మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (12:57 IST)

జనవరి నుంచి సరళ్ జీవన్ బీమా పాలసీ : ఐఆర్డీయే

వచ్చే యేడాది నుంచి టర్మ్‌ సరళ్ జీవన్ బీమా పాలసి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అన్ని బీమా రంగ సంస్థలకు ఐఆర్డీయే ఆదేశాలు జారీచేసింది. ఇది నిజంగా టర్మ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ కొనుగోలు కోసం చూస్తున్నవారికి శుభవార్తే. 
 
జనవరి ఒకటో తేదీ నుంచి స్టాండర్డ్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ సరళ్‌ జీవన్‌ బీమాను ప్రారంభించాలని బీమా రంగ సంస్థలను రెగ్యులేటర్‌ ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఈ మేరకు సరికొత్త మార్గదర్శకాలను కూడా జారీచేసింది. 
 
అయితే, కస్టమర్లకు లాభించేలా సరళమైన ఫీచర్లు, స్టాండర్డ్‌ టర్మ్స్‌, షరతులతో కూడిన ఈ ప్లాన్‌కు మెచ్యూరిటీ ప్రయోజనాలు మాత్రం లేవు. అలాగే 45 రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండగా, ఈ పాలసీపై రుణాలను సైతం తీసుకోలేం. అయినప్పటికీ పాలసీలో ఆమోదిత ప్రమాదాలు, శాశ్వత వైకల్యాలకు ప్రయోజనాలున్నాయి. 
 
అలాగే, ఈ పాలసీ నాన్‌ లింక్డ్‌ నాన్‌-పార్టిసిపేటింగ్‌ ఇండివిడ్యువల్‌ ప్యూర్‌ రిస్క్‌ ప్రీమియం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. దీనివల్ల పాలసీ కాలంలో దురదృష్టవశాత్తూ బీమా తీసుకున్న వ్యక్తి చనిపోతే నామినీకి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుగుతాయి. 
 
'అన్ని బీమా సంస్థలు జనవరి 1, 2021 నుంచి స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తప్పక అందుబాటులో ఉంచాలి' అని ఐఆర్డీఏఐ తమ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అంతేగాక లింగ భేదం, స్థానికతతో నిమిత్తం లేకుండా ప్రయాణ, వృత్తి, విద్యార్హతలు చూడకుండా వ్యక్తులందరికీ ఈ పాలసీని విక్రయించాలని తెలిపింది. 
 
క్లయిమ్‌ సెటిల్మెంట్‌ సమయాల్లో వివాదాలకు తావు లేకుండా, పాలసీ విక్రయాల్లో అవకతవకలు చోటుచేసుకోకుండా బీమా సంస్థలు, బీమాదారులకు మధ్య నమ్మకాన్ని పెంచేలా ఈ స్కీం దోహదపడేలా మార్గదర్శకాలను ఖరారు చేసింది. కాగా, ఈ పాలసీని బీమా సంస్థలు కూడా స్వాగతించడం గమనార్హం.