గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (19:40 IST)

కేజ్రీవాల్: దిల్లీ పీఠాన్ని మూడోసారి గెల్చుకున్న ఆమ్ ఆద్మీ

దిల్లీకి మూడో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న అరవింద్ కేజ్రీవాల్ 1968లో హర్యానా రాష్ట్రంలో శివానీ అనే చిన్న పల్లెలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన కొంత కాలం కోల్‌కతాలో చదువుకున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి బీటెక్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన కేజ్రీవాల్, 1993లో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. సుమారు 13 ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్‌లో వివిధ స్థాయిల్లో పని చేశాక 2006లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.

 
2006లో రామన్ మెగసెసె అవార్డు
ఆ తరువాత అవినితిపై పోరాటంలో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. 2006లోనే ఆయనకు ప్రతిష్టాత్మ రామన్ మెగసెసె పురస్కారం కూడా లభించింది. ఆపై లోక్ పాల్ బిల్లుపై తన మార్గదర్శిగా భావించే అన్నా హజారేతో కలిసి పోరాటం చేశారు. కొంత కాలానికి ఆయనతో విభేదించి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2012లో తన మద్దతుదారులతో కలిసి అక్టోబర్లో ఆమ్ ఆద్మీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు.

 
2013లో కాంగ్రెస్‌ సహకారంతో ఆప్ ప్రభుత్వ ఏర్పాటు
అప్పట్లో ఆయన పార్టీ పెట్టడంపై అనేక విమర్శలు ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ ఎదుర్కొంటూనే 2013లో దిల్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై 20 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తొలిసారిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ ఎన్నికల్లో 28 స్థానాలు మాత్రమే దక్కాయి. అటు బీజేపీ 31 స్థానాలు సాధించి మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం అయిదు సీట్ల దూరంలో ఆగిపోయింది. దాంతో కాంగ్రెస్ మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2013 డిసెంబర్ 28న దిల్లీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు.

 
ఆప్- కాంగ్రెస్ పార్టీల బంధం ముణ్ణాళ్ల ముచ్చటయ్యింది
అయితే ఆప్- కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. లోక్ పాల్ బిల్లును ఆమోదించుకోవడంలో విఫలం కావడంతో 2014 ఫిబ్రవరిలో కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలా ఆమ్ ఆద్మీ 49 రోజుల పాలనకు తెరపడింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ బీజేపీ-నరేంద్రమోదీ హవాలో ఆమ్ ఆద్మీ నిలవలేకపోయింది. దాంతో, దారుణ ఫలితాలను చవి చూడాల్సి వచ్చింది.

 
అక్కడితో ఆమ్ ఆద్మీ పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. కానీ, కొద్ది నెలల్లోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. 2015 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఎన్నికల గుర్తు అయిన చీపురు అన్ని పార్టీలను ఊడ్చేసింది. అప్పటికే కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ దిల్లీ ఓటర్లు ఆశ్చర్యకరమైన ఫలితాల్నిచ్చారు. దీంతో మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఏకంగా 67 సీట్లు సాధించి ప్రత్యర్థుల్ని తన దరిదాపుల్లోకి కూడా రానీయలేదు.

 
దిల్లీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, దిల్లీలోని పార్లమెంట్ స్థానాలన్నింటిని కైవసం చేసుకోవడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నించింది. సాక్షాత్తు పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీ ఎన్నికల బాధత్యల్ని తన భుజాలపై వేసుకున్నారు. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో దిల్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ కనిపించింది.

 
ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆమ్ ఆద్మీ వైపే మొగ్గు
దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌ ఆమ్ ఆద్మీ వైపే మొగ్గు చూపాయి. నిజానికి ఎన్నికల ముందు జరిగిన సర్వేలు కూడా ఆమ్ ఆద్మీకే దిల్లీ జనం పట్టం గడతారని చెప్పినప్పటికీ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా అదే తరహా ఫలితాలు రావడంతో కేజ్రీవాల్ విజయం దాదాపు ఖాయమైపోయింది.

 
మంగళవారం వెల్లడైన ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్‌నే నిజం చేశాయి. గతంతో పోల్చితే ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ సీట్ల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ తిరుగులేని మెజార్టీ సాధించి తన ఆధిక్యాన్ని రుజువు చేసుకుంది. 70 సీట్లలో 63 స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. 2015 ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి కూడా రెండంకెలకు చేరుకోలేకపోయింది.

 
కేజ్రీవాల్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్
కొన్నేళ్లుగా రాజకీయ పార్టీలకు గెలుపు మంత్రంగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌నే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ నమ్ముకుంది. కేజ్రీవాల్ నమ్మకానికి తగ్గట్టుగానే ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఆమ్ ఆద్మీకి కలిసొచ్చాయి. గెలుపు వాకిట నిలబెట్టాయి. ఆమ్ ఆద్మీకి మరోసారి పట్టం కట్టడంపై ట్విటర్ ద్వారా దిల్లీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు ప్రశాంత్ కిశోర్.

 
ఉచిత పథకాలు, సంక్షేమమే కేజ్రీవాల్‌కు కలిసొచ్చాయా?
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత పథకాలే ఆమ్ ఆద్మీ విజయానికి కారమణమని చెబుతూ సీనియర్ పాత్రికేయులు ఎస్. వెంకట్ నారాయణ, "కేజ్రీవాల్ అయిదేళ్ల పాలనలో అమలైన సంక్షేమ పథకాలను చూసి సామాన్యులంతా ఆయన కోసం పని చేస్తున్నారని భావించారు. ఈ తాత్కాలిక ఆకర్షక పథకాల నుంచి ప్రభుత్వాలు బయటపడాల్సి ఉంది. అయితే, ఈసారి ఎన్నికల్లో ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తూ వస్తున్న ముస్లిం ఓటర్లు కేజ్రీవాల్‌ వైపే మొగ్గినట్లు కనిపిస్తోంది. ఎన్ఆర్సీ, సీఏఏల ప్రభావం కూడా ఈ ఎన్నికలపై పడింది" అని అన్నారు.

 
దిల్లీకి మాత్రమే పరిమితమైన ఆమ్ ఆద్మీ వైభవం
2015లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావించారు. అందుకోసం గట్టిగానే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే, 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, అకాళీదళ్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది. కానీ పోలింగ్ దగ్గర పడే కొద్దీ పరిస్థితి మారిపోయింది. చివరకు 20 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 
విమర్శల జడిలో కేజ్రీవాల్
లోక్ పాల్ కోసం అన్నా హజారేతో కలిసి ఉద్యమం చేసినప్పటి నుంచే కేజ్రీవాల్‌ బృందంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ప్రముఖ ఉద్యమ కారుడు యోగేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించేవారు. ఆ తరవాత ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించే సమయంలోనూ వారిదే కీ రోల్. అయితే, వారి స్నేహం ఎంతో కాలం కొనసాగలేదు. ముఖ్యంగా పార్టీపై పట్టు సాధించే క్రమంలో కేజ్రీవాల్ ఏక పక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌ ఇద్దరూ అనేక సార్లు ఆరోపణలు చేశారు. పార్టీలో వన్ మ్యాన్ షో జరుగుతోందన్నది వారు చేసిన ప్రధాన ఆరోపణ.

 
అదే సమయంలో వారిద్దరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కేజ్రీవాల్ మద్దతుదారులు కూడా ప్రత్యారోపణలకు దిగారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వారిద్దర్ని పార్టీలోని ముఖ్యమైన నిర్ణయాల తీసుకునే కమిటికి దూరం పెట్టారు. ఆపై వివాదం కాస్త ముదిరి చివరకు వారిద్దర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత వరకు వెళ్లింది. అలా 2015 ఏప్రిల్ నెలలో పార్టీ స్థాపించినప్పటి నుంచి అంటిపెట్టుకొని కీలక నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌ ఇద్దరూ నిష్క్రమించాల్సి వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విషయంలో వారిద్దరూ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనందువల్లే పార్టీ నుంచి తొలగించాల్సి వచ్చిందని అప్పట్లో కేజ్రీవాల్ చెప్పారు.