శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (11:49 IST)

భారత్‌లో పలు అభివృద్ధి పనులకు జపాన్ ఆర్థికసాయం

భారత్‌లో పలు అభివృద్ధి పనులకు జపాన్ ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.200 కోట్లకు పైగా (2.11 బిలియన్ డాలర్లు) ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నిధులతో ఢిల్లీ మెట్రో నాలుగో దశకు ఉద్దేశించిన సాయం కూడా ఉంది. 
 
బెంగుళూరు మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు 52.03 బిలియన్ యెన్‌లు, ఢిల్లీ మెట్రో నాలుగో దశకు 119.97 బిలియన్ యెన్‌లు విడుదల కానున్నాయి. ఢిల్లీ మెట్రోకు మొదటి నుంచీ జపాన్ సాయం చేస్తూ వస్తోంది. 1997 నుంచి ఓడీయే రుణం కింద సుమారు 47 వేలకోట్ల సాయం లభించింది. 
 
హిమాచల్ ప్రదేశ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రమోషన్ రెండో దశ  ప్రాజెక్టుకు 11.30 బిలియన్ యెన్‌ల ఆర్థిక సాయం లభించబోతోంది. రాజస్థాన్ గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ రెండో దశకు, ఫ్లోరోసిస్ మిటిగేషన్ (నివారణ)కు కూడా జపాన్ నుంచి 45.816 బిలియన్ యెన్‌లు అందనున్నాయి. 
 
ముఖ్యంగా రాజస్థాన్‌లోని రెండు జిల్లాలలో (జునిజ్ను, బార్మర్) గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు ఈ సాయం ఉద్దేశించినది. అండమాన్ నికోబార్ దీవుల్లో పవర్ సప్లయ్ ప్రాజెక్టులకు 4.01 బిలియన్ యెన్‌ల రుణం లభిస్తుందని జపాన్ ఎంబసీ తెలిపింది. 
 
ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ అదనపు కార్యదర్శి సీ.ఎస్. మహాపాత్ర, జపాన్ రాయబారి సతోషి సుజుకీ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ముఖ్యంగా ఇండియాకు సంబంధించిన ఈ రుణసాయం తాలూకు ఒడంబడిక కుదిరింది.