ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 23 ఆగస్టు 2024 (21:01 IST)

కాస్టింగ్ కౌచ్: వేధించిన నటుడి పక్కనే భార్యగా నటించాల్సి వచ్చింది, అతను ఆమెను బలంగా హత్తుకున్నాడు

కేరళ రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ మలయాళ సినీ పరిశ్రమలో “కాస్టింగ్ కౌచ్” బాగా వేళ్లూనుకుపోయిందని తెలిపింది. సినీ పరిశ్రమలో వివిధ దశల్లో నియామకాల కోసం ‘కాంప్రమైజ్’, ‘అడ్జస్ట్‌మెంట్స్’ అనే పదాలను పాస్‌వర్డులుగా వాడుతున్నట్లు కమిటీ నివేదిక పేర్కొంది. సినిమాల్లో అవకాశాలు కావాల్సిన మహిళలు అవసరమైనప్పుడు ఎవరితోనైనా సెక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలనేది ఈ రెండు పదాలకు అర్థం. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వాళ్లకు ప్రొడక్షన్ స్థాయిలో ఉన్న వాళ్లు ఇచ్చే సంకేతం ఇది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌ను ఇది తెలియజేస్తుంది. దీన్ని అమలు చేసేందుకు “కోడ్ నెంబర్లు” కూడా ఇస్తున్నారు.
 
జస్టిస్ కె. హేమ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించిన నాలుగున్నరేళ్ల తర్వాత కేరళ ప్రభుత్వం ఆ రిపోర్టును విడుదల చేసింది. నివేదికలోని 290 పేజీల్లో 44 పేజీలు కనిపించలేదు. ఈ పేజీల్లో సినీ పరిశ్రమలో తమని వేధించిన వ్యక్తుల పేర్లను మహిళలు పేర్కొన్నారు. నివేదిక నుంచి తొలగించిన మరో పేజీలో మహిళల్ని ఎలా వేధించారో, వారి పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించారో రాసి ఉంది. “ముందు రోజు తనను వేధించిన వ్యక్తితోనే ఆ హీరోయిన్ తర్వాతి రోజు భార్యగా నటించాల్సి వచ్చింది. ఆమెను అతను బలంగా హత్తుకునే వాడు”. “అది చాలా భయంకరమైన ఘటన. షూటింగ్ సమయంలో ఆమెకు ఎదురైన ఈ చేదు అనుభవం ఆమె మొహంలో కనిపించింది. దీంతో, ఒక్క షాట్ కోసం ఆమె 17 టేకులు తీసుకున్నారు. డైరెక్టర్ ఆమెను చాలా హీనంగా మాట్లాడారు” అని నివేదిక తెలిపింది.
 
2017లో కమిటీ ఏర్పాటు
‘‘సినీ పరిశ్రమలోకి వచ్చే మహిళలు డబ్బు సంపాదించుకోవడానికి దేనికైనా సిద్ధపడతారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది’’ అని నివేదిక వ్యాఖ్యానించింది. “నటన మీద ఆసక్తితో మహిళలు సినిమాల్లోకి వస్తారనే అంశాన్ని పరిశ్రమలో ఉన్న పురుషులు కనీసం ఊహించడానికి కూడా ఇష్టపడరు. డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసమే వస్తారని, సినిమాల్లో అవకాశాల కోసం దేనికైనా సిద్ధపడతారని ఇండస్ట్రీలో పురుషులు భావిస్తారు” అని నివేదిక తెలిపింది. మలయాళ సినీ పరిశ్రమలో పరిస్థితులపై అధ్యయనం చేయాలని కోరుతూ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(డబ్ల్యూ‌సీసీ) 2017లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మెమోరాండం సమర్పించింది. దీని తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రముఖ హీరోయిన్ మీద కారులోనే కొందరు పురుషులు అత్యాచారం చేయడంతో సినీ పరిశ్రమలో పరిస్థితులపై అధ్యయనం చేయాలంటూ ఈ మెమోరాండం సమర్పించారు. ఈ కమిటీలో ప్రముఖ నటి టి.శారద, కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి కేబీ వల్సల కుమారి ఉన్నారు.
 
2017లో ఏర్పడిన విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌ సినీ పరిశ్రమలో లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతోంది. స్త్రీలకు సమాన హక్కులు కల్పించేలా విధానపరమైన మార్పుల కోసం కృషి చేస్తోంది. మలయాళ సినీ పరిశ్రమలో పని చేస్తున్న మహిళలతో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఏర్పడింది. “సినీ పరిశ్రమలో వ్యవస్థాగతమైన సమస్యలు ఉన్నాయని మేం కొన్నేళ్లుగా చెబుతున్నాం. ఈ నివేదిక మా ఆరోపణలు నిజమని తేల్చింది. పరిశ్రమలో ఉన్న సమస్యల్లో లైంగిక వేధింపులు ఒక సమస్య మాత్రమే. సమస్యల గురించి ప్రస్తావిస్తున్నందుకు మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మేం ఆశించిన దాని కంటే నీచమైన పరిస్థితులు ఉన్నట్లు ఈ నివేదిక రుజువు చేసింది” అని మలయాళం సినీ ఎడిటర్ బీనా పాల్ బీబీసీతో అన్నారు. బీనా పాల్ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌లో సభ్యురాలిగా ఉన్నారు.
 
‘పవర్‌ఫుల్ లాబీ’
ఒక ప్రాంతానికి చెందిన సినీ ఇండస్ట్రీలో మహిళల పరిస్థితులపై కమిటీ నివేదిక ఇవ్వడం మొత్తం భారతీయ సినీ పరిశ్రమలోనే ఇది తొలిసారి. “కమిటీకి అందించిన ఆధారాల ప్రకారం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు నిర్ఘాంత పరిచేలా ఉన్నాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు, నియంత్రించడం లేదు” అంటూ నివేదికలో పేర్కొన్నారు. “పురుషుల లైంగిక వేధింపుల గురించి చాలామంది మహిళలు ఆడియో, వీడియో క్లిప్పులు, వాట్సాప్ సందేశాల స్క్రీన్‌షాట్లు అందించారు”. “మలయాళ సినీ పరిశ్రమలో పవర్‌ఫుల్ లాబీ ఉందని ఒక ప్రముఖ నటుడు కమిటీకి చెప్పారు. అది దాదాపు ‘మాఫియా’ స్థాయిలో పనిచేస్తోందన్నారు. ఇండస్ట్రీలో అది ఏమైనా చెయ్యగలదు. ప్రముఖ డైరెక్టర్ల సినిమాలను ఆపేయగలదు. నిర్మాతలు, నటీ నటులు, ఎవరినైనా సరే నిషేధించగలదు. ఆ నిషేధం చట్టబద్దం కాకున్నా సరే, ఆ పవర్‌ఫుల్ లాబీ ఆ పని చేయించగలదు” అని నివేదికలో తెలిపారు. “దేశంలోని అనేక ప్రాంతీయ చిత్ర పరిశ్రమలతో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమ చాలా చిన్నది. అది క్రూరమైనది కూడా. మహిళలు, ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తున్న పెద్ద మాఫియా సామ్రాజ్యం అది” అని సినీ చిత్రకారుడు ఓ.కే. జానీ బీబీసీతో అన్నారు.
 
బానిసల్లా జూనియర్ ఆర్టిస్టులు
జూనియర్ ఆర్టిస్టులు, హెయిర్‌స్టైలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది. ''జూనియర్ ఆర్టిస్టులను ''బానిసల్లా చూస్తున్నారు''. సెట్‌లో వాళ్లకి టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించడం లేదు. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ పనిచేయిస్తున్నారు. ఏవో చిన్నచిన్న ఏర్పాట్లు ఉన్నప్పటికీ, భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు. హెయిర్ స్టైలిస్ట్‌లు, మేకప్ ఆర్టిస్టుల పరిస్థితి మరింత దిగజారింది. ఎందుకంటే, పని ప్రదేశాల్లో సౌకర్యాలు, వేతన నియంత్రణ వంటి చట్టాలను వారి యూనియన్లు ఉల్లంఘిస్తున్నాయి.' అని నివేదిక పేర్కొంది. మలయాళం ఇండస్ట్రీలో ఒకటే ఒకటి నడుస్తుందని, ‘ఎస్’ చెప్పని వారిని మాఫియా ఈ ఇండస్ట్రీ నుంచి నిషేధించగలదన్నారు. సినీ పరిశ్రమను నియంత్రించేందుకు ఒక చట్టాన్ని, మహిళల భద్రత కోసం మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది.
 
‘చర్యలు ఎక్కడ?’
నివేదికను ఆలస్యంగా విడుదల చేయడాన్ని కేరళ ప్రతిపక్ష యూడీఎఫ్ తప్పు పట్టింది. నివేదికలో ప్రస్తావించిన వారిపైన, నేరాలకు పాల్పడిన వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అయితే కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. పోలీసుల వద్ద ఏ మహిళైనా ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ నివేదికపై అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(ఏఎంఎంఏ) అధికారికంగా స్పందించలేదు. నివేదికలోని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత స్పందిస్తామని ఆ సంస్థ అధికారులు చెప్పారు.
 
కేరళలో ఇదంతా ఎలా జరుగుతోంది?
సినిమాల విషయంలో విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న కేరళ వంటి రాష్ట్రంలో ఇది ఎలా సాధ్యమని మలయాళ చిత్ర పరిశ్రమపై విస్తృత అధ్యయనం చేసిన ప్రముఖ సినీ విమర్శకుడు వెట్టికాడ్‌ను బీబీసీ ప్రశ్నించింది. “మలయాళ చిత్ర పరిశ్రమ కేరళ సమాజానికి సూక్ష్మరూపం. ఇది విపరీతమైన ప్రగతిశీల, విపరీతమైన పితృస్వామ్య సహజీవనం. ఇదే ధోరణి ఇండస్ట్రీలోనూ కనిపిస్తుంది. పితృస్వామ్యాన్ని పరిశీలించే కొన్ని ఉత్తమ చలన చిత్రాలు మలయాళంలో నిర్మించారు. కానీ, ఇదే ఇండస్ట్రీ చాలా వెనుకబడిన చిత్రాలను రూపొందించింది. సినిమా వంటి సృజనాత్మక రంగంలో స్త్రీలను ద్వేషించేవారు మహిళలను లైంగికంగా వేధించడంలో ఆశ్చర్యం లేదు” అని వెట్టికాడ్ చెప్పారు.
 
మార్పు సాధ్యమేనా?
పరిస్థితి కొంత మారింది. కానీ మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని సరిచేయడానికి ఇదే సరైన సమయం. దీనిపై సినీ పరిశ్రమ కలిసి ముందుకు రావాలి’’ అని ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్' డైరెక్టర్ జియో బేబీ బీబీసీతో చెప్పారు. రాత్రికి రాత్రే మార్పులు ఆశించడం తప్పు అని బీనా పాల్ అన్నారు. మహిళలు సురక్షితంగా భావించేలా పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఇతరులను ప్రోత్సహించేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని ఆమె సూచించారు.