సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (21:16 IST)

క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు

Queen Elizabeth 2
కర్టెసి-ట్విట్టర్
1961 జనవరిలో క్వీన్ ఎలిజబెత్ 2, భారత్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా దిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు రోడ్లన్నీ లక్షలమంది జనంతో కిక్కిరిసిపోయాయి. "భారతీయులు ఈ వారం తమ కష్టాలను మరచిపోయారు. అంటే వాటిని పూర్తిగా మరచిపోయారని కాదు. క్వీన్ ఎలిజబెత్ 2 ఇక్కడికి వచ్చారు. ఆమెను చూడటం ద్వారా ప్రజలు కాసేపు వారి సమస్యలను మరిచిపోవాలనుకున్నారు. వారిలో ప్రధానంగా ఆర్థిక సమస్యలు, రాజకీయ ఇబ్బందులు, కమ్యూనిస్ట్ చైనా, కాంగో, లావోస్ గురించిన ఆందోళనలు తెరమరుగయ్యాయి'' అని ది న్యూయార్క్ టైమ్స్ రాసింది.

 
రైళ్లు, బస్సులు, ఎద్దుల బండ్లలో పెద్ద ఎత్తున ప్రజలు రాజధాని దిల్లీకి తరలివచ్చారని టైమ్స్ రాసింది. రాణిని చూడటానికి వచ్చిన ప్రజలు ఇక్కడ పచ్చిక బయళ్లలోనే నిలబడి రాజదంపతుల దర్శనం కోసం ఆసక్తిగా ఎదురు చూశారని పేర్కొంది. ''వారిని చూడటం ద్వారా తమ బాధలను మరిచిపోయి, ఉల్లాసంగా ఉండాలని భావించినట్లు కనిపించారు'' అని టైమ్స్ రాసింది. ''ఎలిజబెత్ 2 ఈ దేశానికి సామ్రాజ్ఞిగా రాలేదు. కాకపోతే, అంతకు సమానమైన హోదాలో వచ్చారు'' అని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటన్ రాజరికపు బాధ్యతలు తీసుకున్న తొలి వ్యక్తి క్వీన్ ఎలిజబెత్ 2.

 
మరోవైపు, బ్రిటిష్ పాలకులు వెళ్లిపోయిన తర్వాత మా పరిస్థితులు ఏమీ దిగజారలేదని ఆ దేశ పాలకులకు చూపించేందుకు ఈ పర్యటన భారతీయులకు ఒక అవకాశం కల్పించింది. కొత్త విమానాశ్రయాలు, కొత్త ఇళ్లు, ఆఫీస్ బిల్డింగ్‌లు, ఉక్కు కర్మాగారాలు, అణు రియాక్టర్లు లాంటివి ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. బ్రిటన్ రాజదంపతుల ఆరు వారాల ఈ పర్యటన, ఉపఖండం గురించి వారు మరింత తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది.

 
నాటి పర్యటన సందర్భంగా బ్రిటిష్ పాథే చిత్రించిన దృశ్యాలు, ప్రజలు వారిని ఎంతగా ఆదరించారన్న విషయాన్ని తెలుపుతాయి. నేటి ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాలతోపాటు చారిత్రక ప్రాంతాలైన తాజ్ మహల్, జైపూర్‌లోని పింక్ ప్యాలెస్, ప్రాచీన నగరం వారణాసి లాంటి ప్రదేశాలను రాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతీయ మహారాజాకు చెందిన వేట విడిదిలో రెండు రోజులు గడిపారు. ఏనుగుపై సవారీ చేశారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాలకు రాజదంపతులు ప్రధాన అతిధులుగా హాజరయ్యారు.

 
దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో వేలమంది ప్రజలను ఉద్దేశించి రాణి ప్రసంగించారు. తాజ్ మహాల్‌కు టాప్ లెస్ కారులో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తూ, మధ్యలో ప్రజలకు అభివాదాలు తెలిపారు. బ్రిటిష్ వారి సహకారంతో పశ్చిమబెంగాల్‌లో నిర్మించిన ఒక ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి, అక్కడి కార్మికులతో ఆమె మాట్లాడారు. కోల్‌కతాలో క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం నిర్మించిన ఒక స్మారక కేంద్రాన్ని క్వీన్ సందర్శించారు. ఆ నగరంలో జరిగే గుర్రపు పందేలను చూసి విజేతలకు బహుమతులను అందజేశారు.

 
కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్ నుంచి ఓపెన్ టాప్ జీప్‌లో ఆమె ప్రయాణం, ఆమె పట్ల భారత ప్రజలు చూపిన ఆదరణ, ఆలిండియా రేడియో ఉద్యోగి ఒకరు చేసిన కామెంట్‌ను యార్క్ షైర్ పోస్ట్ పత్రిక తన ఎడిటోరియల్ పేజీలో ఉటంకించింది. ''క్వీన్ ఎలిజబెత్ 2 భారత దేశానికి రాణి కాకపోవచ్చు. కానీ, లక్షలాది ప్రజల హృదయాల్లో ఆమె రాణిగానే ఉన్నారు'' అని ఆ ఉద్యోగి వ్యాఖ్యానించినట్లు ఎడిటోరియల్ రాసింది. 1983 నవంబర్‌లో రాజదంపతులు మరోసారి భారత్‌లో పర్యటించారు.

 
ఆ సమయంలో రాష్ట్రపతి భవన్‌లోని విజిటర్స్ సూట్‌లో రాజదంపతులు అతిథులుగా ఉన్నారని వెల్లడిస్తూ, వారి కోసం రాష్ట్రపతి భవన్‌లో అనేక మార్పులు చేర్పులు చేసినట్లు ఓ పత్రిక పేర్కొంది. భారతీయ శైలిలోని ఫర్నీచర్‌ను తొలగించి రాజకుటుంబపు ఫర్నీచర్‌ను అమర్చినట్లు ఆ పత్రిక పేర్కొంది. ''రాజదంపతుల కోసం పాతకాలపు ఫర్నీచర్‌ను తొలగించి కొత్తవి సిద్ధం చేశారు. బెడ్స్ మీద వేసే కవర్లు, దుప్పట్లు, తలగడలు మార్చేశారు. పూర్తిగా రాజరికపు శైలితో కూడిన వస్తువులతో సూట్‌ను అలంకరించారు'' అని ఆ పత్రిక రాసింది.

 
''రాణి గారి కోసం పాశ్చాత్య సంప్రదాయ వంటకాలను వడ్డించారు'' అని పేర్కొంది. 1997లో క్వీన్ ఎలిజబెత్ చివరిసారిగా భారత్‌ను సందర్శించారు. సరిగ్గా అప్పటికి భారత్, పాకిస్తాన్‌లు విడిపోయి 50 సంవత్సరాలు అయ్యింది. ప్రిన్సెన్ డయానా మరణం తర్వాత ఆమె పాల్గొన్న మొదటి బహిరంగ కార్యక్రమం ఇదే. ఈ పర్యటనలో కొన్ని వివాదాలు కూడా చెలరేగాయి. ఈ టూర్‌లో రాణి జలియన్ వాలా బాగ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జలియన్ వాలాబాగ్ ఘటన మృతులకు రాణి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌లు వినిపించాయి. అమృత్ సర్ పట్టణాన్ని సందర్శించడానికి ముందురోజు రాత్రి క్వీన్ ఎలిజబెత్ 2 దిల్లీలో ఓ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.

 
''చరిత్రలో కొన్ని బాధాకరమైన ఘటనలు జరిగాయి. అందులో రహస్యం ఏమీ లేదు. నేను రేపు పర్యటించబోయే జలియన్ వాలాబాగ్‌లో కూడా అలాంటి బాధాకరమైన ఘటనే జరిగింది. కానీ, గతించిన చరిత్రను మనం మార్చలేం. చరిత్రలో మంచీ చెడు రెండూ ఉంటాయి. చెడు నుంచి పాఠాలు నేర్చుకుని మంచిని నిర్మించే దిశగా అడుగులు వేయాలి '' అని రాణి అన్నారు. ఆమె నుంచి క్షమాపణలు ఆశిస్తున్న వారికి ఈ ప్రసంగం సంతృప్తినివ్వలేదు. కానీ, ఎయిర్ పోర్టు దగ్గర బాధిత కుటుంబ సభ్యులతో ప్రదర్శన నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

 
అంతే కాకుండా, అమృత్‌సర్ ఎయిర్ పోర్టు నుంచి వచ్చే మార్గంలో ప్రజలు రాణికి ఘనంగా స్వాగతం పలికారు. రాణికి చేతులు ఊపుతూ, జెండాలు చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు ఆమెను ఆహ్వానించారు. సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయంలోకి రాణి చెప్పులు విడిచి, కాళ్లకు సాక్సులతో ప్రవేశించడానికి అనుమతించారు. క్వీన్ పర్యటన సందర్భంగా రాజదంపతుల దుస్తుల మీద ఇండియన్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. 1983 నాటి పర్యటన సందర్భంగా ఈ చర్చ మరింత ఎక్కువగా జరిగిందని, రాణి వేసుకున్న ప్రతి డ్రెస్సు మీద ప్రజలు ఆసక్తి చూపించారని అప్పటి ఇండియా టుడే పత్రిక కథనం పేర్కొంది. ఈ పర్యటనను సునిల్ సేథీ రిపోర్ట్ చేశారు.

 
''టోపీని దేనితో తయారు చేశారు?'' అంటూ ఎవరో అరిచారు.
 
''గడ్డితో తయారు చేశారు'' అని ఓ ఇంగ్లీష్ వ్యక్తి చెప్పారు.
 
''మరి డ్రెస్ కోసం ఏ మెటీరియల్‌ను వాడారు'' అని మరో ప్రశ్న అడిగారు.
 
''క్రీపే డీ చైన్ తో తయారు చేశారు'' అని అతను చెప్పారు.
 
''క్వీన్ డిజైనర్ మీరేనా'' నేను అతన్ని అడిగాను
 
''నేనొక రిపోర్టర్‌ను'' అని అతను చెప్పాడు.
 
తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఆ వ్యక్తి టైమ్స్ ఆఫ్ లండన్ కోసం దిల్లీలో పని చేస్తున్న జర్నలిస్ట్.
 
మూడు రాష్ట్రాల పర్యటనలో క్వీన్ ఎలిజబెత్ 2 సంతోషంగా గడిపారు.
 
''భారతీయుల ఆత్మీయ ఆతిథ్యం, వారి సంస్కృతిలోని గొప్పదనం మనందరికీ స్ఫూర్తి'' అని రాణి తర్వాత కాలంలో వ్యాఖ్యానించారు.