గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (14:27 IST)

నిరూపితం కాని వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్ఓ

కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధిపై ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణంగా ఏళ్లు పట్టే వ్యాక్సిన్ తయారీ ప్రక్రియకు అనేక దేశాలు కొన్ని నెలల వ్యవధిలోనే ముగించేందుకు తహతహలాడుతున్నాయి. అయితే ఈ తరహా ధోరణులను ప్రపంచ రోగ్య సంస్థ తప్పుబట్టింది. నిరూపితం కాని వ్యాక్సిన్‌లతో ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య సామినాథన్ పేర్కొన్నారు.
 
హడావుడిగా వ్యాక్సిన్ ప్రయోగాలకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాదాలున్నాయని భవిష్యత్తులో ఇక క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉండదని, పూర్తిస్థాయి అధ్యయనానికి నోచుకోని వ్యాక్సిన్ పనితీరు కూడా అరకొరగానే ఉండొచ్చునని స్పష్టం చేశారు. తద్వారా ఈ వ్యాక్సిన్ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించక పోగా, ఆ వైరస్ పెరుగుదలకు దోహదపడుతుందని హెచ్చరించారు.
 
వ్యాక్సిన్ సమర్థమైనదని దాని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ద్వారానే నిరూపితమవుతుందని, ఇది ప్రపంచ ప్రామాణికమని తెలిపారు. అమెరికాలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి త్వరలో మంజూరు చేస్తామని అమెరికా ఎఫ్‌డిఏ పేర్కొన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ విధంగా స్పందించింది.