శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (10:16 IST)

యువతకు గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే...

ఈ హైటెక్ ప్రపంచంలో గుండె జబ్బులు అనేవి కామన్ అయిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరిగిపోయింది. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. అయితే గుండెపోటులు, గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. 
 
దీని కారణంగా గుండెకు రక్తం సరిగ్గా సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్స్ రాకుండా, ఇతర గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కింద సూచించిన విధంగా పలు ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
* చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి  కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.
 
* ప్రతి రోజూ గుప్పెడు జీడిపప్పు, బాదం, పిస్తాపప్పులను తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రక్తనాళాలు వాపుకు గురి కాకుండా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. 
 
* ఓట్స్‌లో ఉండే ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ నుంచి తయారయ్యే ప్రమాదకర బైల్ యాసిడ్స్‌ను శరీరం నుంచి బయటకు పంపుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఓట్స్‌ను తరచూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. 
 
* అవిసె గింజల్లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫైబర్, ఫైటోఈస్టోజెన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షస్తాయి. రోజూ అవిసె గింజలను నీటిలో నానబెట్టుకుని లేదా పొడి చేసుకుని తినడం వలన గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. 
 
* రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించిడంలో పెసలు అమోఘమైన పాత్రను పోషిస్తాయి. నిత్యం పెసలను నానబెట్టుకుని, మొలకెత్తించి లేదా ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తింటుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. 
 
* ప్రతి రోజూ  ప‌ర‌గ‌డుపున రెండు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను న‌లిపి అలాగే తినేయాలి. అవి ఘాటుగా ఉన్నాయ‌నుకుంటే తేనెతో క‌లిపి తిన‌వ‌చ్చు. నిత్యం వెల్లుల్లిని తీంటే ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ త‌గ్గించి గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.