బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (13:34 IST)

ప్రపంచ కప్ 2019: సెమీస్ ఆడకుండానే టీమిండియా ఫైనల్ చేరుకోవచ్చా?

వరల్డ్ కప్ 2019 తొలి సెమీఫైనల్లో న్యూజీలాండ్‌తో తలపడేందుకు భారత జట్టు మాంచెస్టర్ చేరుకుంది. శనివారం శ్రీలంకపై విజయంతో, దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో భారత్ పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో నాలుగో స్థానంలో ఉన్న న్యూజీలాండ్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది.


ఇప్పుడు భారత్, న్యూజీలాండ్‌ల మధ్య సెమీస్‌లో ఎవరు గెలుస్తారనే చర్చ జోరందుకుంది. అయితే మంగళవారం అంటే జులై 9న మాంచెస్టర్ ఓల్డ్‌ ట్రఫర్డ్ మైదానంలో ఒక్క బంతి పడకుండానే భారత్ ఫైనల్‌కు చేరే అవకాశం ఉందంటే మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ, దానికి కోహ్లీ సేనపై 'వరుణుడి దయ' ఉండాలి.

 
మంగళవారం మాంచెస్టర్‌లో మబ్బులు కమ్మచ్చని, వర్షం కురిసే అవకాశం ఉందని బ్రిటన్ వాతావరణ విభాగం చెబుతోంది. ఒకవేళ వర్షం తన 'ఆట' మొదలెడితే, ఆడలేని పరిస్థితుల్లో మ్యాచ్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు, మీ మనసులో జూన్ 13న రద్దైన భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ గుర్తుకొచ్చే ఉంటుంది. అప్పుడు కూడా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు టీములకు ఒక్కో పాయింట్ ఇచ్చారు.

 
కానీ ఇది లీగ్ రౌండ్ మ్యాచ్ కాదు.. వరల్డ్ కప్ సెమీ ఫైనల్. దీనికోసం రిజర్వ్ డే అంటే అదనంగా ఒక రోజును కేటాయించారు. ఏదైనా కారణంతో మ్యాచ్ జరిగే రోజు అంటే జులై 9న ఆటకు ఆటంకం కలిగితే తర్వాత రోజు అంటే జులై 10న ఆ మ్యాచ్ జరుగుతుంది.

 
అయితే అసలు సమస్యేంటి
ఇక్కడ సమస్యంతా వాతావరణం గురించే. బ్రిటన్ వాతావరణ విభాగం చెప్పేది నమ్మాల్సి వస్తే, జులై 10న వాతావరణం జులై 9 కంటే ఘోరంగా ఉండబోతోంది. ఆరోజు ఆకాశం మేఘావృతం కావచ్చు, మధ్యాహ్నం వరకూ (మ్యాచ్ లంచ్ టైమ్) తేలికపాటి జల్లులు పడవచ్చు.
 
మేఘాలు కమ్మేస్తే...
అలాంటప్పుడు జులై 9, రిజర్వ్ డే అంటే జులై 10న మ్యాచ్ ఆడడం సాధ్యం కాకుంటే మరో రోజు ఉండదు. అది కచ్చితంగా భారత్‌కు అనుకూలం అవుతుంది. ఎందుకంటే లీగ్ పోటీల్లో న్యూజీలాండ్‌కు 11 పాయింట్లు ఉంటే, టీమిండియాకు 15 పాయింట్లు ఉన్నాయి. దాంతో భారత్ ఆటోమేటిగ్గా ఫైనల్‌ చేరుతుంది. అంటే రెండు రోజులూ వర్షం వల్ల మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే, కోహ్లీ సేన మాంచెస్టర్‌లో ఒక్క బంతి కూడా పడకుండానే 'క్రికెట్ మక్కా' లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో అడుగుపెడుతుంది.

 
అయినా.. ఇంగ్లండ్ వాతావరణం, దానివల్ల ప్రభావితమైన మ్యాచ్‌ల గురించి నేను చాలా రాశాను, చెప్పాను. లీగ్ రౌండ్‌లో మొత్తం 45 మ్యాచుల్లో ఏడింటిపై వర్షం ప్రభావం పడింది. మూడు మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. వీటిలో భారత్-న్యూజీలాండ్ లీగ్ మ్యాచ్ కూడా ఉంది.

 
మరోవైపు, ఆతిథ్య ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా తమ సెమీస్‌ మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడకూడదని కోరుకుంటున్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌లో జల్లులు పడవచ్చని చెబుతున్నారు. శుక్రవారం రిజర్వ్ డే రోజు కూడా వర్షం 'విలన్' కావచ్చని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. వర్షం వల్ల ఎడ్జ్‌బాస్టన్‌లో మ్యాచ్ జరగకపోతే ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరుకుంటుంది. అదీ.. ఒక్క బంతి కూడా పడకుండానే.
 
వాతావరణం బాగుండాలని ప్రార్థనలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మాంచెస్టర్ చేరుకుంటున్నారు. వాళ్లందరి నోటా ఒకే మాట వస్తోంది... "సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరిగే రోజు ఆకాశం స్పష్టంగా ఉండాలి, వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి". ఆదివారం మాంచెస్టర్‌లో బాగా ఎండకాసింది. "అయితే, భారీ వర్షం వచ్చినా నాకే సమస్యా లేదు, అదే జరిగితే భారత్ ఫైనల్ చేరుకుంటుంది. కానీ ఆట జరిగితే మాత్రం మ్యాచ్ ఉత్కంఠగా జరిగితే బాగుండుననిపిస్తోంది" అని దుబాయి నుంచి మ్యాచ్ చూడ్డానికి వచ్చిన కుమార్, ఆయన భార్య ప్రమీల అన్నారు.

 
నేనిక్కడ స్థానిక విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న కొంతమంది భారత విద్యార్థులను కూడా కలిశాను. వాళ్లంతా భారత్‌లో ఉంటున్న తమ అమ్మనాన్నలకు చెప్పకుండానే మ్యాచ్ టికెట్లు కొనేశామని చెప్పారు. వాళ్లలో ఒకరు.. "పాజీ, దయచేసి వర్షం పడాలని ప్రార్థించండి. 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ మాదిరిగా సెమీఫైనల్లో భారత్ మరోసారి ఓడిపోతే చూడలేం" అన్నారు.
 
- నితిన్ శ్రీవాస్తవ్
బీబీసీ ప్రతినిధి, మాంచెస్టర్ నుంచి