సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (13:43 IST)

ఫ్లిప్​కార్ట్ పార్శిళ్లలో రాళ్లు, పెంకులు... ఇంటి దొంగల గుట్టురట్టు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం కంపెనీల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో పని చేస్తున్న కొందరు సిబ్బందికి ఆ కంపెనీనే లూటీ చేసేందుకు ప్రయత్నించారు. ఇందులోభాగంగా, ఫ్లిప్‌కార్ట్‌ పార్శిళ్లలో రాళ్లు, పెంకులు పెట్టిన నలుగురు ఇంటి దొంగలను కంపెనీ ప్రతినిధులు గుర్తించి పోలీసులకు పట్టించారు. 
 
తాము పని చేస్తున్న కంపెనీకే సున్నం పెట్టాలని నలుగురు కేటుగాళ్ళపై అనుమానం వచ్చి కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఘరానా మోసం బయటపడింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఫ్లిప్​కార్ట్​ పేరు మీద ఘరానా మోసాలకు పాల్పడుతున్న కొరియర్ బాయ్స్​ని పోలీసులు పట్టుకున్నారు. 
 
సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన నీర్ల కల్యాణ్, ఆనగొని వికాస్, కనుకుంట్ల అనిల్, తూటి వినయ్​లు హుజూరాబాద్ పట్టణంలోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్​కార్ట్ కొరియర్ బాయ్​గా మూడు నెలల నుంచి పనిచేస్తున్నారు. కంపెనీకి సంబంధించిన కొరియర్​లోని వస్తువులను దొంగిలించి వాటి స్థానంలో రాళ్లు, చపాతి బండలు, పెంకులు పెట్టేవారు. 
 
దొంగిలించిన వస్తువులను అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి తెలిపారు. యూట్యూబ్​లో చూసి నిందితులు యూట్యూబ్​లో చూసి ఇలాంటి తరహా నేరాలను ఎలా చేయాలో నేర్చుకున్నారని ఏసీపీ వివరించారు. వీరివద్ద జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు.