గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (19:27 IST)

నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి?

నల్లగా ఉన్నావన్నారు. మొహం అద్దంలో చూసుకోమని అవహేళన చేసారు. అసలు ఇలాంటి పిల్లను ఎవరు పెళ్లి చేసుకుంటారని? నవ్వుకునేవారు కూడా.. అలాంటివన్నీ లెక్కచేయకుండా ముందడుగేసి ప్రొఫెషనల్ మోడల్‌గా దూసుకెళ్తున్నారు రాజస్థాన్ కి చెందిన 23 ఏళ్ళ సంగీతా ఘారూ. సత్తా ఉన్న చోట అందంతో పనేంటని ప్రశ్నించే ఆసక్తికర కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు బీబీసీ ప్రతినిధి బుష్రా షేక్.
 
"చాలా నలుపుగా ఉన్నావు.. కాస్త నీ మీద నువ్వు దృష్టి పెట్టు అని చాలామంది అనేవారు. నన్ను వంకాయతో పోల్చేవారు. చాలా పొడుగ్గా ఉన్నానని నాకన్నా పొడుగ్గా ఉండే భర్తని వెతకడం చాలా కష్టమని అనేవారు. అలాంటి బట్టలు వేసుకోవద్దని చెప్పేవారు. నేనిలాంటి బట్టలు వేసుకుంటే ఈ జనాలు నా గురించి ఏమనుకుంటారో అని చాలా భయపడ్డాను" అని తను ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసుకున్నారు సంగీతా.
 
సంగీత ఘారూ వృత్తి రీత్యా మోడల్. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె మోడల్ కాగలిగారు.. కానీ ఆమె ప్రయాణం అంత సులువుగా సాగలేదు. "చాలా సార్లు నన్ను తిరస్కరించారు. డిజైనర్ నన్ను చూసినపుడు నేను ఏమాత్రం అందంగా లేనని నా మొహం మీదే చెప్పేశారు. దాంతో, కొన్నిసార్లు నాకు కూడా కాస్త అందాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్ధించేదానిని." అని ఆమె చెప్పారు.
 
"మన భారతీయ సమాజంలో రంగు అనేది చాలా ముఖ్యమైన విషయంగా ప్రజలు భావిస్తారు. ఉదాహరణకు మీరేదైనా న్యూస్ పేపర్ చదివినప్పుడో, మేట్రిమోనియల్ సైట్లు చూసినపుడో కులం ఏదైనా పర్వాలేదు.. కానీ, అమ్మాయి మాత్రం అందంగా ఉండాలని స్పష్టంగా రాసి ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ అందమైన అమ్మాయిల కోసమేనా.. నల్లగా ఉండే ఆడపిల్లలు ఏమీ సాధించలేరా?" అని ప్రశ్నించారు సంగీత.
 
"నేను ఓ క్యాలండర్ కోసం ఫోటో షూట్ చేయబోతున్నానని, దానికోసం సిలికాన్ దుస్తులు వేసుకోబోతున్నానని అమ్మానాన్నలతో చెప్పాను. వాళ్లకు చాలా కోపం వచ్చింది. నా అన్నయ్య ఒక్కసారిగా షాకయ్యాడు. కొన్ని రోజులు మా నాన్న నాతో మాట్లాడటమే మానేశారు. అయితే, ఇప్పుడిప్పుడే వాళ్ళు నన్ను అంగీకరిస్తున్నారు.. తను మా అమ్మాయి, అలాగే మంచి మోడల్ కూడా చెబుతున్నారు." అని ఆమె చెప్పారు.
 
జాతీయ అంతర్జాతీయ వేదికలపై సంగీత తన సత్తా ఏంటో చూపించారు. లాక్ మీ, వోగ్ లాంటి బ్రాండ్లతో కలిసి పనిచేశారు. "తను ఓ మోడల్, బహుశా డ్రగ్స్ తీసుకుంటుందేమో. తన కారెక్టర్ ఎలాంటిదో అనుకునేవారూ ఉంటారు. మోడలింగ్ అనేది ఓ రంగుల ప్రపంచం. మీకు ఏదో తెలియని శక్తినిచ్చి ప్రపంచం మీ వైపు చూసేలా చేస్తుంది. అలాగే ఓ సాధారణ అమ్మాయి కలలను ఎవరొచ్చి నిజం చెయ్యాలనుకుంటారు? ఎలా చెయ్యగలరు? ఈ ప్రపంచంలో తనకు తానే ఓ ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకోవాలి"
 
"నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను దళితురాలిని. కానీ, నేనిప్పుడు నాకంటే పెద్దకులం వారితో.. అందమైన వారితో ఒకే వేదికను పంచుకుంటున్నాను. నేను నల్లగా ఉన్నందుకు నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను మిగతావారిలా కాదు.. అలాగని వారికన్నా ఏమాత్రం తక్కువ కాదు." అన్నారు సంగీత.