పంచకావ్యం పేరుతో నంది బ్రాండ్ సేంద్రీయ ఎరువులు
పంచకావ్యం పేరుతో సేంద్రీయ ఎరువులు మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. చెన్నై కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న సుబ్రమణియన్ నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 'పంచకా
పంచకావ్యం పేరుతో సేంద్రీయ ఎరువులు మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. చెన్నై కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న సుబ్రమణియన్ నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 'పంచకావ్యం' పేరుతో ఈ సేంద్రీయ ఎరువులను తయారు చేయనుంది. ఆర్గానిక్ గ్రీన్ రెవల్యూషన్ సృష్టించేందుకు ఈ రంగంలోకి అడుగుపెట్టినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఎరువులను నంది బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ సేంద్రీయ ఎరువులు పంటలకు, భూమికి ఎలాంటి హాని కలిగించని విధంగా ప్రకృతి సహజసిద్ధంగా లభించే ఎరువులతో తయారు చేస్తున్నట్టు పేర్కొంది.
ఇదే అంశంపై ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హరికుమార్ సుబ్రమణియన్ ఆదివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తాము ఉత్పత్తి చేసే సేంద్రీయ ఎరువులను మార్కెట్ చేసేందుకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పది శాఖలు ఉన్నట్టు తెలిపారు. ఈ శాఖల ద్వారా పశువుల దాణాతో పాటు.. తాము తయారు చేసే సేంద్రీయ ఎరువులను సరఫరా చేస్తామని తెలిపారు.
ఇందుకోసం తాము సొంతంగా ఒక గోశాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ నుంచి సేంద్రీయ ఎరువుల తయారీ కోసం ఉపయోగించే ముడిపదార్థాలను సేకరిస్తామన్నారు. అలాగే, ప్రముఖ పాడి ఉత్పత్తి సంస్థ అమూల్‌తో కూడా ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇందులోభాగంగా, ఈ సంస్థకు చెందిన ఆవులకు అవసరమైన దాణాను సరఫరా చేస్తామన్నారు.
నంది బ్రాండ్ పేరుతో తాము తయారు చేసే పంచకావ్యం ఎరువులను ఉపయోగించడం వల్ల రైతులకు అధిక దిగుబడి వస్తుందన్నారు. అలాగే, కిలోకు రూ.2 చొప్పున ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. అదేవిధంగా జిల్లాల స్థాయిలో డీలర్లను కూడా నియమించనున్నట్టు తెలిపారు.