సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: మంగళవారం, 25 జూన్ 2019 (11:15 IST)

1983లానే ఈసారి కూడా లార్డ్స్ వేదికగా భారత్‌ ట్రోఫీ సాధించాలని...

లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానాన్ని... మక్కా ఆఫ్ క్రికెట్‌ అని పిలుస్తారు. సరిగ్గా 36 ఏళ్ల క్రితం 1983 జూన్ 25న భారత్ తొలి క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్నది ఈ మైదానంలోనే. లార్డ్స్ బాల్కనీలో అప్పటి టీమిండియా సారథి కపిల్ దేవ్ వరల్డ్ కప్ ట్రోఫీని చూపుతున్న దృశ్యాలు క్రికెట్ అభిమానుల మదిలో ఎన్నటికీ చెరిగిపోనివి.
 
నియమ నిబంధనలన్నింటినీ బ్రేక్ చేస్తూ భారత జట్టు, క్రికెట్ అభిమానులంతా ఆనందోత్సాహాలతో పిచ్ వైపు పరుగెడుతున్న ఒక అద్భుతమైన చిత్రం ఉంది. ఆ జట్టులోని కీలక సభ్యుల్లో మదన్ లాల్ ఒకరు. ఆయన చెప్పిన ఒక వ్యాక్యం నాకు ఎప్పటికీ గుర్తుకొస్తూ ఉంటుంది. "వెస్టిండీస్ చివరి వికెట్‌ను భారత జట్టు పడగొట్టినప్పుడు, మా జట్టు పట్టలేనంత ఆనందంలో ఉంది. మమ్మల్ని ఎవరో తరుముతున్నట్లుగా మేము మైదానంలో పరుగెత్తాం" అని మదన్ లాల్ చెప్పారు.
 
ఆ విజయం అనంతరం దిల్లీ వీధులన్నీ సంబరాలతో దద్దరిల్లాయి. ఆ సమయంలో పాత దిల్లీకి వెళ్లిన జర్నలిస్టు మార్క్ టల్లీ... వీధుల్లో నిలబడేందుకు కూడా స్థలం దొరకనంతగా ప్రజలంతా బయటికొచ్చారని చెప్పారు. లార్డ్స్ మైదానంలో భారత్ సాధించిన ఆ విజయానికి సంబంధించిన అలాంటి జ్ఞాపకాలు ఒక తరం నుంచి మరో తరానికి, నాలాంటి క్రికెట్ అభిమానులకు ప్రయాణిస్తున్నాయి.
 
నేను లండన్‌లో పనిచేస్తున్నప్పుడు, తరచూ లార్డ్స్ క్రికెట్ మైదానాన్ని, అక్కడున్న క్రికెట్ మ్యూజియంను సందర్శిస్తుండేదాన్ని. 2014లో లార్డ్స్ క్రికెట్ మైదానం నిర్మించి 200 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు నేను అక్కడికి వెళ్లినప్పుడు, ఉన్నట్టుండి 1983లో భారత్ గెలుచుకున్న ట్రోఫీని చూడాలని ఉందా? అని అక్కడి మ్యూజియం సిబ్బంది నన్ను ఒక ప్రశ్న అడిగారు. మరేమాత్రం ఆలోచించకుండా సరే అన్నాను. చేతులకు గ్లౌజులు ధరించాలని, దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పారు.
 
భారత్‌లో చరిత్ర సృష్టించి, దేశంలో ఎంతోమంది భావి క్రికెటర్లకు స్ఫూర్తిగా మారిన ఆ ట్రోఫీ నా కళ్ల ముందుకు వచ్చింది. నా చేతులతో ఆ ట్రోఫీని పట్టుకోవడం మరచిపోలేని అత్యద్భుతమైన సందర్భం. ఎంతగానో ఆనందించాను. నేనే అంతగా ఆనందపడితే, 1983లో గెలుపొందినప్పుడు భారత జట్టు ఇంకెంత సంబరపడిందో అనిపించింది. లార్డ్స్ క్రికెట్ మైదానం భారత క్రికెట్ అభిమానులకు ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనది. లార్డ్స్ మ్యూజియంలో అరుదైన క్రికెట్ వస్తువులు ఉంటాయి.
 
1886లో భారత జట్టు తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు తీసిన అరుదైన ఫొటో ఆ మైదానంలో భద్రంగా ఉంది. 1886లో పార్సీల బృందం భారత్ నుంచి ఇంగ్లండ్ వెళ్లింది. ఈ మ్యూజియంలో ఉన్న అరుదైన వస్తువుల్లో భారత క్రికెట్ సూపర్ హీరో సీకే నాయుడు సంతకం చేసిన బ్యాట్ ఒకటి. ఆయన 1932లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత తొలి టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్. అప్పుడు లార్డ్స్ మైదానంలో ఆడారు. ఆయన దేశీయ క్రికెట్‌లో 60 ఏళ్ల వయసు వరకూ ఆడారు.
 
1946లో భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పటి అరుదైన ఫొటోలు, 1959లో మ్యాచ్‌ల సందర్భంగా ధరించిన టైలు.. ఇలా క్రికెట్ చరిత్రకు సంబంధించిన ఎన్నో అరుదైన జ్ఞాపకాలు మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి. షేన్ వార్న్ 300వ వికెట్, రాహుల్, సచిన్ తెందూల్కర్ సంతకాలు చేసిన టీషర్టులు ఇక్కడ చూడొచ్చు.
 
ఈ ఆదివారం మరోసారి ప్రపంచకప్‌ టోర్నీలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వీక్షకుల్లో 1983లో మ్యాచ్‌ను వీక్షించిన వారు కూడా కొందరు ఉండొచ్చు. 1983లో అద్భుతమైన ఆ గెలుపును నేను చూడలేదు. కానీ, ఆ విజయానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2008లో లార్డ్స్ మైదానంలో సంబరాలు జరిగినప్పుడు ఆనాటి జట్టును చూశాను.
 
కపిల్ దేవ్‌ నేతృత్వంలోని ఆ జట్టు 2008లో సంబరాల సందర్భంగా ఆ ట్రోఫీని పట్టుకుని లార్డ్స్ బాల్కనీలో ఉన్నప్పుడు చూస్తుంటే, 1983 నాటి చరిత్రాత్మక సందర్భాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అనిపించింది. ఇప్పుడు కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలోనే జరగనుంది. 1983లో ఇంగ్లండ్‌లోని ప్రముఖ బెట్టింగ్ కంపెనీ జింబాబ్వే కంటే కాస్త ముందు వరుసలో భారత్‌ ఉంటుందని చెప్పింది. కానీ, ఈసారి అలా కాదు.
 
ప్రస్తుతం 1983లాగే ఈసారి కూడా లార్డ్స్ వేదికగా భారత్‌ ట్రోఫీ సాధించాలని ఇక్కడి అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే జరిగితే, అది మరో మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.