ఢిల్లీ ఎన్నికల ఫలితాలు : బీజేపీకి సింగిల్ డిజిట్ - ఆప్‌కు 63 - కాంగ్రెస్‌కు సున్నా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టారు. ఈ ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మరోమారు అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్... తాను అనుకున్నది చేతల్లో నిజం చేసి చూపించారు. ఫలితంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన తేరుకోలేని షాకిచ్చారు.
మొత్తం 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 63 సీట్లు కైవసం చేసుకోగా, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేవలం 7 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే, ఈ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సివుంది.
మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేసిన నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోసారి ఆప్ ప్రభుత్వం ఏర్పడనుంది. మరికొన్నిరోజుల్లో ఏడో అసెంబ్లీ కొలువు దీరనుంది.
అదేసమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పలు రాజకీయ ప్రముఖులు ఫోన్ కాల్స్, పోస్ట్స్ ద్వారా అభినందనలు తలిపారు. కేజ్రీవాల్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీని, సీఏఏ, ఎన్ ఆర్సీ, ఎన్పీఆర్ లను ప్రజలు తిరస్కరించారని, కేవలం అభివృద్ధి మాత్రమే విజయం తెచ్చిపెడుతుందని, ప్రజాస్వామ్యం గెలిచిందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.
అలాగే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ ఆప్‌కు, కేజ్రీవాల్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆప్ విజయం దేశంలోని ప్రజా అనుకూల ప్రభుత్వాలకు కొత్త ఒరవడి సృష్టించాలని ఆకాంక్షించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి కూడా కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. విద్వేష రాజకీయాలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, మతతత్వ రాజకీయాలను అభివృద్ధి తొక్కిపెడుతుందని చెప్పడానికి ఆప్ విజయమే నిదర్శనమని వారు తమతమ ట్వీట్లలో పేర్కొన్నారు.