లు రావాలనేది స్కూళ్ల అభిప్రాయం. ముఖ్యంగా ఎక్కువ ప్రైవేటు స్కూళ్లు ఇలాంటి విధానాల‌నే అనుస‌రిస్తున్నాయి. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లూ ఇప్పుడు ఇదే బాట ప‌ట్టాయి" అన్నారు. "ఒకేఒక్క ప‌రీక్షతో విద్యార్థి భ‌విష్య‌త్తును నిర్ణ‌యించ‌కూడ‌దు. మ‌నం మ‌దింపు వేయ‌లేని చాలా అంశాలు పిల్ల‌ల్లో ఉంటాయి. మ‌నం అనుస‌రించే ప‌రీక్షా విధానాల వ‌ల్ల‌ వారి ప్ర‌తిభ మ‌రుగున‌ప‌డ‌కూడ‌దు" అని పేర్కొన్నారు.