1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (22:46 IST)

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా భారత్ పేద దేశమే : ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి

duvvuri
ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మూడోదిగా నిలిచినప్పటికీ భారతదేశం మాత్రం ఇంకా పేద దేశంగానే ఉందని భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 2029 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా అతవరించినప్పటికీ భారత్‌ పేద దేశంగానే ఉండవచ్చన్నారు. అందువల్ల మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించామని సంబరపడిపోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సౌదీ అరేబియాను ప్రస్తావించారు. ధనిక దేశంగా మారినంత మాత్రాన అభివృద్ధి చెందిన దేశంగా చెప్పలేమన్నారు. 'నా దృష్టిలో.. అది సాధ్యమే (మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం). కానీ, అది సంతోష పడాల్సిన విషయం కాదు. ఎందుకంటే.. 140 కోట్ల జనాభా ఉన్నందున మనది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అందులో ప్రజలు ఒక అంశం మాత్రమే. ప్రజలు ఉన్నారు కాబట్టే పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. అయినప్పటికీ పేద దేశమే' అని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.
 
ప్రస్తుతం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉందని, ఆర్థికవ్యవస్థ 4ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని సుబ్బారావు తెలిపారు. తలసరి ఆదాయం 2600 డాలర్లుగా ఉందని, ఇందులో భారత్‌ 139వ స్థానంలో ఉందన్నారు. బ్రిక్స్‌, జీ-20 దేశాల్లో పేద దేశంగా నిలుస్తోందన్నారు. ముందుకు వెళ్లేందుకు అజెండా స్పష్టంగా ఉందని, వృద్ధి రేటును పెంచడంతోపాటు ప్రయోజనాలు అందరికీ పంచాల్సిన అవసరం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ప్రధాని మోడీ పేర్కొనడాన్ని ప్రస్తావించారు. ఇది సాధించాలంటే స్వతంత్ర సంస్థలు, పారదర్శకత, బలమైన ప్రభుత్వం, చట్టబద్ధమైన పాలన ఉండాలన్నారు.