మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 5 డిశెంబరు 2020 (22:18 IST)

జుట్టు ఊడుతున్నా వదిలేస్తే బట్టతల ఖాయం.. అందుకే...

శరీరాన్నే కాదు కేశాలను కూడా చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా చూసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పుల గురించే ఆలోచిస్తాం. కానీ ఆహార పరంగా నిర్లక్ష్యం చేస్తే కొన్ని పోషకాలు కూడా అలాంటి సమస్యల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు జుట్టుకు ఎదురయ్యే సమస్యల్ని గమనించుకుని కొన్నిరకాల పోషకాలు అందేలా చూసుకోవాలి.
 
ముఖ్యంగా జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్ల లోపం ఎదురవకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ, తృణధాన్యాలూ, గుడ్లూ, మాంసాహారం ఎక్కువగా తింటే 'బి' విటమిన్లు బాగా అందుతాయి.
 
'సిలికా' అనే ఖనిజ లవణం జుట్టుకు తేమను అందించి, వెంట్రుకల్ని దృఢంగా ఉంచుతుంది. యాపిల్స్‌, కమలా ఫలాలు, ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, క్యారెట్లు, ఓట్స్‌, శుద్ధిచేయని గింజలు, పప్పులు, గింజలు‌, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ సిలికాను అందిస్తాయి.
 
కేశాలు చిట్లిపోయి, ఎదుగుదల తక్కువగా ఉంటే మాంసకృత్తులు లోపించినట్లేనని అర్థం. ఎందుకంటే జుట్టు కణాలు పరిణతి చెందాక వాటిల్లో కెరొటిన్‌ అనే ప్రొటీన్‌ నిండుతుంది. దీనివల్లే జుట్టు ఎదుగుదల బాగుంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువుండే లోఫ్యాట్‌ చీజ్‌, బీన్స్‌, గుడ్లు, పాలు, పెరుగు, సోయాపాలు, నట్స్‌, గింజలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
 
సహజంగా తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే జింక్‌ లోపం ఉండొచ్చని సందేహించాలి. జింక్‌ జుట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈ లోపం ఉన్నప్పుడు ముందు జుట్టు పలుచగా మారి తరవాత రాలడం మొదలవుతుంది. నువ్వులూ, గుమ్మడి గింజలూ, పుచ్చకాయ గింజలూ, డార్క్‌ చాక్లెట్‌, పల్లీలు లాంటి వాటిల్లో జింక్‌ పుష్కలంగా లభిస్తుంది.
 
చుండ్రు వుంటే తలంతా దురద పుట్టి, పొట్టుగా రాలుతుంది కొన్నిసార్లు. తలలో సహజ నూనెలు తగ్గి పొడిబారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుంది దాన్ని తగ్గించుకోవాలంటే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పోషకాలను నట్స్‌, సాల్మన్‌ తరహా చేపలు, అవిసె గింజలు, గుడ్ల నుంచి పొందవచ్చు.