శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 2 జూన్ 2022 (23:09 IST)

Pakistan: పాకిస్తాన్ దివాలా తీయనుందా? సౌదీ అరేబియా, దుబయి ఎందుకు అప్పు ఇవ్వట్లేదు?

పాకిస్తాన్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే త్వరలోనే దేశం ఎగవేతదారు (డీఫాల్టర్)గా మారుతుందని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. దివాలా దిశగా దేశం పయనిస్తోందని అన్నారు. పాకిస్తాన్‌పై విదేశీ రుణాలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించని వారిని ఎగవేతదారుగా పిలుస్తారు. ఒకసారి డీఫాల్టర్‌గా గుర్తింపు వస్తే ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో రేటింగ్ పడిపోతుంది. కొత్త రుణాలు పుట్టడం చాలా కష్టం అవుతుంది.

 
ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రైవేట్ న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ''ఈ సమయంలో సైన్యం సరైన నిర్ణయం తీసుకోకుంటే, ముందుగా నష్టపోయేది అదే. నేను దీన్ని రాసి ఇవ్వగలను. వారు వచ్చినప్పటి నుంచి రూపాయి విలువ పడిపోయింది. షేర్ మార్కెట్ కుదేలైంది. వస్తువుల ధరలు పెరిగాయి. డీఫాల్టర్‌గా మారే దిశగా పాకిస్తాన్ నడుస్తోంది'' అని అన్నారు.

 
''ఒకవేళ మనం డీఫాల్టర్‌ అయితే, మనం దివాలా దిశగా వెళ్తున్నామని అర్థం. ఇక్కడ అతిపెద్ద వ్యవస్థ పాకిస్తానీ ఆర్మీ. ముందుగా దానిపైనే ఈ ప్రభావం పడుతుంది. ఆర్మీ దెబ్బతింటే, యుక్రెయిన్‌కు జరిగినట్లే మనపై కూడా న్యూక్లియర్ ఆయుధాలను వదిలిపెట్టాలనే ఒత్తిడి వస్తుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రకటన చేసిన సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మూడు రోజుల టర్కీ పర్యటనలో ఉన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం గురించి షాబాజ్ ప్రకటన చేశారు. పాకిస్తాన్-టర్కీ బిజినెస్ కౌన్సిల్‌లో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని పెంచడానికి అన్ని రకాలు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 
ఇమ్రాన్ ఖాన్ ప్రకటన గురించి కూడా ఆయన ట్వీట్ ద్వారా స్పందించారు. ''నేను ఓవైపు టర్కీతో ఒప్పందాలు కుదుర్చుతున్నా. మరోవైపు ఇమ్రాన్ నియాజీ దేశానికి వ్యతిరేకంగా హెచ్చరికలు చేస్తున్నారు. దీన్ని బట్టే, బాధ్యతాయుతమైన ఏ పదవికీ నియాజీ అర్హుడు కాదనే విషయం అర్థం అవుతోంది. ఆయన తాజా ఇంటర్వ్యూతో ఇది స్పష్టం అయింది. మీరు మీ రాజకీయాలు చేసుకోండి. కానీ, మీ హద్దులు దాటకండి. పాకిస్తాన్‌ను ముక్కలు చేసే మాటలు మాట్లాడకండి'' అని షాబాజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 
ఆర్థిక మంత్రి ఏం చెప్పారు?
పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ కూడా దేశ బలహీన ఆర్థిక స్థితి గురించి వెల్లడించారు. పాకిస్తాన్‌కు రుణాలు ఇవ్వడానికి కొన్ని దేశాలు విముఖత వ్యక్తం చేశాయని ఆయన ఇటీవలే చెప్పారు. ''మేం సౌదీ అరేబియా, దుబయితో పాటు మరికొన్ని ఇతర దేశాలతో మాట్లాడాం. వారు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ, ముందుగా సహాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్-ఐఎంఎఫ్) వద్దకు వెళ్లాలని మాకు సూచించారు'' అని మిఫ్తా చెప్పారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దశలో ఈ దేశాలు పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వడానికి నిరాకరించాయి. డాలరుతో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ ఇప్పటివరకు అత్యంత కనిష్ఠ స్థాయి 200కి పడిపోయింది.

 
దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షాబాజ్ షరీఫ్ ఏప్రిల్ 11న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికి పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ వద్ద మిగిలిన ఉన్న నిల్వలు 10.5 బిలియన్ డాలర్లు (రూ. 81,414 కోట్లు) మాత్రమే. ఈ నిల్వలతో గరిష్టంగా ఏడు వారాల వరకు దిగుమతులు చేసుకోవచ్చు. అప్పుడు పాకిస్తాన్, డీఫాల్టర్‌గా మారడానికి 80 రోజుల దూరంలో ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ చివరి మధ్య పాకిస్తాన్ 4.9 బిలియన్ డాలర్లు (రూ. 37,995 కోట్లు) చెల్లించాల్సి ఉంది. ఈ సమయంలో పాకిస్తాన్ కరెంట్ ఖాతా లోటు 4 బిలియన్ డాలర్లు (రూ. 31,016 కోట్లు). ఇలాంటి పరిస్థితి తలెత్తడం పాకిస్తాన్ చరిత్రలోనే మొదటిసారి.

 
పాకిస్తాన్ డీఫాల్టర్‌గా మారుతుందనే భయాల మధ్య అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పాకిస్తాన్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన బాండ్లను అమ్ముతున్నారు. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3500 పాయింట్లు పడిపోయింది. షాబాజ్, పాక్ ప్రధాని అయిన 46 రోజుల తర్వాత అంటే మే 27న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడింది. పాకిస్తాన్ అంతర్జాతీయ బాండ్ల విలువ పెరగడంతో స్టాక్ ఎక్స్ఛేంజ్ 319 పాయింట్లు పెరిగింది. ఈ సమయంలో పాకిస్తాన్ రూపాయి విలువ కూడా రూ. 2.40 మేర బలపడింది.

 
కానీ, దీనికి ఒకరోజు ముందు మే 26న పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు 30 రూపాయలు పెంచింది. దీనివల్ల వాణిజ్య లోటు కొంత తగ్గింది. కానీ, కేవలం ఐఎంఎఫ్ మద్దతు కూడగట్టడం ద్వారానే పరిస్థితుల్లో మార్పులు రావని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌కు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, కొత్త యూరోబాండ్, సౌదీ అరేబియా, చైనాల నుంచి సహకారం అవసరం.