ఆదివారం, 8 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 5 ఫిబ్రవరి 2026 (22:22 IST)

భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయనున్న DPDP గడువు కుదింపు: నిపుణుల హెచ్చరిక

Cash
భారతదేశ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) నిబంధనల ప్రకారం సమ్మతి సమయపాలనలను కుదించే చర్య పెద్ద సంస్థలకు ప్రమాదాలను కలిగిస్తుందని, అదే సమయంలో స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని ఇంగోవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ నిర్వహించిన మీడియా సమావేశంలో నిపుణులు హెచ్చరించారు. DPDP ఫ్రేమ్‌వర్క్ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని స్వాగతిస్తూనే, వక్తలు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. అమలును మొదట నోటిఫై చేసిన 18 నెలల నుండి 12 నెలలకు వేగవంతం చేయడం, కొన్ని అంశాలను తక్షణమే అమలు చేయడం వల్ల అదనపు ఖర్చులు పెరగడమే కాకుండా, నియంత్రణపరమైన అనిశ్చితిని సృష్టించవచ్చని అన్నారు. ఇది భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు కీలకమైన సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని వక్తలు హెచ్చరించారు.
 
తాము నిబంధనల అమలు నుండి తప్పించుకోవాలని చూడట్లేదని వక్తలు స్పష్టం చేశారు. వ్యాపార సంస్థలు నిబంధనలను పాటించాలని కోరుకుంటున్నాయి అని పేర్కొంటూనే, ఇంతటి భారీ స్థాయి, సంక్లిష్టత కలిగిన ఈ నిబంధనలను తగిన సమయం, మార్గదర్శకత్వం, వ్యవస్థల సంసిద్ధత లేకుండా అర్థవంతంగా అమలు చేయడం సాధ్యం కాదు అని అభిప్రాయపడ్డారు.
 
ఈ సందర్భంగా ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యవస్థాపకులు శ్రీరామ్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, భారతదేశానికి బలమైన డేటా రక్షణ అవసరం. అదే సమయంలో, నిబంధనల అమలు అనేది అనాలోచితంగా వ్యాపార సంస్థలను శిక్షించే విధంగా ఉండకూడదు అని అన్నారు. డేటా, లాగ్ రిటెన్షన్(డేటా నిల్వ)తప్పనిసరి చేయడం, దానికితోడు గడువులను కుదించడం వల్ల వాస్తవిక వ్యయాలు, పునరావృతమయ్యే ఖర్చులు పెరుగుతాయి. ఇది పెద్ద వ్యాపార సంస్థల గమనాన్ని దెబ్బతీయడమే కాకుండా, స్టార్టప్‌లపై భరించలేని స్థాయి భారాన్ని మోపుతుంది. దీనిని జాగ్రత్తగా క్రమబద్ధీకరించకపోతే, ఆవిష్కరణల కంటే కంపెనీ పరిమాణానికే ఎక్కువ ప్రాముఖ్యత లభించే అసమాన పోటీ వాతావరణం ఏర్పడుతుంది అని అన్నారు.
 
విధాన రూపకర్తలు, న్యాయ, పెట్టుబడి నిపుణుల దృక్పథాలను ఒకచోట చేర్చి, డీపీడీపీ నిబంధనల కింద వేగవంతం చేయబడిన బాధ్యతల వాస్తవ ప్రభావాన్ని ఈ మీడియా సమావేశం పరిశీలించింది. నిబంధనల అమలు అనేది కేవలం కాగితపు పని కాదని, దీనికి సాంకేతిక నిర్మాణం, పాలనా వ్యవస్థలు, సంస్థాగత ప్రక్రియలలో లోతైన మార్పులు అవసరమని వక్తలు నొక్కి చెప్పారు.
 
డీపీడీపీ నియమాలు, కార్యాచరణపై అవగాహన ఇంకా చిన్న కంపెనీలు, ప్రారంభ దశ స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈ లకు పూర్తిగా విస్తరించలేదని, వీటిలో చాలావరకు ఇప్పటికీ ప్రాథమిక సమ్మతి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాయని, ప్రత్యేకమైన చట్టపరమైన లేదా సాంకేతిక నైపుణ్యానికి ప్రాప్యత లేకపోవడం వల్ల ఈ నిబంధనలు పూర్తిగా అమలు కాలేదని కూడా వక్తలు గుర్తించారు. చట్టపరమైన, కార్యాచరణ దృక్కోణం నుండి, ఇప్పుడు ఎదురవుతున్న సవాలు దానిఉద్దేశ్యం కాదు, దానిఅమలు మాత్రమే అని ఇండస్ లా పార్ట్‌నర్ శ్రేయ సూరి అన్నారు. తప్పనిసరి ఒక సంవత్సరం డేటా రిటెన్షన్, ఆడిట్ సంసిద్ధత వంటి బాధ్యతలకు వ్యవస్థలు, ఒప్పందాల గణనీయమైన పునఃనిర్మాణం అవసరం. మినహాయింపులు ఉన్న చోట కూడా, సమ్మతి భారం ముఖ్యమైనది. ఆవిష్కరణను నిరోధించకుండా చట్టం తన లక్ష్యాలను సాధిస్తుందని నిర్ధారించుకోవడానికి రిస్క్-ఆధారిత, దశలవారీ విధానం అవసరం అని అన్నారు.
 
తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్న స్టార్టప్‌లు
వ్యాపార సంస్థల వద్ద అదనపు డేటా నిల్వ సామర్థ్యం, ప్రత్యేక నిబంధనల అమలు బృందాలు లేదా డేటా ప్రాసెసింగ్ ఒప్పందాలను వేగంగా పునఃసమీక్షించే శక్తి లేవని పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. వ్యక్తిగత డేటా, ట్రాఫిక్ డేటా, ప్రాసెసింగ్ లాగ్‌లను ఒక సంవత్సరం పాటు తప్పనిసరిగా భద్రపరచడం వల్ల స్టోరేజ్, భద్రత, డేటా ఉల్లంఘన నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల స్టార్టప్‌ల వద్ద ఉన్న పరిమిత నిధులు కొత్త ఉత్పత్తుల తయారీ, నియామకాలు, మార్కెట్ విస్తరణ వంటి పనుల నుండి మళ్లించబడి, కేవలం నిబంధనల అమలుకే ఖర్చవుతాయి.
 
ఆందోళన అనేది కేవలం నిర్వహణ భారానికి మాత్రమే పరిమితం కాలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇన్వెస్టర్లు ఇప్పటికే ఈ నియంత్రణ గడువులను అత్యంత నిశితంగా గమనిస్తున్నారు. దీనికితోడు, నిబంధనలను పాటించకపోతే ఎదురయ్యే నష్టాల గురించి ఇంకా పూర్తి స్పష్టత లేకపోవడం వ్యాపార సంస్థలకు, ఇన్వెస్టర్లకు అదనపు రిస్క్‌గా మారింది. స్పష్టమైన అమలు మార్గదర్శకాలు లేని పక్షంలో, తమపై ఎంత ఆర్థిక భారం పడుతుందో అంచనా వేయలేని స్థితిలో ఉన్నామని ఇన్వెస్టర్లు వక్తలు అన్నారు. 
 
ఇన్వెస్టర్లకు నియంత్రణపరమైన ఖర్చుల నిర్మాణం చాలా కీలకం అని ఏంజెల్ ఇన్వెస్టర్ లాయిడ్ మథియాస్ అన్నారు. నిబంధనల అమలు ఖర్చుతో కూడుకున్నదిగా, అనిశ్చితంగా మారినప్పుడు, అది స్టార్టప్‌ల నగదు వ్యయ రేటు, నిర్వహణ విధానం, నిధుల కేటాయింపు నిర్ణయాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రారంభ దశలో ఉన్న కంపెనీలు తమ వృద్ధికి కేటాయించాల్సిన మూలధనాన్ని, చాలా ముందుగానే నిబంధనల అమలు కోసం మళ్లించాల్సి వస్తే, అది ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని తగ్గించడమే కాకుండా మొత్తం స్టార్టప్ వ్యవస్థలో ఆవిష్క రణల వేగాన్ని కుంటుపరుస్తుంది అని అన్నారు.
 
SDFలు, అమలు చుట్టూ అనిశ్చితి
సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యుషియరీల గుర్తింపుపై స్పష్టత లేకపోవడాన్ని కూడా నిపుణులు ఎత్తిచూపారు. మరోవైపు, ఈ SDFలకు మాత్రమే వర్తించే ఆడిట్లు, డేటా ప్రొటెక్షన్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్లు, అల్గారిథమిక్ జవాబుదారీతనం వంటి బాధ్యతల అమలు గడువులను ప్రభుత్వం తగ్గించాలని ప్రతిపాదిస్తోంది. తాము SDF వర్గంలోకి వస్తామో లేదో తెలియకుండా, కంపెనీలు బడ్జెట్‌లను ప్లాన్ చేసుకోవడం, నిపుణులను నియమించు కోవడం లేదా ముందస్తుగా పాలనా నిర్మాణాలను రూపొందించుకోవడం సాధ్యం కాదని నిపుణులు పేర్కొన్నారు.
 
అమలు సంసిద్ధతపై కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ డిజిటల్‌గా చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉండటం, వ్యక్తులు సులభంగా ఫిర్యాదులు చేసే అవకాశం ఉండటంపై నిపుణులు హెచ్చరికలు చేశారు. తగినంత సన్నద్ధత లేకుండా అపరిపక్వంగా నిబంధనలను అమలు చేయడం వల్ల వివాదాలు, జరిమానాలు, నిబంధనల అమలుపై ఆందోళన పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా సొంతంగా లీగల్ టీమ్స్ లేని స్టార్టప్‌లకు ఇది పెద్ద సవాలుగా మారుతుందని వక్తలు హెచ్చరించారు.
 
భారతదేశం తన వ్యవస్థ అంతటా గోప్యతా సంస్కృతిని పెంపొందించుకునే ప్రారంభ దశలోనే ఉందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం చాలా సంక్లిష్టమైనది. దీనికి ప్రక్రియలు, వ్యవస్థలు, జవాబుదారీతనంలో గణనీయమైన మార్పులు అవసరం. కాబట్టి, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సంస్థలు కూడా ఈ బాధ్యతలను ఆచరణలోకి తీసుకురావడానికి సమయం పడుతుంది అని వారు పేర్కొన్నారు.
 
అంచనా వేయదగిన, ప్రపోర్షనేట్ అమలు కోసం పిలుపు
తొలుత ప్రకటించిన 18 నెలల పరివర్తన గడువును యథాతథంగా కొనసాగించాలని, నిబంధనలను దశల వారీగా, కంపెనీల పరిమాణం ఆధారంగా అమలు చేయాలని, అలాగే అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను చేపట్టాలని ఈ మీడియా సమావేశం కోరింది. యూరప్‌కు చెందిన జీడీపీఆర్‌ను నిపుణులు ఇక్కడ ఉదాహరించారు. అక్కడ 2018లో చట్టం అమలులోకి రావడానికి ముందు సంస్థలకు రెండేళ్ల సుదీర్ఘ గడువు ఇచ్చారని, ఆ సమయంలో నియంత్రణ సంస్థల నుండి విస్తృతమైన మార్గదర్శకత్వం, రంగాల వారీగా స్పష్టతలు, సందేహాలకు సమాధానాలు, పర్యవేక్షక సహకారం అందించారని వారు గుర్తు చేశారు.
 
అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో డేటా రక్షణకు సంబంధించి ఒక ప్రపంచ స్థాయి ప్రమాణాన్ని నెలకొల్పే అవకాశం భారతదేశానికి ఉంది, అని వక్తలు పేర్కొన్నారు. నిబంధనల అమలును వేగవంతం చేయడం ద్వారా కాకుండా, పౌరుల డేటాను రక్షిస్తూనే దేశంలోని స్టార్టప్ వృద్ధిని కాపాడేలా-ముందుగా ఊహించదగినదిగా, సమతుల్యంగా, సమ్మిళితంగా దీనిని అమలు చేయడం ద్వారానే ఆ నాయకత్వం లభిస్తుంది.