ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 15 మార్చి 2021 (12:07 IST)

పవన్ కల్యాణ్: 'తెలంగాణ బీజేపీ నేతలకు మా పార్టీ అంటే గౌరవం లేదు, అందుకే వాణీదేవికి మద్దతిచ్చాం': ప్రెస్ రివ్యూ

స్థానిక బీజేపీ నేతలకు తమ పార్టీ అన్నా, కార్యకర్తలన్నా గౌరవం లేదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ నర్సింహా రావు కుమార్తె వాణీదేవికి మద్దతిచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

 
''ఎన్నికల సమయంలో ఒక్క ఓటు ఉన్నా వారిని గౌరవిస్తాం. అలాంటిది లక్షల మంది ఉన్నా జనసేన కార్యకర్తలకు గౌరవం దక్కకపోవడం బాధాకరం. గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు'' అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నట్లు ఈ కథనం పేర్కొంది.

 
హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆదివారం పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పీవీ నర్సింహా రావు కూతురు వాణీదేవికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలంగాణ విభాగం తన దృష్టికి తీసుకొచ్చినపుడు వారి ఇష్టాలను గౌరవించానని చెప్పారు.

 
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని ప్రధాని మోదీ భరోసా ఇవ్వడంతో బీజేపీకి మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి తామన్నా, తమ పార్టీ అన్నా చాలా గౌరవమని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసైనికులు అండగా నిలబడిన విధానాన్ని చూసి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ప్రశంసించారని, కానీ స్థానిక బీజేపీ నాయకత్వం దానిని గుర్తించేందుకు సిద్ధంగా లేదని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించినట్లు ఈ కథనం వెల్లడించింది.

 
మరోవైపు జనసేన బీజేపీకి మద్దతివ్వకపోవడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఇబ్బందులుంటే రాష్ట్ర నాయకత్వానికిగానీ, కేంద్ర నాయకత్వానికి గానీ పవన్‌ చెప్పి ఉండాల్సిందని, కనీసం ఎన్నికల్లో తటస్థంగా ఉన్నా బాగుండేదని సంజయ్‌ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.