గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 21 జనవరి 2021 (19:12 IST)

సీరమ్ ఇనిస్టిట్యూట్: పుణెలోని కోవిడ్ వ్యాక్సీన్ తయారీ సంస్థలో అగ్నిప్రమాదం, ఐదుగురు మృతి

పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని తొలుత సంస్థ ప్రకటించినప్పటికీ తరువాత కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంలో కొందరు మరణించారని సంస్థ యజమాని, సీఈవో అదర్ పునావాలా తెలిపారు.

 
కాగా అగ్ని ప్రమాదం జరిగిన భవనం నుంచి అయిదు కాలిన మృతదేహాలు బయటకు తీసినట్లు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. ప్రమాదంలో అయిదుగురు మరణించారని పుణె మేయర్ మురళీధర మొహల్ తెలిపారంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది. నిర్మాణంలో ఉన్న భవనంలో వెల్డింగు పనుల కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

 
'సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం నాలుగో అంతస్తులో అగ్ని చెలరేగడంతో అక్కడ కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాదానికి కారణమేంటో తెలుసుకుంటున్నాం. వెల్డింగు పనులు కారణం కావొచ్చు. ప్రమాదం వల్ల నాలుగో ఫ్లోర్ మొత్తం తగలబడిపోయింది. మంటలను పూర్తి అదుపు చేసిన తరువాత నాలుగో అంతస్తులో కాలిన మృతదేహాలను చూశారు. చనిపోయినవారు భవన నిర్మాణ కార్మికులు కావొచ్చు. మిగతా అందరినీ భవనం నుంచి ఖాళీ చేయించారు'' అని పుణె మేయర్ మురళీధర్ మొహల్ 'బీబీసీ'కి చెప్పారు.


ప్రమాదం ఎక్కడ జరిగింది
సీరమ్ ఇనిస్టిట్యూట్‌లోని టెర్మినల్ 1 గేట్ సమీపంలోని మంజరీ ప్లాంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మంటలను అదుపుచేయడానికి 10 ఫైర్ ఇంజిన్లు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. ఈ ప్రమాదం కారణంగా కోవిడ్ టీకా ఉత్పత్తికి ఎలాంటి విఘాతం కలగబోదని ఆ సంస్థ ప్రకటించింది. అయితే, మంటలను అదుపు చేసిన తరువాత అగ్నిమాపక సిబ్బందికి అక్కడ కాలిన మృతదేహాలు కనిపించాయి.

 
కోవిడ్ వ్యాక్సీన్ తయారీ
సీరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సీన్లు తయారుచేసే సంస్థ. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సీన్ కూడా ఇక్కడ తయారవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సీన్ తయారీ సంస్థ ఇది. భారత్ ఒక్కటే కాకుండా అనేక ఇతర దేశాలకు వ్యాక్సీన్ల విషయంలో ఈ సంస్థ చాలా కీలకం.