గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:25 IST)

ఫ్యానీ ఎస్కోబార్‌: రేప్ చేసిన వారిని ఆమె క్షమించారు, తనలో కన్నీరు ఎప్పుడో ఇంకిపోయిందన్నారు

హెచ్చరిక: లైంగిక హింసకు సంబంధించిన అనేక విషయాలు ఈ కథనంలో ఉంటాయి.
ఫ్యానీ ఎస్కోబార్‌ కొలంబియాకు చెందిన ఓ సామాజిక కార్యకర్త. దేశంలో అంతర్యుద్ధం కారణంగా అనేక దశాబ్దాల పాటు అనేక కష్టాలు పడిన ఆమె ఇప్పుడు మాఫియా ముఠాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసే పనిలో ఉన్నారు. తనలో కన్నీరు ఇంకి పోయిందని చెబుతారు ఫ్యానీ ఎస్కోబార్‌. "నా మాటలు తెరలు తెరలుగా వినిపిస్తుంటాయి. కానీ నేను ఏడవను. ఎందుకంటే నాకు ఏడుపు రాదు. నా కంటిలో నీరు ఎప్పుడో ఇంకి పోయింది." అన్నారామె.

 
తన బాధాకరమైన గతాన్ని చెబుతుండగా ఆమె చేతులు వణికాయి. శరీరం కంపించింది. ఫ్యానీ ఎస్కోబార్‌ వినిపించిన కథ ఇప్పటిది కాదు. 57 ఏళ్ల కిందట ఆమె అనుభవించిన దారుణమైన జీవితానికి సంబంధించింది. యుద్ధంతో విలవిలలాడిన కొలంబియాలోని ఉరాబాలో ఆమె జీవించారు. ఆమె ఓసారి అత్యాచారానికి గురయ్యారు. గెరిల్లా, పారా మిలిటరీ దళాల నుంచి అనేక బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఈ బెదిరింపుల కారణంగా ఆమె అనేకసార్లు ఇళ్లు మారుస్తూ వివిధ ప్రాంతాలకు తిరిగాల్సి వచ్చింది.

 
కన్న కొడుకు, పెంచుకున్న పిల్లల్లో కొందరితో పాటు, ఆమె భర్త హత్య బాధను దిగమింగుకుని బతికారు. ఈ జీవిత పోరాట భయం కారణంగానే తాను క్యాన్సర్‌కు గురయ్యానని ఫ్యానీ ఎస్కోబార్‌ అంటారు. "ఎన్నో బాధలు అనుభవించాను. గుండెల్లోని దుఃఖం క్యాన్సర్‌ రూపంలో బైటపడింది. ఇప్పుడు నేను కుడి కన్నుతో కొద్దిగా చూడగలుగుతున్నాను. భయంతో నా శరీరమంతా విషపూరితమైంది. క్యాన్సర్‌ నా పాలిటి శత్రువు." అన్నారామె.

 
ఆమె జీవిత కథను విన్న కొందరు, ఈ కథను సినిమాగా ఎందుకు తీయకూడదు అని ప్రశ్నించారు. అందుకామె "ఈ దేశంలో ఏడెనెమిది సార్లు అత్యాచారానికి గురైన మహిళలు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ అనేకమంది రేప్‌కు గురవుతూనే ఉన్నారు. వారి బాధతో పోల్చుకుంటే నా కథ పెద్ద విషయం కాదు" అంటారు ఎస్కోబార్‌. కొలంబియాలో పని చేస్తున్న అనేకమంది స్వచ్ఛంద సంస్థలోని ఓ సంస్థకు ఎస్కోబార్‌ నాయకురాలు. తమ పిల్లలను నేరాలలోకి దించుతూ, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే ముఠాలకు వ్యతిరేకంగా పని చేసే 'ముజెరెస్‌ డెల్‌ ప్లాంటన్' అనే స్వచ్ఛంద సంస్థలో ఆమె పని చేస్తున్నారు.

 
కొలంబియాలో పని చేసే అనేక మాదక ద్రవ్యాల ముఠాలు ఆమె నాయకత్వం వల్ల తమ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని తెలిసి అనేకసార్లు బెదిరించాయి. దాడులకు ప్రయత్నించాయి. ఇది దశాబ్దాల పాటు సాగింది. ఇవి కేవలం బెదిరింపులే కాదు. 2020 సంవత్సరంలో కొలంబియా వ్యాప్తంగా 309 మంది సామాజిక కార్యకర్తలు హత్యకు గురయ్యారు. 2021 సంవత్సరం మొదట మూడు నెలల్లోనే 40మంది హత్యకు గురయ్యారని స్థానిక థింక్‌ట్యాంక్‌ సంస్థ 'ఇండెపాజ్‌' విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. మానవ హక్కుల పరిరక్షణలో అత్యంత హీన స్థాయిలో ఉన్న కొలంబియాలో ఏదో ఒక రోజు తాను కూడా ఈ మృతుల జాబితాలో చేరతానని ఎస్కోబార్‌కు తెలుసు. "అయినా నేను భయపడను. నేను చావడానికే పుట్టాను" అంటారామె.

 
ధీర వనిత
ఉత్తర కొలంబియలోని ఓ ఎడారి ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు ఎస్కోబార్‌. ఆమె టీనేజ్‌లో ఉన్నప్పుడు పనామాకు సమీపంలో ఉన్న ఉరాబా ప్రాంతానికి ఆమె కుటుంబం వలస వచ్చింది. తల్లి నుంచి దూరమైన ఆమె, పాపులర్‌ లిబరేషన్‌ ఆర్మీ (ఈపీఎల్‌ ఇన్‌ కొలంబియా)కి పట్టున్న ఉరాబా గల్ఫ్‌ ప్రాంతంలో అనేక సంవత్సరాలు ఉన్నారు. అక్కడి గౌజీరా తెగ సంప్రదాయం ప్రకారం ఆమె తండ్రి నాలుగు మేక పిల్లల కోసం ఆమెకు వివాహం చేశారు. అక్కడ ఆమె పశువులు కాసుకుంటూ జీవితం కొనసాగించారు.

 
"ఉదయం నాలుగు గంటలకు లేచేదాన్ని. పాలు తీయడం, పశువులను మేపడం నా పని. మగ పశువులకు క్యాస్ట్రేషన్ (సెక్స్‌కు పనికి రాకుండా చేయడం) ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. ఒక వీరుడిలా జీను లేని గుర్రంపై సవారీ చేయగలను" అన్నారామె. ఒక మగవాడిలా ఉండటం వల్ల తనకు శిక్షలు కూడా ఎక్కువగానే అనుభవించానని ఆమె చెబుతారు.

 
కష్టాల జీవితం
1990లలో విప్లవానికి వ్యతిరేకులైన పారామిలిటరీ దళాలు ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించుకునే క్రమంలో జరిగిన పోరాటంలో అనేకమంది మరణించారు. పారామిలిటరీ దళాలు, కొలంబియా ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, వ్యాపారవేత్తలతో జట్టుకట్టి సుమారు 60 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని రైతుల నుంచి లాక్కున్నాయి. "పారామిలిటరీ దళాల సభ్యులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు. మహా క్రూరులు" అన్నారామె. పారామిలిటరీ దళాల క్రూరత్వం నుంచి చెప్పబోతుండగా ఆమె శరీరం కంపించింది.

 
"ఒక రోజు కొందరు వ్యక్తులు గుర్రం మీద మా ఇంటికి వచ్చారు. నా చెల్లెల్ని చూసి "ఈమె చాలా హాట్‌గా ఉంది. 20 రోజుల తర్వాత మళ్లీ వచ్చి ఈమెను తీసుకుపోతాం అన్నారు" అని ఆనాటి సంఘటనను ఎస్కోబార్‌ గుర్తు చేసుకున్నారు. తన సోదరిని వేరే ప్రాంతంలో దాచి, తానొక్కతే ఆ ఇంట్లో ఒంటరిగా ఉండి పోయారు ఎస్కోబార్‌. అనుకున్నట్లుగానే 20 రోజుల తర్వాత వాళ్లు మళ్లీ వచ్చారు. ఒక వ్యక్తి నన్ను మంచినీళ్లు అడిగాడు. నేను నీళ్ల కోసం లోపలికి వెళ్లే సరికి, నా వెనకే ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. ఇంటి వెనక వైపు మరో ఇద్దరు లోపలికి ప్రవేశించారు. అలా ఐదగురు నా ఇంటిలోకి చొరబడ్డారు. " నువ్వేనా ఈ ప్రాంతంలో వీర వనితవు?" అని అడిగారు.

 
"మీకు ఏం కావాలి? నా భర్త ఇంట్లో లేరు. పశువులు కాయడానికి వెళ్లారు" అని ఎస్కోబార్‌ వారితో అన్నారు. "మాకు పశువులు వద్దు. నువ్వు కావాలి వీర వనితా" అన్నారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని తెలిసే, ఆమెపై అత్యాచారం చేయడానికి వారు అక్కడికి వచ్చారు. "వాళ్ల బాస్‌ నన్ను ముద్దు పెట్టుకుని, మొదట ఒళ్లంతా తడిమి, తరవాత బెడ్‌ మీదకు నెట్టాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్లు తమ పని కానివ్వాలనుకున్నారు. నేను ఎదురు తిరుగుతానని ముందే ఊహించారు. అందుకే నన్ను తీవ్రంగా కొట్టారు. నేను తీవ్రంగా ప్రతిఘటించాను. తర్వాత నేను ఓడిపోయాను. నా ప్రాణం పోతున్నట్లు అనిపించింది" అని ఎస్కోబార్‌ వెల్లడించారు.

 
అత్యాచారం జరిగిన సమయంలో ఆమె గర్భవతి
"నన్ను చంపండి, నా కడుపులో బిడ్డను చంపొద్దు" అని బతిమాలాను. వాళ్లు నన్ను తుపాకీతో తీవ్రంగా కొట్టారు. బాధతో మూలిగాను. చనిపోతాననుకున్నాను. చివరకు అచేతనంగా ఉన్న నన్ను అలా పడేసి వెళ్లిపోయారు" అన్నారు ఎస్కోబార్‌. ఈ ఘటన తర్వాత ఆమెకు అబార్షన్‌ అయ్యింది. "వాళ్లు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. సక్సెస్‌ అయ్యారు." అన్నారామె. 'కొలంబియా అబ్జర్వేటరీ ఆఫ్‌ మెమరీ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్' అంచనా ప్రకారం 1958-2018 మధ్య కాలంలో 15,738మంది మహిళలు లైంగిక దాడులకు గురయ్యారు. అత్యాచారం అనేది ఇప్పటికీ యుద్ధంలో ఒక ఆయుధమే.

 
ఆమె కష్టాలు అక్కడితో తీరలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత పారామిలిటరీ దళాలు ఆమె భర్తను చంపేశాయి. కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నాడన్నది వారి ఆరోపణ. తన తండ్రి హత్య విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పినందుకు ఆమె కొడుకును కూడా పారా మిలిటరీ దళాలు హత్య చేశాయి.

 
నిశ్శబ్ధ విప్లవం
ఆమె చేతులు మళ్లీ వణికాయి. కాస్త విశ్రాంతి తీసుకొమ్మని నేను ఆమెకు సూచించాను. కానీ ఆమె వినలేదు. చెప్పనివ్వు అన్నారు. "నేను తిరగబడ్డాను. ఎందుకంటే జీవితమంటే అలాగే ఉంటుంది. కొన్నిసార్లు మనం పడిపోతాం. కానీ మళ్లీ బలంగా లేచి నిలబడాలి" అన్నారామె. ఇదే సమయంలో నేను ఆశ్చర్యపోయే మాట ఒకటి చెప్పారు ఎస్కోబార్‌. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను క్షమిస్తున్నట్లు ఆమె చెప్పారు.

 
"క్షమ అనేది కొన్నిసార్లు మార్పు తీసుకురావడానికి ఒక సాధనం అవుతుంది" అన్నారామె. 2013లో అపర్టాడో పట్టణంలో కొంతమంది సైనికులు ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. దీంతో హింస తగ్గడం లేదని గుర్తించిన ఆమె ఇరుగు పొరుగు వారితో కలిసి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే 'ముజెరెస్‌ డెల్‌ ప్లాంటన్‌' అనే సంస్థ ఏర్పడింది.

 
ఫ్యానీ ఎస్కోబార్‌ స్థాపించిన స్వచ్ఛంద సంస్థకు దేశంలోని వివిధ ఎన్జీవోలు మద్ధతుగా నిలిచాయి. 2000 మంది మహిళలు ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. మిగతా లాటిన్‌ అమెరికా దేశాల లాగానే కొలంబియాలో కూడా విప్లవానికి పునాదులు పడుతున్నాయి. ఇక్కడ నిరసనలు తెలిపే సంప్రదాయం లేకపోయినా, ప్రజల్లో మాత్రం అవగాహన పెరిగింది. మాఫియా ముఠాలకు వ్యతిరేకంగా ప్రజలు గొంతు విప్పుతున్నారు.

 
"ఉరాబా ప్రాంతం దోపిడి, హింస, అణచివేతలకు నిలయంగా ఇన్నాళ్లూ కొనసాగింది. ఇప్పుడు ఇక్కడ నిశ్శబ్ధ విప్లవం, ముఖ్యంగా మహిళ ఆధ్వర్యంలో ఉద్యమాలు మొదలవుతున్నాయి. ఈ హత్యకాండ కారణంగా ఇక్కడ సామాజిక జీవనం తలకిందులైంది" అని 'ఐడియాస్‌ ఫర్‌ పీస్ ఫౌండేషన్‌' సంస్థకు చెందిన ఇరీనా కుయెస్టా అన్నారు. "వాళ్లు వీధుల్లోకి వచ్చిన నిరసనలు చేపట్టకపోవచ్చు. కానీ సమాజంలో ఏర్పడిన అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలకు మంచి నీరు, రోడ్లు, చదువు అందేందుకు ప్రయత్నం చేస్తున్నారు" అని కుయెస్టా అన్నారు.

 
ఇప్పుడు అపార్టాడో ప్రాంతంలో ముజెరెస్‌ డెల్‌ ప్లాంటన్‌ సంస్థ స్థానిక మాఫియా ముఠాలకు కంటగింపుగా మారింది. "ఇక్కడి పరిస్థితులను ఎప్పుడైనా గమనించారా" అని ఎస్కోబార్‌ నన్ను ప్రశ్నించారు. "ఇదొక బహిరంగ డ్రగ్‌ మార్కెట్‌. సాయంత్రం అయిందంటే చిన్న చిన్న పాకెట్లలో మాదక ద్రవ్యాలను ఇక్కడి యువతకు అందిస్తున్నారు." అని ఎస్కోబార్‌ అన్నారు. "డ్రగ్‌ ముఠాలు మా పిల్లలను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తున్నాయి. ముందు వారికి అలవాటు చేసి తర్వాత అది లేకుండా వారు బతకలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి. డ్రగ్‌ సరఫరాలో కూడావ వారిని వాడుకుంటున్నాయి. అలా చేయకపోతే వారిని చంపేస్తారు." అని ఆమె వెల్లడించారు.

 
"మేం ఇప్పటికే అనేక డ్రగ్‌ మార్కెట్లను మూయించగలిగాం. ఈ రొంపిలోకి దిగవద్దని, దిగితే చంపేస్తారని మా కమ్యూనిటీ నాయకుల ద్వారా ప్రజలకు వివరిస్తున్నాం. నేరస్తులను అడ్డుకున్నారన్న కసితో కమ్యూనిటీ లీడర్లను కూడా డ్రగ్స్‌ ముఠాలు చంపేస్తున్నాయి" అని ఎస్కోబార్‌ వెల్లడించారు.