గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 4 అక్టోబరు 2024 (22:50 IST)

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

pawan kalyan
తిరుపతి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో ‘‘జంతువుల కొవ్వు’’ కలిపారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పెద్ద వివాదమే నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పందిస్తున్న తీరు చర్చనీయంగా మారింది. కాషాయ దుస్తులు ధరించి పవన్ కల్యాణ్ చేస్తున్న ‘హిందూత్వ వ్యాఖ్యలు’ వెనుక మతలబు ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. తిరుపతి లడ్డూ వివాదంలో టీడీపీ, బీజేపీల స్పందన.. జనసేన అధినేత స్పందనలకు మధ్య తేడా కనిపిస్తోంది.
 
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, దేవాలయాలను శుద్ధి చేయడం వరకు మాత్రమే పవన్ కల్యాణ్ పరిమితం కాలేదు. సాధారణంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఎత్తుకునే ‘‘సనాతన ధర్మ పరిరక్షణ’’ నినాదాన్ని ఆయన తీసుకున్నారు. ప్రాంతీయ పార్టీలకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ తీరు కాస్త కొత్తదే. విజయవాడ కనక దుర్గమ్మ గుడి మెట్లు కడిగిన సమయంలో పవన్ కల్యాణ్ సనాతన ధర్మం మీద గట్టిగా మాట్లాడారు. ఇక తిరుమలలో దీక్ష విరమించిన అక్టోబర్ 3వ తేదీన వారాహిసభలో ‘‘సనాతన ధర్మం పరిరక్షణ’’ కోసమంటూ ఆయన స్వరాన్ని మరింత పెంచారు. ఎంతో ఆవేశంగా ప్రసంగిస్తూ తనను తాను ‘‘సనాతన హిందువు’’గా పవన్ కల్యాణ్ చాటుకున్నారు.
 
‘‘సనాతన ధర్మ పరిరక్షణ’’ కోసం ప్రాణాలు సైతం ఇస్తానని ప్రకటించారు. ఆవేశపూరిత ప్రసంగాలు పవన్ కల్యాణ్‌కు కొత్త కాదు. అయితే పదేళ్ల కిందట పార్టీ పెట్టినప్పుడు పవన్ స్వరానికి నేటికీ చాలా తేడా ఉంది. ఒకనాటి చేగవేరా స్మరణకు నేటి ‘‘సనాతన ధర్మం అజెండా’’కు మధ్య పవన్ కల్యాణ్‌లో ఎన్నో రకాల షేడ్స్ కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
 
బీజేపీ రోడ్ మ్యాప్‌తో..
‘‘హిందూత్వ అజెండా’’తో పవన్ చూపిస్తున్న దూకుడు.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే నినాదం వెనుక బీజేపీ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2022లో ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘‘బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఇప్పుడు ఆ ‘‘రోడ్ మ్యాప్ వచ్చేసింది’’ అని పొలిటికల్‌ అనలిస్ట్ కంచన లలిత్‌ కుమార్‌ అన్నారు. బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే పవన్ కల్యాణ్ వ్యవహార శైలిని చూడొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
‘‘సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్‌ చేస్తున్న వాఖ్యలు, బీజేపీ రోడ్‌ మ్యాప్‌లో భాగమే. ఉత్తరాదిలో యోగి ఆదిత్య నాథ్‌ తరహాలో దక్షిణ భారత దేశంలో హిందూ సమాజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పవన్‌ కల్యాణ్‌ను ఎలివేట్‌ చేయాలనేది బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది’’ అని లలిత్ కుమార్ అన్నారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం పెంచుకునేందుకు కాపులతో బీజేపీ ప్రయోగం చేసింది. కానీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు.
 
‘‘టీడీపీ, వైఎస్సార్‌సీపీలు రెండు ప్రధాన సామాజికవర్గాలకు చెందిన పార్టీలుగా కనిపిస్తున్నాయి. దాంతో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండే కాపులను చేరదీసి బలం పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. ఆ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులను పార్టీ అధ్యక్షులుగా గతంలో నియమించింది. కానీ ఆశించినంత ప్రయోజనం కనిపించలేదు. ఆ తరువాత పవన్‌ కల్యాణ్‌ కలవడంతో బీజేపీకి ఆయుధం దొరికింది. సినీనటుడిగా పవన్‌కున్న క్రేజ్‌ను వాడుకుని హిందూత్వ అజెండాతో ముందుకు వెళ్లాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పుడు తిరుపతి లడ్డూ వివాదం అందుకు రాజమార్గంలా ఉపయోగపడింది. చంద్రబాబు వ్యూహాత్మకంగా లడ్డూ వివాదాన్ని ఎత్తుకున్నారా? లేక అది కూటమి వ్యూహమా? అనేది తెలియదు. కానీ చంద్రబాబు కంటే పవన్‌ కల్యాణ్‌ ఈ ఎపిసోడ్‌లో బాగా హైలెట్‌ అయ్యారు’’ అని లలిత్‌ కుమార్‌ వివరించారు.
 
బీజేపీ వ్యూహంలో భాగంగానే వస్త్రధారణ సహా పూర్తిస్థాయిలో పవన్‌ రూపాంతరం చెందారని, రానున్న కాలంలో దక్షిణాదిలో ‘‘హిందుత్వానికి’’ ఐకాన్‌గా పవన్ మారతారని ఆయన అభిప్రాయపడ్డారు.
 
‘‘ఆయనకు ఏ అజెండా లేదు’’
'ఈ పదేళ్ల కాలంలో పవన్ కల్యాణ్ వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. మద్దతు ఇచ్చారు. ఆయనకు ఒక స్పష్టమైన సిద్ధాంతం లేదు' అనేది విమర్శకుల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ‘‘మొదటి నుంచి పవన్‌కు ఏ అజెండా లేదు. సినిమాటిక్‌ వ్యూహాలతో ముందుకు వెళ్లారు. చేగవేరా అభ్యుదయ భావాల పేరిట జనసేన పార్టీ పెట్టిన ఆయన 2014లో నరేంద్ర మోదీతో జట్టు కట్టారు. 2019లో బీజేపీని విభేదించి కమ్యూనిస్టులు, బీఎస్పీతో జతకట్టారు. 2024లో టీడీపీని, బీజేపీని కలిపారు’’ అని సీనియర్‌ జర్నలిస్టు గాలి నాగరాజ బీబీసీతో అన్నారు.
 
‘‘గత ప్రభుత్వ హయాంలో విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయమయ్యాయి. రామతీర్థంలో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతర్వేదిలో రథం కాలిపోయింది. అప్పట్లో పవన్‌ కల్యాణ్‌ ఇంత హడావుడి చేయలేదు’’ అని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణంరాజు అన్నారు.
 
‘‘బీజేపీకి మాత్రమే ఉపయోగం’’
పవన్ కల్యాణ్ ఎత్తుకున్న ‘హిందూత్వ’ అజెండా వల్ల బీజేపీకి మాత్రమే లాభమని రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌ కృష్ణాంజనేయులు అన్నారు. ‘‘సనాతన ధర్మం పేరిట పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న హిందూత్వ అజెండా ఆయనకు దీర్ఘకాలిక రాజకీయాల్లో ఉపయోగపదు. బీజేపీకి మాత్రం ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు ఎన్నడూ సనాతన ధర్మం గురించి మాట్లాడని పవన్‌ ఇప్పుడు మాట్లాడితే హిందువులు ఆయన్ను అంగీకరించరు’’ అని కృష్ణాంజనేయులు అన్నారు. అయితే ఈ రాజకీయాలతో టీడీపీకీ నష్టం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
‘‘పవన్‌ హిందూత్వ రాజకీయాల వల్ల కూటమిలోని టీడీపీకే నష్టం కలుగుతుంది. హిందువుల ముందు వైఎస్ జగన్‌ను విలన్‌గా నిలబెట్టేందుకు చంద్రబాబు తిరుపతి లడ్డూ వివాదం ఎత్తుకున్నారు. కానీ బీజేపీ రంగప్రవేశం చేసి లడ్డూకు సంబంధం లేని సనాతన ధర్మం నినాదాన్ని పవన్‌ కల్యాణ్‌ ఎత్తుకునేలా చేసింది. ఇది చంద్రబాబుకు మింగుడపడని విషయం. పవన్‌ తీసుకున్న మత రాజకీయం అజెండా ముదిరితే కూటమిలో ఏమైనా జరగొచ్చు’’ అని కృష్ణాంజనేయులు అన్నారు.
 
మా రూట్ మ్యాప్ కాదు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
పవన్‌ కల్యాణ్‌ ఎత్తుకున్న ‘‘సనాతన ధర్మ పరిరక్షణ’’ నినాదం వెనుక బీజేపీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. ‘‘అది బీజేపీ అజెండా కాదు. ప్రతి హిందువు అజెండా. పవన్‌ పోరాటాన్ని యావత్‌ హిందూ సమాజం మెచ్చుకుంటోంది. నిజంగా ఆయన ధైర్యానికి హాట్సాఫ్‌. వారాహి డిక్లరేషన్‌ను స్వాగతించాలి. క్రైస్తవులు, ముస్లింలు వారి మతాల గురించి, వారి హక్కుల గురించి మాట్లాడితే ఎవరూ విమర్శించరు. కానీ హిందువు తన మతం గురించి మాట్లాడి దేవుళ్లపై భక్తిభావం ప్రదర్శిస్తే మత వాదిగా ముద్ర వేస్తున్నారు. ఈ తీరునే పవన్‌ గట్టిగా ప్రశ్నిస్తున్నారు’’ అని మాధవ్‌ చెప్పుకొచ్చారు.
 
బీజేపీ ఇచ్చిన రూట్‌ మ్యాప్‌లో భాగంగా పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మ పరిరక్షణ వాదాన్ని ఎత్తుకోలేదని జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ బీబీసీతో అన్నారు. ‘‘అది ఆయనకు దేవుడిచ్చిన రూట్‌ మ్యాప్‌. భగవంతుడి ఆశీస్సులతోనే ఆయన ఈ ప్రయాణం సాగుతోంది’’ అని ఆయన చెప్పారు. ‘‘పవన్‌లో వామపక్ష భావజాలం, దళిత బహుజన వాదం ఇప్పటికీ ఉన్నాయి. అలాగే చేగవేరా స్ఫూర్తినీ వీడలేదు. ధర్మం కోసం ఇపుడు చేస్తున్న పోరాటంలోనూ చేగవేరా స్ఫూర్తే ఉంది. హిందూత్వ అజెండాతో ముందుకి వెళ్తున్న ఆయన క్రైస్తవులకు, ముస్లింలకు ఇబ్బంది వచ్చినా అదేవిధంగా పోరాడతానని చెబుతున్నారు. అందుకే ఏ వర్గంలోనూ ఆయన మాటలపై వ్యతిరేకత రాలేదు’’ అని బొలిశెట్టి అన్నారు.
 
జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ మాత్రం పవన్ కల్యాణ్ ‘హిందూత్వ’ అజెండా మీద మౌనంగా ఉంటోంది. ‘‘పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మ పరిరక్షణ నినాదం, వారాహి డిక్లరేషన్‌ మీద మేం ఏమీ మాట్లాడబోం. అది జనసేన పార్టీ విధానం’’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.పట్టాభి బీబీసీతో అన్నారు. రాజకీయాలను, మతాన్ని కలపడం మంచిది కాదని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సూచించారు.
 
’’పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా మాట్లాడను కానీ.. నా ఈ మాటలు నాతో సహా ఎవరికైనా వర్తిస్తాయి. రాజకీయాల్లోకి మతాలను జొప్పించకూడదు. సనాతన ధర్మ పరిరక్షణ పేరిట రాజకీయాలొద్దు. దాని పరిరక్షణకే కట్టుబడి ఉంటే రాజకీయాలు వదిలేయాలి’’ అని నాగేశ్వర్‌ అన్నారు. ‘‘మతం, రాజకీయం కలిస్తే ఎక్కడైనా విధ్వంసమే జరుగుతుంది. ఏ దేశంలోనైనా అంతే. దేవుళ్లను, సనాతన ధర్మాన్ని రాజకీయాల్లోకి లాగకండి. ప్రత్యేక హోదా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వంటి వాటి చుట్టూ రాజకీయాలు తిరగాలి’’ అని అన్నారు.