శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 23 మే 2023 (12:30 IST)

వాట్సాప్ మెసేజ్‌లను ఇక ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగంటే..

whatsapp
మెసేజ్‌లను ఎడిట్ చేసుకునేలా యూజర్లకు అనుమతివ్వనున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది. ‘‘ఎడిటింగ్ ఫీచర్ వల్ల చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవడం నుంచి మెసేజ్‌కు అదనపు వివరాలను యాడ్ చేసుకునేంత వరకు, మీ చాట్లపై మీకు మరింత నియంత్రణ ఉంటుంది’’ అని తెలుపుతూ సోమవారం బ్లాగ్ పోస్ట్‌లో ఈ మెసేజింగ్ సర్వీసుల కంపెనీ తెలిపింది.
 
మెసేజ్‌లు పంపిన 15 నిమిషాల వరకు వాటిని ఎడిట్ చేసుకోవచ్చని ఈ సంస్థ చెప్పింది. ఎడిట్ చేయాలంటే పంపిన మెసేజ్‌‌ను లాంగ్ ప్రెస్ చేయాలి. తర్వాత మెనూలోకి వెళ్లి ‘ఎడిట్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన మెసేజ్‌లకు ‘‘ఎడిటెడ్’’ అనే ట్యాగ్‌ను ఇస్తుంది. దీని ద్వారా కంటెంట్‌ను మార్చినట్లు మెసేజ్ పొందిన వారికి తెలుస్తుంది. అయితే, ఈ సమయంలో మెసేజ్‌లో ఏం మార్చారో అవతలి వారికి కనిపించదు.
 
మెసేజింగ్ సర్వీసు కంపెనీలు టెలిగ్రాం, సిగ్నల్‌లు ఈ ఫీచర్‌ను ఆఫర్ చేయడం ప్రారంభించిన తర్వాత వాట్సాప్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. రాబోయే వారాల్లో 200 కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. 48.7 కోట్ల మంది యూజర్లతో భారత్ వాట్సాప్‌కు అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అమెరికా టెక్నాలజీ దిగ్గజం మెటా కింద వాట్సాప్ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ సర్వీసులను అందిస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థల యజమాని కూడా మెటానే.
 
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ ఈ ఎడిట్ ఫీచర్‌ను సుమారు దశాబ్దం క్రితమే ప్రవేశపెట్టింది. తమ యూజర్లలో సగం మందికి పైగా మొబైల్ ఫోన్‌పై తమ సైట్‌ను యాక్సెస్ చేస్తున్నారని ఆ సమయంలో టైపింగ్ తప్పులు వస్తున్నాయని అప్పట్లో ఫేస్‌బుక్ తెలిపింది. ఫేస్‌బుక్‌పై అప్‌డేట్ చేసిన వాటిని ఎడిటెడ్‌గా చూపిస్తుంది. ఎడిట్ చేసిన హిస్టరీని చూసేందుకు కూడా యూజర్లకు అనుమతి ఉంటుంది. ఎలాన్ మస్క్‌కి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ కూడా 2022లో ఈ ఫీచర్‌ను ప్రకటించింది. పేమెంట్ సబ్‌స్క్రైబర్లకు తమ ట్వీట్లను ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తున్నామని ట్విటర్ తెలిపింది. పోస్ట్ చేసిన తర్వాత 30 నిమిషాల్లో ట్వీట్లను ఎడిట్ చేసుకోవచ్చు.