సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (16:55 IST)

కొన్ని కూరగాయలు, ఆకు కూరలు అంటే మీకు అయిష్టమా... ఎందుకు.. కారణమేంటి?

కొన్ని కూరగాయలు తినాలంటే మీకు వెగటుగా ఉంటుందా? అందుకు మీ జీన్స్ - జన్యువులు - కారణం కావచ్చు అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అయిష్టమైన రుచికి సంబంధించిన ఒక జన్యువుకు సంబంధించిన రెండు కాపీలు మీకు వారసత్వంగా వచ్చాయంటే.. బ్రకోలి, మొలకెత్తిన గింజలు వంటి ఆహారం పట్ల మీ విముఖత చాలా ఎక్కువగా ఉంటుందని కొత్తగా నిర్వహించిన పరిశోధనలో గుర్తించారు. 
 
కొందరు వ్యక్తులు తమ ఆహారంలో తగినంతగా కూరగాయలను తీసుకోకపోవటానికి కారణమేమిటనేది ఇది వివరిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ జన్యువు వల్ల.. బీరు, కాఫీ, డార్క్ చాకొలెట్ల రుచి కూడా వెగటుగా అనిపించవచ్చు. జీవపరిణామ పరిభాషలో చెప్తే.. చేదు రుచి పట్ల విముఖత అనేది లాభదాయకం కావచ్చు. అది విషపూరిత పదార్థాలను తినకుండా రక్షణ కల్పిస్తుంది.
 
అయితే.. రోజుకు కనీసం ఐదు తాజా పండ్లు లేదా కూరగాయలు తినాలన్న సిఫారసు ప్రకారం ఆహారం తీసుకోకుండా కూడా కొంత మందిని ఈ జన్యువు నివారిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ జెన్నిఫర్ స్మిత్, ఆమె సహచరులు వివరించారు. 
 
ప్రతి ఒక్కరికీ టీఏఎస్2ఆర్38 అనే రుచి జన్యువు రెండు కాపీలు వారసత్వంగా వస్తాయి. మన నాలుక మీద చేదు రుచి తెలిసేలా చేసే రుచి గ్రాహకాల మాంసకృత్తుల కోడ్‌ ఈ జన్యువుతో ఉంటుంది. టీఏఎస్2ఆర్38 జన్యువులో ఏవీఐ అనే రకం జన్యువు రెండు కాపీలు వారసత్వంగా వచ్చిన వారికి.. కొన్ని రకాల రసాయనాల చేదు రుచి పెద్దగా తెలియదు. 
 
అయితే.. ఏవీఐ రకం జన్యువు కాపీ ఒకటి, పీఏవీ రకం జన్యువు కాపీ ఒకటి వారసత్వంగా వచ్చిన వారికి.. ఈ రసాయనాల చేదు రుచి తెలుస్తుంది. కానీ.. రెండు కాపీలూ పీఏవీ రకానివే ఉన్నట్లయితే.. అదే ఆహారం వారికి చాలా చాలా చేదుగా అనిపిస్తుంది. ఈ పీఏవీ జన్యువులను 'సూపర్ టేస్టర్లు' అంటారు. శాస్త్రవేత్తలు 175 మందిని అధ్యయనం చేశారు. పీఏవీ రకం జన్యువు రెండు కాపీలు ఉన్న వారు.. గుండెకు మంచివైన ఆకుకూరలను చాలా తక్కువగా తిన్నట్లు గుర్తించారు.
 
ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో డాక్టర్ స్మిత్ మాట్లాడుతూ.. ''మీ రోగులు పోషకాహార మార్గదర్శకాలను పాటించాలని మీరు నిజంగా కోరుకునేట్లయితే.. వారి రుచి తీరు ఎలా ఉంటుందనేది కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది'' అని వైద్యులకు సూచించారు.
 
కొన్ని రకాల ఆహారాల పట్ల ఇలా విముఖత గల వారికోసం.. ఇటువంటి కూరగాయలు, ఆకు కూరల చేదు రుచిని మరుగుపరచి, రుచికరంగా అనిపించేలా చేయటానికి మసాలా దినుసులను ఉపయోగించటం వల్ల ఉపయోగం ఉంటుందా అనేదానిపై పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.