గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 23 జూన్ 2023 (21:18 IST)

భారత్‌లో మైనారిటీల భద్రతపై జర్నలిస్ట్ ప్రశ్నకు మోదీ సమాధానం ఇదే

Modi
కర్టెసి-నరేంద్రమోడీ డాట్ ఇన్
భారత్‌లో ముస్లింల స్థితిగతులకు సంబంధించిన ప్రశ్నలపై అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోది సంయుక్త విలేఖరుల సమావేశంలో సమాధానమిచ్చారు. నరేంద్రమోదీ తొలిసారిగా అమెరికా స్టేట్ విజిట్‌లో పాల్గొంటున్నారు. నరేంద్ర మోదీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం గొప్ప విషయమని బైడెన్ అధికార యంత్రాంగంలో సీనియర్ అధికారి జాన్ కిర్బీ అన్నారు. "ప్రధానమంత్రి మోదీ తన పర్యటన చివర్లో ప్రెస్‌మీట్‌లో పాల్గొనడానికి అంగీకరించినందుకు మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇది చాలా కీలకమని మేం భావిస్తున్నాం. ఆయన కూడా దీనికి ప్రాముఖ్యమివ్వడం మాకు సంతోషాన్నిచ్చింది’’ అని కిర్బీ అన్నారు.
 
ప్రెస్‌మీట్‌లో ఎదురైన ప్రశ్న, మోదీ సమాధానం
వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక విలేఖరి సబ్రీనా సిద్ధికీ మోదీకి ఒక ప్రశ్న వేశారు. "భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ, మీ దేశంలో మతపరమైన మైనారిటీల హక్కులకు భంగం కలుగుతోందని, విమర్శకుల నోళ్లు మూసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మానవహక్కుల సంఘాలు అంటున్నాయి. మీ దేశంలో ముస్లింలతో సహా ఇతర వర్గాల హక్కులను మెరుగుపరచడానికి, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడటానికి మీరు, మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి" అని సిద్ధిఖీ అడిగారు. దీనికి సమాధానంగా, ‘‘ఎవరో అంటున్నారని మీరు అనడం నాకు ఆశ్చర్యంగా ఉంది. భారతదేశం నిజమైన ప్రజాస్వామ్య దేశం. భారత్, అమెరికా రెండింటి డీఎన్ఏలో ప్రజాస్వామ్యం ఉందని అధ్యక్షుడు బైడెన్ కూడా చెప్పారు.
 
ప్రజాస్వామ్యమే మాకు స్ఫూర్తి. అది మా ప్రతి నరంలో అది ప్రవహిస్తోంది. మేం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. మా పూర్వికులు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రాజ్యాంగంలో కొన్ని పదాలు చేర్చారు. ఆ రాజ్యాంగ మూల సూత్రాల ఆధారంగానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కులం, మతం లేదా లింగం ఆధారంగా ఎలాంటి వివక్షకు చోటు లేదు. ఇక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు మానవీయ విలువలు, మానవత, మానవ హక్కులు లేకపోతే అది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి మాది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నప్పడు వివక్ష అనే ప్రశ్న తలెత్తదు. అందుకే భారత్ సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, ఇంకా సబ్‌కా ప్రయాస్ అనే ప్రాథమిక సూత్రాలతో నడుస్తుంది. భారతదేశంలో ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. మతం, కులం, వయసు, లింగం, ప్రాంతం ఆధారంగా కాకుండా, అర్హులైన వారంతా ఈ ప్రయోజనాలను పొందుతారు. అందుకే భారత ప్రజాస్వామ్య విలువల్లో వివక్ష లేదు.’’ అని నరేంద్ర మోదీ అన్నారు.
 
మోదీ పర్యటన సందర్భంగా ఒబామా ఏమన్నారు?
ప్రధాని మోదీ అమెరికాలో తొలి స్టేట్ విజిట్ సందర్భంగా ఆ దేశ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డులకెక్కారు. ఈ సందర్భంగా అమెరికా ప్రబుత్వం స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నుంచి అమెరికా పారిశ్రామికులు, అనేకమంది రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆయన ఇక్కడ ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌లో మైనారిటీల భద్రతపై ఒక వ్యాఖ్య చేశారు. న్యూస్‌చానెల్ సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు.
 
ఈ ఇంటర్వ్యూలో “బైడెన్ ప్రస్తుతం మోదీని స్వాగతిస్తున్నారు. కానీ, మోదీపై నిరంకుశుడు అన్న విమర్శలున్నాయి. అలాంటి నాయకులతో అధ్యక్షుడు ఎలా వ్యవహరించాలి?’’ అని జర్నలిస్ట్ క్రిస్టియన్ అమన్‌పూర్ ఒబామాను అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన బరాక్ ఒబామా, తాను ప్రధాని మోదీతో మాట్లాడి ఉంటే ఏం అడిగేవాడినో చెప్పారు. హిందువులు మెజారిటీలుగా ఉన్న భారతదేశంలోని ముస్లిం మైనారిటీల భద్రత ప్రస్తావించదగిన విషయమని ఆయన అన్నారు.
 
‘‘నేను మోదీతో మాట్లాడి ఉంటే, మీరు మైనారిటీల హక్కులను కాపాడకపోతే, భవిష్యత్తులో భారతదేశంలో విభజన వాదం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది దేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది కదా’’ అని అడిగేవాడినని చెప్పారు.
 
బెర్నీ శాండర్స్ విమర్శలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో పాల్గొన్న అమెరికన్ డెమొక్రాట్ నాయకుడు బెర్నీ శాండర్స్ కూడా ప్రధాని మోదీతో భేటీలో మతపరమైన మైనారిటీల గురించి అధ్యక్షుడు బైడెన్ మాట్లాడాలని ట్వీట్ చేశారు. "ప్రధాని మోదీ ప్రభుత్వం పత్రికలు, పౌర సమాజంపై దాడులు చేసింది. రాజకీయ ప్రత్యర్థులను జైలులో పెట్టింది. హిందూ జాతీయవాదాన్ని ప్రోత్సహించింది. భారతదేశంలోని మతపరమైన మైనారిటీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు’’ అని అన్నారు. మోదీతో సమావేశం సందర్భంగా బైడెన్ ఈ అంశాలను ప్రస్తావించాలని శాండర్స్ డిమాండ్ చేశారు.
 
ఒబామా, బెర్నీ శాండర్స్‌తో పాటు, డెమోక్రటిక్ పార్టీకి చెందిన 75 మంది నేతలు ప్రధాని మోదీ హయాంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలను వివరిస్తూ అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. వీరిలో అగ్రశ్రేణి అమెరికా నాయకులతో పాటు వివిధ నేపథ్యాలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. జనవరి 20న రాసిన ఈ లేఖలో ‘‘ఇరు దేశాల మధ్య స్నేహం కేవలం ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగానే కాకుండా విలువలపై కూడా ఆధారపడి ఉండాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ అమెరికన్ నాయకులలో కొందరు అమెరికా పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగాన్ని కూడా బహిష్కరించారు.
 
మోదీని సమర్ధించిన నిక్కీహేలీ
మోదీ పర్యటనను కొందరు అమెరికన్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించగా, మరికొందరు మాత్రం సమర్ధించారు. భారత్-అమెరికాల మధ్య స్నేహం గాఢమైందని రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అన్నారు. “అమెరికా-భారత్‌ల మధ్య స్నేహం వ్యక్తిగత స్థాయిలో ఉంది. భారతదేశం మన ప్రజాస్వామిక విలువలను పంచుకునే స్నేహపూర్వక దేశం. వాణిజ్యం నుండి సాంస్కృతిక సంబంధాల వరకు, భద్రత నుంచి ఉమ్మడి ప్రయోజనాల వరకు ఈ స్నేహం ఎంతో విలువైనది. దీన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అంటూ ఆమె మోదీ రాకకు ముందు ట్వీట్ చేశారు.