శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:31 IST)

LIVE: రాష్ట్రపతి భవన్‌లో విందుకు హాజరైన డోనల్డ్ ట్రంప్ - TrumpInIndiaBBC

అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇస్తున్న విందు కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. ఈ విందుకు సతీమణి మెలానియా సమేతంగా ట్రంప్ హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాల ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. వీరందరినీ ట్రంప్‌కు రామ్‌నాథ్ కోవింద్ పరిచయం చేశారు. అదేవిధంగా ట్రంప్‌తో పాటు భారత పర్యటనకు వచ్చిన అమెరికా ప్రతినిధి బృందాన్ని కోవింద్‌కు ట్రంప్ పరిచయం చేశారు. 

 
'దిల్లీ హింసపై మాట్లాడను.. భారత్‌లో ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారు'
భారతదేశంలో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్‌ ప్రభావం భారతదేశంలో ఎక్కువగా లేదని, ఈ వైరస్‌ను భారత్ బాగా కట్టడి చేయగలిగిందని ఆయన అన్నారు. అమెరికా సైతం కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

 
భారత్‌లో తన రెండు రోజుల పర్యటన అద్భుతంగా జరిగిందని తెలిపారు. తనకు, నరేంద్ర మోదీకి మధ్య సంబంధాలు గొప్పగా ఉన్నాయని, భారతీయ ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు అమెరికాను ఇష్టపడుతున్నారని ట్రంప్ అన్నారు. కాగా, చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోందని, ఈ అంశంపై తాను చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో కూడా మాట్లాడానని అన్నారు.

 
ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు తాను తీసుకున్నన్ని చర్యలు మరెవ్వరూ తీసుకోలేదని, అమెరికాలాగే రష్యా, సిరియా, ఇరాన్ తదితర దేశాలు కూడా ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

 
పాకిస్తాన్‌పై...
పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదం గురించి ప్రశ్నించగా.. ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. మరొసారి ఇదే ప్రశ్న ఎదురవ్వగా.. మోదీతో ఈ అంశంపై తాను సుదీర్ఘంగా చర్చించానని చెప్పారు. ఇరు దేశాల ప్రధాన మంత్రులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు వాళ్లు పనిచేస్తున్నారన్నారు. అలాగే, కశ్మీర్ అంశంపై ఇరు దేశాలకూ రెండు భిన్న వాదనలు ఉన్నాయని, తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమన్నారు.

 
కశ్మీర్ ఇరు దేశాలకూ గొప్ప సమస్యగా మారిందని, దీనిని ఇరు దేశాలూ చర్చించుకుని పరిష్కరించుకోగలవని, అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని.. గతంలో కూడా తాను ఇదే మాట చెప్పానన్నారు.

 
‘మోదీ పైకి అలా కనిపిస్తారు.. కానీ గట్టి వ్యక్తి’
ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ఎదుర్కోగలరని, పైకి ఆధ్యాత్మికంగా, ప్రశాంతంగా కనిపించినప్పటికీ ఆయన చాలా గట్టి వ్యక్తి అని, ఆయన పనిని తాను స్వయంగా చూశానని, ఉగ్రవాదాన్ని ఆయన చూసుకోగలరని అన్నారు.

 
‘సీఏఏపై మేం చర్చించలేదు’
కాగా, పొరుగు దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం ఇచ్చే సీఏఏపై తాము చర్చించుకోలేదని ట్రంప్ అన్నారు. మత సామరస్యంపై చర్చించామని తెలిపారు. ముస్లింలు, క్రిస్టియన్లకు సంబంధించి తాను మోదీతో చర్చించానని.. దీనికి మోదీ గట్టి సమాధానం ఇచ్చారన్నారు.

 
భారతదేశంలో ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో అన్నారని ట్రంప్ చెప్పారు. దిల్లీలో జరిగిన సంఘటన గురించి తాను మాట్లాడబోనని, అది భారత్ అంతర్గత వ్యవహారమని తెలిపారు.

 
హెచ్1బి వీసాలపై
హెచ్1బి వీసాల గురించి ప్రశ్నించగా ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా.. భారత చరిత్రలో మరే ఇతర విదేశీ నాయకుడికీ లభించని స్వాగతం తనకు లబించిందని, లక్షలాది మంది తనకు స్వాగతం పలికేందుకు వచ్చారని, మరెన్నో వేల మంది స్టేడియం బయట వేచి ఉన్నారని, రోడ్లపై నిలబడ్డారని ట్రంప్ చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు పెరుగుతున్నారని తెలిపారు.

 
‘నాకు లభించిన స్వాగతం మరే నాయకుడికీ లభించలేదు’
అహ్మదాబాద్‌లో తనకు లభించిన స్వాగతం లాంటిది గత 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని తమ రాయబారి కూడా తనకు చెప్పారన్నారు. అమెరికాను గౌరవించాలని వారంతా భావించారని, తాను అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, కాబట్టే వారంతా వచ్చారని చెప్పారు.

 
‘వాణిజ్య ఒప్పందం కుదురుతుంది.. భారత్ వైఖరి సరికాదు’
భారతదేశంతో వాణిజ్య ఒప్పందం గురించి స్పందిస్తూ.. చైనాతో కూడా వాణిజ్య ఒప్పందం సాధ్యం కాదని అంతా అన్నారని, కానీ.. తాను మాత్రం దాన్ని సాధ్యం చేశానని, అలాగే భారతదేశంతో కూడా వాణిజ్య ఒప్పందం కుదురుతుందని తెలిపారు. ఒకవేళ వాణిజ్య ఒప్పందం కుదరకపోతే, దాని స్థానంలో మరొకటి కుదురుతుందని, ఏదైనా సరే సంతృప్తికరంగా ఉంటుందని తెలిపారు.

 
ఇరు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, సుంకాల విషయంలో తాము ఉదారంగా వ్యవహరిస్తున్నప్పటికీ భారతదేశం అలా లేదని, సుంకాల విషయంలో భారత్ వైఖరి సరికాదని అన్నారు. భారతదేశంతో తమకు వాణిజ్య లోటు ఉందని, దీన్ని తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు.

 
‘మేం తీసుకున్న చర్యలు ముస్లింలకు వ్యతిరేకం కాదు’
‘భారతదేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలపై మోదీతో మాట్లాడుతున్న మీరు అమెరికాలోకి అడుగుపెట్టకుండా ముస్లింలపై ఆంక్షలు విధిస్తున్నారు కదా’ అని బీబీసీ ప్రతినిధి ప్రశ్నించగా.. ముస్లింలు అమెరికాలోకి రాకుండా తాము ఆంక్షలు విధించింది మతం ఆధారంగా కాదని, అవి ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఆయా దేశాలకు సంబంధించినదని, ఆయా దేశాల నుంచి వచ్చే ప్రజల కారణంగా అమెరికాలో పెరుగుతున్న హింస నేపథ్యంలో విధించిన ఆంక్షలు అవని ట్రంప్ చెప్పారు. అంతకు ముందు దిల్లీలో భారతీయ పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులతో ట్రంప్ సమావేశమయ్యారు.

 
ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న భారతీయ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలతో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను తిరిగి గెలిస్తే స్టాక్ మార్కెట్ దూసుకుపోతుందని, ఒకవేళ తాను గెలవకుంటే భారీగా పతనం అవుతుందని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టాలని, అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

 
మోదీ చాలా మంచివారని, అలాగే చాలా కఠినంగా కూడా ఉంటారని ట్రంప్ తెలిపారు. అమెరికా భారత్‌లో పెట్టుబడులు పెట్టి భారతీయులకు ఉద్యోగాలు కల్పిస్తుందని, అలాగే భారత్ కూడా అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.
 

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 4 జీ గురించి వివరిస్తుండగా.. 5జీ సేవలు కూడా అందిస్తారా? అని ట్రంప్ అడిగారు. అందిస్తామని ముఖేశ్ చెప్పగా.. అలాగైతే తమ దేశంలో కూడా సేవలు అందించేందుకు కాంట్రాక్టుకు పోటీపడాలని ట్రంప్ సూచించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ.. అమెరికాలో ఒక అల్యూమినియం కంపెనీని కొనుగోలు చేశామని చెప్పగా, దానికి తమ ప్రభుత్వం టారిఫ్‌ల రూపంలో చాలా సహకారం అందించిందని ట్రంప్ అన్నారు. అల్యూమినియం, స్టీలు పరిశ్రమలు తమ దేశంలో చచ్చిపోయాయని, అలాంటి వాటికి తాము ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు.

 
హైదరాబాద్‌ హౌస్‌లో ద్వైపాక్షిక భేటీ
దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. మొదట మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. 21 శతాబ్దంలో అమెరికా-భారత స్నేహం చాలా ముఖ్యం అన్నారు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

 
ఉమ్మడి కార్యాచరణ
గత 8 నెలల్లో ట్రంప్‌తో ఇది తన ఐదో సమావేశం అని నరేంద్ర మోదీ చెప్పారు. "ఇవాళ మేం ఇరు దేశాల భాగస్వామ్యంలో ముఖ్యమైన అంశాలైన డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంకేతిక సహకారం, గ్లోబల్ కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలు లాంటి వాటిపై సానుకూలంగా చర్చించాం" అన్నారు. భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం, రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో చాలా కీలకం అన్నారు.

 
"డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్ లాంటి తీవ్ర సమస్యల గురించి కొత్త ఉమ్మడి కార్యాచరణను రూపొందించడంపై రెండు దేశాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి" అని తెలిపారు. ‘‘మా స్ట్రాటజిక్ ఎనర్జీ పార్టనర్‌షిప్‌లో భాగంగా ఈ రంగంలో పరస్పర పెట్టుబడులను పెంచుతున్నాం. గత మూడేళ్లలో మా ద్వైపాక్షిక వాణిజ్యంలో రెండంకెల వృద్ధి వచ్చింది. రాబోవు కాలంలో ఈ గణాంకాలు ఇంకా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’’ అని మోదీ చెప్పారు.

 
రక్షణ రంగం బలోపేతం
తర్వాత మాట్లాడిన ట్రంప్.. ఇది మర్చిపోలేని ప్రత్యేకమైన పర్యటన అన్నారు. రెండు దేశాలకు ఇది ఫలవంతమైన పర్యటనగా మిగులుతుందన్నారు. ‘‘రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి రెండు దేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించాం.. భారత్, అమెరికా రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాం. రెండు దేశాల మధ్య 300 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాలు జరిగాయి. వీటిలో అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లు లాంటివి ఉన్నాయి. ఈ ఒప్పందాలు ఇరు దేశాల సంయుక్త రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. 5 జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ గురించి చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి’’ అన్నారు.

 
భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు రెండో రోజు మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు డోనల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌‌లను సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

 
అనంతరం కుటుంబ సమేతంగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ట్రంప్.. మహాత్ముని సమాధిని సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయం రాసి సంతకం చేశారు. అక్కడ నుంచి హైదారాబాద్ హౌజ్‌కు చేరుకున్న ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఇరు దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుని గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన అధికారిక విందు కార్యక్రమంలో ట్రంప్ పాల్గొంటారు. అనంతరం స్వదేశానికి తిరుగు పయనమవుతారు.

 
మొదటిరోజు పర్యటన ఎలా సాగింది?
ట్రంప్ మొదటి రోజు పర్యటనలో భాగంగా ఉదయం 11.40 నిమిషాలకు అహ్మాదాబాద్ విమానాశ్రయనికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్‌లో పాల్గొన్న ఆయన మార్గ మధ్యంలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.

 
అక్కడ నుంచి నేరుగా మొతేరా స్టేడియానికి చేరుకొని అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి ఆగ్రా చేరుకొని తాజ్ మహల్‌ను కుటుంబ సమేతంగా సందర్శించారు. రాత్రి దిల్లీకి చేరుకున్నారు.