ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2019 (21:23 IST)

ఐసిస్: 'ఇరాక్‌లో మళ్లీ బలపడుతున్న మిలిటెంట్లు'

ఇరాక్‌లో రెండేళ్ల కిందట తన చివరి భూభాగాన్ని కోల్పోయిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపు ఇప్పుడు మళ్లీ వ్యవస్థీకృతమవుతోందని చెప్పటానికి ఆధారాలు పెరుగుతున్నాయి. ఇరాక్‌లో ఐసిస్ ఒక అధునాతన విద్రోహ సంస్థ అని.. ఐసిస్ దాడులు పెరుగుతున్నాయని కుర్దు, పశ్చిమ నిఘా అధికారులు బీబీసీకి చెప్పారు.

 
ఈ మిలిటెంట్లు ఇప్పుడు మరింత నైపుణ్యం సంతరించుకున్నారని.. అల్-ఖైదా కన్నా మరింత ప్రమాదకరంగా రూపొందారని.. కుర్దు ఉగ్రవాద వ్యతిరేక ఉన్నతాధికారి లాహూర్ తాలాబనీ పేర్కొన్నారు. ''ఇప్పుడు వారికి మెరుగైన ఎత్తుగడలు, వ్యూహాలు ఉన్నాయి. చాలా అధికంగా డబ్బులు సమకూరాయి. వాహనాలు, ఆయుధాలు, ఆహారం, సరఫరాలు, పరికరాలు కొనగలుగుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో కూడా మరింత నైపుణ్యం పొందారు. వారిని ఏరివేయటం ఇంకా ఎక్కువ కష్టం. ఒకరకంగా మాదకద్రవ్యాలతో ఉత్తేజం పొందిన అల్-ఖైదా లాగా తయారయ్యారని చెప్పొచ్చు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

 
ఆయన తన కచ్చితమైన అంచనాను లండన్ మాండలికంలో వివరించారు. ఆయన కుటుంబం సద్దాం హుస్సేన్ హయాంలో ఇరాక్ నుంచి పారిపోయి ఏళ్ల తరబడి బ్రిటన్‌లో తలదాచుకుంటోంది. ఆయన ఇరాకీ కుర్దిస్తాన్‌కు చెందిన రెండు నిఘా సంస్థల్లో ఒకటైన జాన్యారీ ఏజెన్సీ అధిపతి. కలీఫా శిథిలాల నుంచి గత 12 నెలలుగా పునర్నిర్మితమవుతున్న ఆ సంస్థ గురించి.. ఉత్తర ఇరాక్‌లోని కుర్దిస్తాన్ పర్వత ప్రాంతంలో గల సులైమానియాలో తన స్థావరంలో ఆయన వివరించారు.

 
''ఆ సంస్థ కార్యకలాపాలు ఇప్పుడు పెరుగుతుండటం మేం చూస్తున్నాం. పునర్నిర్మాణ దశ పూర్తయినట్లు భావిస్తున్నాం'' అని పేర్కొన్నారు. ఒక విభిన్న తరహా ఐసిస్ ఆవిర్భవించిందని ఆయన అంటారు. దాడులకు లక్ష్యంగా ఉండకుండా చూసుకోవటంలో భాగంగా.. ఇప్పుడిక ఏదో ఒక ప్రాంతాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని ఐసిస్ భావించటం లేదని చెప్పారు. తన పూర్వపు సంస్థ అల్-ఖైదా తీవ్రవాదుల తరహాలో.. ఐసిస్ తీవ్రవాదులు కూడా హమారిన్ పర్వతాల్లో రహస్యంగా తలదాచుకుంటున్నారని తెలిపారు.

 
''ఇప్పుడిది ఐసిస్‌కు కేంద్రంగా ఉంది. అది ఓ సుదీర్ఘ పర్వత శ్రేణి. దానిని నియంత్రించటం ఇరాక్ సైన్యానికి చాలా కష్టం. అక్కడ చాలా రహస్య స్థావరాలు, గుహలు ఉన్నాయి'' అని తాలాబానీ వివరించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ప్రస్తుతం నెలకొన్న అశాంతి ఐసిస్‌ను పెంచి పోషిస్తుందని.. దేశంలో మైనారిటీలుగా ఉన్న వారి సహచర సున్నీ ముస్లింలలో పరాయీకరణ భావనను అది వినియోగించుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఇరాక్‌లో ఇది చాలా ప్రముఖమైన, ప్రాణాంతకమైన పోకడ. ''రాజకీయ అశాంతి ఉంటే.. అది ఐసిస్‌కు స్వర్గంలా మారుతుంది'' అని ఆయన అభివర్ణించారు.

 
పెరుగుతున్న శ్రేణులు
2017లో కుర్దు స్వాతంత్ర్య ప్రజాభిప్రాయసేకరణ అనంతరం ఇరాక్ పాలకులకు, కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వానికి మధ్య దెబ్బతిన్న సంబంధాల వల్ల కూడా ఐసిస్ తీవ్రవాదులు లాభపడుతున్నారు. ఉత్తర ఇరాక్‌లో కుర్దు పెష్మెర్గా భద్రతా దళాలు - ఇరాక్ సైనిక బలగాలకు మధ్య ఇప్పుడు విస్తారమైన నిస్సైనిక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని పహారా కాస్తున్న ఏకైక శక్తి ఐసిస్ అని తాలాబానీ చెప్తున్నారు.

 
గ్వేర్ పట్టణ సమీపంలోని ఓ పర్వత శిఖరం మీద గల ఇసుక బస్తాల సైనిక ఔట్‌పోస్టు దగ్గరి నుంచి.. కుర్దు పేష్మెర్గా కమాండర్ మేజర్ జనరల్ సిర్వాన్ బార్జాని ఈ నిస్సైనిక మండలిని వీక్షిస్తున్నారు. ఆయన హావభావాల్లో ఆందోళన కనిపిస్తోంది. ఏ సైన్యం నియంత్రణలో లేని ఈ భారీ ప్రాంతం మీద ఇప్పుడు ఐసిస్ పట్టు బిగించిందని ఆయన చెప్తున్నారు.

 
''గ్రేట్ జాబ్ - టైగ్రిస్ నదుల మధ్య గల డెల్టాలో వాళ్లు శాశ్వతంగా ఉన్నారని మేం చెప్పగలం. టైగ్రిస్ నది సమీపంలో ఉన్న ప్రాంతంలో ఐసిస్ కార్యకలాపాలు చాలా అధికంగా ఉన్నాయి. ఐసిస్ కదలికలను, కార్యకలాపాలను మేం ప్రతి రోజూ చూడగలుగుతున్నాం'' అని ఆయన తెలిపారు. పేష్మెర్గా నిఘా నివేదికల ప్రకారం.. సిరియా సరిహద్దు దాటి వచ్చిన సుమారు 100 మంది ఫైటర్లతో ఐసిస్ శ్రేణులు ఇటీవల బలోపేతమయ్యాయి. వారిలో ఆత్మాహుతి బెల్టులు ధరించిన విదేశీయులు కూడా కొందరు ఉన్నారు.

 
ఈ గ్వేర్ పర్వత శిఖరం నుంచే పేష్మెర్గా 2014 ఆగస్టులో ఐసిస్ మీద తన తొలి దాడిని ప్రారంభించింది. చరిత్ర పునరావృతమవుతోందని ఈ మేజర్ జనరల్, ఇక్కడున్న ఇతరులు చెప్తున్నారు. ''వాళ్లు 2012లో మొదలయ్యారు. అప్పటి నుంచి తమకు తాముగా వ్యవస్థీకృతమవుతూ, జనం నుంచి పన్నులు వసూలు చేయడం ప్రారంభించారు. అలాంటి, 2012 సంవత్సరంతో 2019 సంవత్సరాన్ని సరిపోల్చగలను. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2020 సంవత్సరంలో వారు మరింతగా వ్యవస్థీకృతమవుతారు. మరింత శక్తిమంతంగా తయారవుతారు. మరిన్ని దాడులు చేస్తారు'' అని కమాండర్ బార్జాని పేర్కొన్నారు.

 
అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందాల్సిన అవసరముందని లాహుర్ తాలాబానీ వ్యాఖ్యానించారు. ''వీళ్లు ఇక్కడ ఎంత సౌకర్యవంతంగా స్థిరపడటం మొదలైతే.. ఇరాక్, సిరియా వెలుపల ఆపరేషన్ల గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తారు'' అని చెప్పారు.

 
ఒత్తిడిని కొనసాగించటం...
ఐసిస్ పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తోందని.. కానీ ఈసారి ఇరాక్, కుర్దు భద్రతా బలగాల నుంచి విభిన్నమైన ప్రతిస్పందనను ఎదుర్కొంటోందని ఇరాక్‌లో ఉన్న అమెరికా సైన్యం టాస్క్ ఫోర్స్ ఇరాక్ ఉన్నత స్థాయి కమాండర్ బ్రిగేడియర్ జనరల్ విలియం సీలీ చెప్తున్నారు. ఐసిస్ 2014లో ఇరాక్‌లోని మూడో వంతు భూభాగాన్ని నియంత్రణలోకి తెచ్చుకుని, రెండో అతి పెద్ద నగరం మోసుల్‌ని పెద్దగా ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకున్నప్పటికన్నా.. ఇప్పుడు ఈ సైనిక బలగాలు మరింత సన్నద్ధతతో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

 
''ఇప్పటి ఇరాక్ భద్రతా బలగాలు, పేష్మెర్గా బలగాలు.. మోసుల్ కూలిపోయినప్పుడు ఉన్న బలగాలు ఒకటి కావు. మేం చాలా కాలంగా ఇక్కడ ఉండి వారికి శిక్షణనిస్తున్నాం. ఐసిస్ మీద ఒత్తిడి స్థిరంగా కొనసాగేలా ఇరాక్ సైనిక బలగాలు తమ పని చేస్తున్నాయి'' అని వివరించారు విలియం. అక్టోబర్ మధ్య నుంచి నవంబర్ మధ్య కాలంలో - ఒక నెలలో ఇరాక్ భద్రతా బలగాలు 170 'క్లియరెన్స్ ఆపరేషన్లు' చేపట్టి.. దాదాపు 1,700 అధునాతన పేలుడు పదార్థాలను ధ్వంసం చేశాయని ఆయన ఉదహరించారు.

 
ఐసిస్ ఫైటర్లు ఇప్పుడు గుహల్లో, ఎడారిలో దాక్కుంటున్నారని.. ఆ పరిస్థితులను ఎవరూ ఎక్కువ కాలం తట్టుకోలేరని.. వారు పెద్ద సంఖ్యలో కలిసి కదలలేరని బ్రిగేడియర్ జనరల్ పేర్కొన్నారు. ''నేను ఇక్కడ ఉన్న ఆరు నెలల్లో చూసిన అతి పెద్ద బృందం 15 మంది'' అని చెప్పారు. అయితే.. ఒక్క ఐసిస్ ఫైటర్ అయినా చాలా మందితో సమానమని ఆయన వ్యాఖ్యానించారు.

 
ప్రస్తుతానికి ఐసిస్ తీవ్రవాదులు చీకటికి పరిమితమవుతున్నారు. రాత్రిపూట బయటకు వచ్చి దాడిచేసి పారిపోతున్నారు. కానీ.. గతంలో ఈ ఆరంభాల నుంచి ఉగ్రవాదం పెరగటం ఇరాక్ చవిచూసింది. ఇప్పుడు ఈ ప్రాంతానికి, పశ్చిమ ప్రపంచానికి ఒక కొత్త ప్రమాదం ముంచుకొస్తోందని కొందరు భావిస్తున్నారు.