శాంసంగ్ బాలీ.. ఇంటి పనులు చేస్తూ, నీడలా వెంటాడే రోబో బంతి - సీఈఎస్ 2020

Bali
బిబిసి| Last Modified గురువారం, 9 జనవరి 2020 (16:03 IST)
ఇక్కడ కనిపిస్తున్న ఈ గుండ్రని వస్తువు పేరు బాలీ. టెన్నిస్ బంతి లాగా కనిపిస్తుంది. ఇది బీప్ శబ్దం చేస్తూ దొర్లుతూ పోతుంది. యజమాని ఎటువెళితే అటు అనుసరిస్తూ వెళుతుంది. ఈ పరికరంలో అంతర్గతంగా కెమెరా ఉందని.. ప్రత్యేక సందర్భాలను వీడియో తీసి స్టోర్ చేయగలదని. దీనిని తయారు చేసిన దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్.. లాస్ వేగాస్‌లో జరుగుతున్న సీఈఎస్ టెక్ షోలో ప్రేక్షకులకు వివరించింది.

శాంసంగ్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెచ్.ఎస్.కిమ్ వేదిక మీద బాలీ పనితీరును ప్రదర్శించారు. అది ఆయన వెంట పడుతుంటే.. ''ఐ లవ్ దిస్ గై'' అని ఆయన చెప్పారు. ఈ రోబో బంతి ఆలోచన సరదాగా ఉందని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. అయితే ఇది మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడవచ్చునని వ్యాఖ్యానించారు. బాలీ తన యజమానిని నీడలా వెంటాడటంతో పాటు.. వ్యాయామానికి సహాయకారిగా పనిచేస్తుంది. ఇంటి పనుల్లోనూ సాయం చేస్తుంది.

ఉదాహరణకు.. ఇంట్లో శుభ్రం చేయాల్సిన అవసరం ముందని బాలీ భావించినపుడు.. ఇంట్లోని రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు వంటి స్మార్ట్ పరికరాలను యాక్టివేట్ చేయగలదు. ఈ రోబో బంతిని.. స్టార్ వార్స్ సినిమాల్లోని బీబీ-8 అనే రోబో పాత్ర వంటి వాటితో పోలుస్తూ సోషల్ మీడియాలో ఇప్పటికే హల్‌చల్ మొదలైంది.


''ఇది చాలా సరదాగా ఉంది. దీని శబ్దాలు చూస్తుంటే.. ష్పీరో టాయ్ - ఆర్2-డీ2ల మిశ్రమం లాగా నాకు అనిపించింది'' అని ఫ్యూచర్‌సోర్స్ అనే మార్కెట్ పరిశోధన సంస్థకు చెందిన సైమన్ బ్రియాంట్ చెప్పారు. ''ఇది మెట్లు ఎక్కలేదు.. మరి ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది నేను చెప్పలేను'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

శాంసంగ్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీల్లో ఏర్పాటుచేసిన.. గొంతు గుర్తుపట్టే వర్చువల్ అసిస్టెంట్ బిక్స్‌బీ గురించి ప్రస్తావించకుండా.. స్వరం గుర్తించే సామర్థ్యాలు ఉన్న బాలీని ఆవిష్కరించటం ఆశ్చర్యకరంగా అనిపించిందని బ్రియాంట్ పేర్కొన్నారు. అయితే.. చాలా మంది భద్రత, గోప్యత ఆందోళనల రీత్యా ఈ బాలీ విషయంలో ముందూవెనుకా ఆలోచిస్తారని తాను భావిస్తున్నట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ విశ్లేషకుడు పాల్ గార్గన్ చెప్పారు. గోప్యత, సమాచార పరిరక్షణ ప్రమాణాలకు బాలీ కట్టుబడి ఉంటుందని శాంసంగ్ తెలిపింది.

ఈ డివైజ్ మార్కెట్‌లో కొనుగోళ్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, దీని ధర ఎంత అనేది ఆ సంస్థ ఇంకా వెల్లడించలేదు. శాంసంగ్.. తన ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాల గురించి కూడా చర్చించింది. అందులో.. మినీ ఎక్సోస్కెలెటన్ ఒకటి. దీనిని వ్యాయామం చేసే సమయంలో నడుము, తొడల చుట్టూ ధరించవచ్చు. కదలిక సమస్యలు ఉన్న వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు.


ఈ పరికరాన్ని జెమ్స్ అని పిలుస్తున్నారు. అంటే.. జెయింట్ ఎన్‌హాన్సింగ్ అండ్ మోటివేటింగ్ సిస్టమ్ (జీఈఎంఎస్). వినియోగదారుడు ఈ జెమ్‌ను శరీరానికి, కళ్లకు ఆగ్‌మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్‌ను ధరించి.. వర్చువల్ పర్సనల్ ట్రెయినర్ అనుభవం పొందవచ్చునని.. నీటి అడుగున ఉండే ప్రదేశాలను వీక్షించవచ్చునని శాంసంగ్ సూచిస్తోంది.

స్మార్ట్ భవనాలు, నగరాల్లో ఉపయోగించటం కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయటం మీద కూడా తాము దృష్టి కేంద్రీకరిస్తామని శాంసంగ్ చెప్పింది. అయితే.. ఈ ఆలోచనలు చాలా వరకూ తనకు ఆసక్తికరంగా కనిపించలేదని బ్రియాంట్ పేర్కొన్నారు. ''మొబైల్ నుంచి ముందుకు వెళ్లే తాపత్రయంలో చేస్తున్న ప్రయత్నంలా అనిపిస్తోంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

దీనిపై మరింత చదవండి :