శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:27 IST)

న్యూడ్ బీచ్‌‌లో గ్రూప్ సెక్స్ పార్టీలు, ఫ్రాన్స్‌లో కరోనా వ్యాప్తికి కొత్త కేంద్రాలు

యూరప్‌లోని క్యాప్ డీఎగ్డే - నగ్నంగా ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి, గ్రూప్ సెక్స్ మీద ఆసక్తి ఉన్నవారికి ప్రియమైన వేసవి విహారయాత్రా స్థలం. అయితే, ఈ ఏడాది కరోనావైరస్ మహమ్మారి వారి సరదాలకు అడ్డుకట్ట వేసింది. క్యాప్ డీ ఎగ్డే, ఫ్రాన్స్ దక్షిణ ప్రాంతంలో ఉన్న కోస్తా ప్రాంతం. ఇదొక న్యూడ్ బీచ్. ఇక్కడ హెడోనిజంకు ప్రాధాన్యతనిస్తారు. హెడోనిజం అంటే శరీర సుఖాలకు ప్రాధాన్యతనివ్వడం, అదే జీవిత పరమార్థమని నమ్మడం.

 
ఇటీవలే ఫ్రాన్స్‌లో ఒక్కరోజులో 7,000 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో క్యాప్ డీఎగ్డేలో అధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడికొచ్చిన 800 మంది విహారయాత్రికులలో 30% మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. 'విలేజ్ నేచురిస్ట్' అని పిలిచే ఈ ప్రాంతం అనేక గ్రూప్ సెక్స్ క్లబ్బులు, శృంగారభరితమైన నైట్‌క్లబ్బులతో నిండి ఉంటుంది. శృంగార ప్రేమికులకు ఇదొక స్వర్గం. ఇక్కడ ఎక్కుమవంది నగ్నంగా తిరుగుతారు. సాధారణంగా మండు వేసవిలో ఇక్కడకు రోజుకు 45,000 మంది వస్తారని అంచనా.

 
ఇక్కడకు కోవిడ్-19 ఎలా వచ్చింది?
ఆగస్ట్‌లో ఇక్కడి ప్లష్ హోటల్‌లో ఇద్దరు ఉద్యోగులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఈ హోటెల్ డాబా మీద ఒక పెద్ద సెక్స్ పార్టీ జరిగిందని, అందులో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే పద్ధతులను పాటించలేదని హోటల్ యజమాని తెలిపారు. "మాకు రెట్టింపు దెబ్బ కొట్టింది. ఇక్కడకు వచ్చేవారిలో నలభై శాతం మంది విదేశీయులే. నెదర్ల్యాండ్స్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లండ్‌ల నుంచీ అధిక సంఖ్యలో సందర్శకులు వస్తారు" అని 'విలేజ్ నేచురిస్ట్' మేనేజర్ డేవిడ్ మసెలా తెలిపారు.

 
"అయితే, ఈ ఏడాది కోవిడ్-19 కారణంగా సాధారణంగా ఇక్కడకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినా కూడా వైరస్ వ్యాపించింది. తప్పించుకోవడం సాధ్యపడలేదు" అని మసెలా అన్నారు.

 
స్థానిక అధికారులు ఎలా స్పందించారు?
వెంటనే ఈ ప్రాంతంలో మొబైల్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసారు. క్యాప్ డీఎగ్డే చుట్టుపక్కల ప్రాంతాలకన్నా ఇక్కడ నాలుగు రెట్లు అధికంగా కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ ఎవరినీ ఆస్పత్రిలో చేర్చేంత అవసరం కలగలేదని అధికారులు తెలిపారు. అయితే, ఇక్కడ భౌతిక దూరం పాటించడం, ఇతర శుభ్రతా పద్ధతులు పాటించడం అసాధ్యం. అది ఈ ప్రాంతం లక్ష్యాలకే విరుద్ధం. "ఎంతో ఉల్లాసభరితంగా ఉండే ఈ ప్రాంతం, ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది" అని ఒక జంట విచారం వ్యక్తం చేశారు.

 
యువత వల్లే ప్రమాదం..
పెద్దవాళ్లు, వృద్ధులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఎక్కడకు వెళ్లాలి, ఎవరిని కలవాలి అనే విషయాలలో జాగ్రత్తగా ఉంటున్నారని…కానీ యువత విచ్చలవిడితనం ప్రదర్శిస్తోందని వారివల్లే కరోనావైరస్ వ్యాప్తి అధికమవుతోందని 60 యేళ్ల ఒక జంట తమ అభిప్రాయాన్ని తెలిపారు.

 
అనేక నైట్ క్లబ్బులు మూసేశారు.
ఒక్కసారిగా కోవిడ్-19 కేసులు బయటపడడంతో విలేజ్ నేచురిస్ట్‌లో అనేక నైట్‌క్లబ్బులు మూసివేశారు. "22 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. మా రిసార్ట్, పూల్ పార్టీలతో కళకళలాడుతూ ఉండేది. కానీ ఇంక ఇప్పుడు అవన్నీ కొనసాగించలేమని" వైకీ బీచ్ రిసార్ట్ యజమాని కరీం ఇసార్టెల్ అన్నారు. మరొక ప్రముఖ క్లబ్ లే గ్లామర్ కూడా "త్వరలో తెరుస్తాం" అని బోర్డు తగిలించి తమ రిసార్ట్‌ను మూసివేసింది.

 
ఇక్కడ సెక్సీ బట్టలను అమ్మే దుకాణం యజమాని పిలిప్ బ్యారూ ఈ పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేశారు. "ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో మేము ఒక ముఖ్య భాగం. మా దగ్గర 800 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 300 మందిని తొలగించాల్సి వచ్చింది. 80% వ్యాపారం దెబ్బతింది" అని పిలిప్ బ్యారూ తెలిపారు. అయితే ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గినా వచ్చినవారు మాత్రం శృంగార కార్యకలాపాలను విరివిగా కొనసాగిస్తున్నారు. మరింత అవయవ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ శృంగారాధన చేస్తున్నారు.

 
అయితే, ప్రస్తుతానికి విలేజ్ నేచురిస్ట్‌కు రావొద్దని, వారి సెలవుల ప్లానులను వాయిదా వేసుకోమని సందర్శకులకు ఇక్కడి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడనుంచీ తమ స్వస్థలాలకు తిరిగి వెళిపోతున్నవారందరినీ విధిగా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోమని కోరుతున్నారు.