ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 11 అక్టోబరు 2024 (13:59 IST)

తెలంగాణలో తగ్గిన రిజిస్ట్రేషన్లు, హైడ్రా ఎంత వరకు కారణం? వాస్తవాలేమిటి?

Hydraa
“హైడ్రా రాకతో చెరువులు, కుంటల సమీపంలో స్థలం కానీ, ఇల్లు కానీ కొనడానికి ప్రజలు భయపడుతున్నారు” అని రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న ఈ.రాజా బీబీసీ తెలుగుతో చెప్పారు. “హైడ్రా ప్రభావం జంట నగరాలకే పరిమితం. మిగతా రాష్ట్రమంతటా రియల్ ఎస్టేట్ బాగానే నడుస్తోంది. కొనేటోడు కొంటనే ఉన్నాడు, అమ్మేటోడు అమ్ముతూనే ఉన్నాడు” అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ ఆర్.జంగారెడ్డి బీబీసీతో చెప్పారు. ఇంతకీ తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? గతంతో పోల్చితే నిజంగా తగ్గాయా? రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కలు ఏం చెప్తున్నాయి?
 
తెలంగాణ రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ వివరాల ప్రకారం..
2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) లెక్కలను ‘బీబీసీ తెలుగు’ పరిశీలించింది. ఆ లెక్కల ప్రకారం ... గత ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం రాష్ట్రవ్యాప్తంగా రూ. 61.4 కోట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 10.04 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి.. రూ.7,229.88 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అదే కాలానికి లెక్కలు చూస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్యలో కొంత తగ్గుదల నమోదైంది. 9.19 లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. కానీ, ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. 9.19 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,291.28 కోట్ల ఆదాయం వచ్చింది.
 
సెప్టెంబర్‌ నెలలో ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండేది. కానీ, ఈ ఏడాది తగ్గుదల నమోదైంది. 2021-22 ఏడాది సెప్టెంబర్‌లో రూ. 1,090.94 కోట్లు, 2022-23లో రూ. 1,173.02 కోట్లు, 2023-24లో రూ.1,161.54 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.857.83 కోట్లు మాత్రమే ఖజానాలో జమ అయ్యాయి. అంటే, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుమారు రూ. 303 కోట్ల ఆదాయం తగ్గింది.
 
సెప్టెంబర్- రిజిస్ట్రేషన్లను చూస్తే..
గత మూడేళ్లలో సెప్టెంబర్ నెలలో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పోల్చి చూస్తే ఈ ఏడాది వాటి సంఖ్య తగ్గిందని అర్థమవుతోంది. 2021 సెప్టెంబర్‌లో 1.66 లక్షలు రిజిస్ట్రేషన్లు.. 2022లో 1.60 లక్షలు, 2023లో 1.62 లక్షలు, 2024లో 1.30 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే, గత మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబరులో రిజిస్ట్రేషన్ల సంఖ్యలో సుమారు 30 వేల వరకు తగ్గుదల నమోదైంది.
 
హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్లు పడిపోయాయి: కేటీఆర్
హైడ్రా హైరానాతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయి, ఆదాయం తగ్గిపోయిందని ఆయన ఆ పోస్ట్‌లో రాశారు. “తెలంగాణ‌కు గుండెకాయ వంటి హైద‌రాబాద్‌ను కాపాడుకోవ‌టం చేత‌కాక‌, సామాన్యుల‌పైకి బుల్డోజ‌ర్స్ పంపి, భ‌యాన్ని సృష్టించారు. తీరా చూస్తే, రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం ప‌డిపోయింది. నీ ఫోర్ బ్ర‌ద‌ర్ సిటీపై ఫోక‌స్ చేసి, అక్క‌డ కృత్రిమ రియ‌ల్ బూమ్ కోసం ఆలోచిస్తున్న‌ట్లున్న‌వ్, సామాన్యుల కొనుగోలు, అమ్మ‌కం లేనిది బూమ్ ఎట్లా వ‌స్త‌ది? ఆదాయం ఎట్లా పెరుగుత‌ది” అని సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
 
బీఆర్ఎస్ నిర్ణయాలే కారణం: కాంగ్రెస్
బీఆర్ఎస్ సర్కార్ గతంలో తీసుకున్న నిర్ణయాల వల్లే హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు పడిపోయాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ బీబీసీ తెలుగుతో చెప్పారు. “కేటీఆర్ మద్దతుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి నిరుడు కోకాపేట్ దగ్గర ఎకరం భూమి రూ. 100 కోట్లకు వేలంలో పాడి, ఆర్టిఫిషియల్ బూమ్ క్రియేట్ చేశారు. దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ధరలు భారీగా పెరిగాయి. అందుకే రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్లు తగ్గాయి అనడం తప్పు. హైడ్రా కేవలం చెరువులు, కుంటలు, నాలాల దగ్గరలోని అక్రమ కట్టడాలనే టార్గెట్ చేస్తోంది. మార్కెట్‌లో హెచ్చుతగ్గులు సాధారణం. అమరావతి మాదిరి ఇక్కడ ధరలు అమాంతం పడిపోలేదు కదా! ఎవరూ ధరలు తగ్గించి అమ్మట్లేదు. అయినప్పటికీ, హైడ్రాను బూచిగా చూపించాలి, ఆ వ్యవస్థ రద్దుకు ప్రయత్నించాలి. తద్వారా తమ ఫామ్‌హౌస్‌లు, అక్రమ కట్టడాలు, స్థలాలు కాపాడుకోవచ్చని కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు విషప్రచారాలు చేస్తున్నారు” అని మధుయాష్కీ గౌడ్ అన్నారు.
 
'నంబర్లు తగ్గడం, పెరగడం సహజం'
హైడ్రా ప్రభావంతోనే తెలంగాణ అంతటా అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గిపోయాయని అనడం సరికాదని సీనియర్ డాక్యుమెంట్ రైటర్ ఆర్. జంగారెడ్డి అన్నారు. “సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ ప్రకటనతో... ఆ ప్రాంతంలో భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొత్తంగా చూసినప్పుడు నంబర్లు తగ్గడం, పెరగడం సహజం. ఈ లెక్కలు చూసి మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయిందనుకోవడం సరికాదు. మూడు-నాలుగు నెలల్లో మళ్లీ జోరు పెరగవచ్చు” అని జంగారెడ్డి అన్నారు.