ఆర్బీఐ కీలక ప్రకటన.. ఆన్‌లైన్ నగదు బదిలీలపై రుసుముల్లేవు..
రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. జూలై ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (ఆర్‌టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములేవీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించింది.
అంతేగాకుండా బ్యాంకులు కూడా వినియోగదారుల నుంచి ఆ రుసుములు వసూలు చేయొద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నెఫ్ట్ లావాదేవీలకు రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది.
ఇలా ప్రైవేట్ బ్యాంకులు కూడా కొంత మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నగదు చలామణి తగ్గించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తాజాగా ఈ ఛార్జీలను ఆర్‌బీఐ రద్దు చేసింది.